హైదరాబాద్: ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ-2024 పాలసీని విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎంఎస్ఎంఈ-2024 పాలసీని బుధవారం విడుదల చేశారు. జీఎస్డీపీలో ఎక్కువ వాటా కలిగిన ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని కొద్ది నెలల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐదారు అంశాల్లో ఎంఎస్ఎంఈలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గుర్తించినట్టు తెలిసింది. వాటికి పరిష్కారాలు చూపించడంతో పాటు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా మరిన్ని విధానాలను తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.
రాష్ట్రంలోని మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీలు గండాలు దాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలసీతో ముందుకొచ్చింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆయా పరిశ్రమలు కరోనా తర్వాత చాలా వరకు డీలా పడ్డాయి. వేలాది కంపెనీలు మూతపడగా.. వేలాది మంది ఉపాధిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే, గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. వేలాది కంపెనీలు మూతపడినా వాటిని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నించలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
రాష్ట్రంలో 26 లక్షలకుపైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అయితే, కరోనా తర్వాత వేలాది సంస్థలు మూతపడ్డాయి. వర్కింగ్ క్యాపిటల్ లేక, పనిచేసే వారు దొరక్క.. సంస్థలను చాలా మంది మూసేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సంస్థల్లో 56 శాతం సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మరో 44 శాతం పట్టణాల్లో ఉన్నాయి. అయితే, రూరల్ ఏరియాల్లో మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ పదేండ్లలో కేవలం 19,954 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) 30 వరకు ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయగా.. 2,700 ఎకరాల వరకు ల్యాండ్‌ను ఎంఎస్ఎంఈలకు ఇచ్చింది. ఆరు కొత్త పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండగా.. మరో 12 పార్కులను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.