తెలంగాణ డీట్ యాప్లో.. అదే రెజ్యూమ్ తయారు చేస్తుంది.. 38 వేల స్కిల్స్తో అద్భుతం

తెలంగాణ డీట్ యాప్లో.. అదే రెజ్యూమ్ తయారు చేస్తుంది.. 38 వేల స్కిల్స్తో అద్భుతం

ప్రైవేట్ సంస్థల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రైవేట్ కొలువులు పొందేలా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ ను తీసుకొచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) ఆధారంగా పని చేస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలతో లింక్ చేసేలా అధికారులు యాప్ ను అభివృద్ధి చేశారు. దీన్ని పల్లెలోని నిరుద్యోగులు, విద్యార్థులు కూడా వాడుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. 

డీట్ యాప్లో 38 వేల స్కిల్స్

 డీట్ యాప్ లో విద్యార్థులు /నిరుద్యోగులు, కంపెనీలకు వేర్వేరుగా రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నాక విద్యార్థులు, నిరు ద్యోగులు.. అందులో ఈ -మెయిల్ లేదా పోన్ నంబర్ తో రిజిస్టర్ అయి తమ వ్యక్తిగత వివరాలు, విద్యా ర్హతలు, వారికున్న నైపుణ్యాల వివరాలను ఎంటర్ చేయాలి. వారి వివరాల ఆధారంగా ఏఐ అల్గారిథం ద్వారా యాప్ లోనే ఆటోమేటిక్ గా ఓ రెజ్యూమె కూడా తయారవుతుంది. ఈ యాప్లో 38 వేల స్కిల్స్ ను పొందుపరిచారు. 

అభ్యర్థుల విద్యార్హతలకు అనుగుణంగా పార్ట్ టైమ్, పుల్ టైమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి అవకాశాలతో పాటు ఇంటర్న్ షిప్ చాన్స్ లు  కూడా కల్పిస్తున్నారు. అయితే, ఎప్పటికప్పుడు డీట్ యాప్ లేదా ఆన్ లైన్ లో లాగిన్ అయి జాబ్స్ గురించి చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 3 నెలల పాటు లాగిన్ కాకుంటే.. సదరు అభ్యర్థిని ఇనాక్టివ్ జాబ్ సీకర్ కింద పెడతారని చెబుతున్నారు. 

ప్రముఖ కంపెనీలు నమోదు.. 

డీట్ యాప్ లో ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఆటోమొబైల్స్, ఐటీ, ఫార్మా, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఔట్ సోర్సింగ్, మ్యాన్ ఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్  రంగాలకు చెందిన సంస్థలు డీట్ లో నమోదు చేసుకున్నాయి. డాక్టర్ రెడ్డీస్, ఫాక్స్ కాన్, బీడీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్పీఐ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్, భారత్ హ్యుండయ్, డెక్స్ టారా డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, డియోస్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, జీఐఎస్ఇండ్, హెచ్ బీ ఫైనాన్స్ సర్వీసెస్, హెస్ఆర్ చాంబర్స్ ఔట్ సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్, క్విన్ కార్స్ లిమిటెడ్, రాయ్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ, సెయిలో టెక్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీచక్ర పాలిప్లాస్టి ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎస్ఎస్ఏ సొల్యూషన్స్, స్టాన్స్ టెక్నాలజీస్, సింక్రోసర్ గ్లోబల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, థరారే గ్లోబల్ సొల్యూషన్స్, వాలరో టెక్నాలజీస్, వి మేక్ స్కాలర్స్, యంగ్ స్టర్స్ ఆఫ్ హైదరాబాద్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వంటి సంస్థలు అందులో ఉన్నాయి. 520 లెక్చరర్, టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ డీట్ ద్వారా ఎన్రోల్ చేసుకుంది.