317 జీవో సవరణకు వేగంగా అడుగులు

317 జీవో సవరణకు వేగంగా అడుగులు
  •     త్వరలో కేబినెట్ సబ్  కమిటీ భేటీ
  •     ఈ నెలాఖరులో సీఎంకు రిపోర్ట్ ఇవ్వనున్న మంత్రులు

హైదరాబాద్, వెలుగు: సర్కారు  ఉద్యోగులు, టీచర్లకు పెద్ద ఇబ్బందిగా మారిన 317 జీవో సవరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాలకు, జోన్లకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం గత బీఆర్ఎస్​ ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చింది. దీంతో టీచర్లు, ఉద్యోగులు, పంచాయతీ సెక్రటరీలు ఇలా అన్ని శాఖల ఉద్యోగులు  స్థానికత, సీనియారిటీ కోల్పోయి, దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. కాగా, జీవో లో సవరణలు చేసి, ఉద్యోగులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ చైర్మన్ గా.. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మెంబర్లుగా ఉన్నారు. పలుసార్లు భేటీ అయిన మంత్రులు.. ఉద్యోగులు, టీచర్లు, సంఘాల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. తాజాగా ప్రభుత్వం ఇందుకోసం ఆన్ లైన్ గ్రీవెన్స్ సిస్టమ్ ను  ప్రారంభించింది. 317 తో పాటు 46 జీవోపై కూడా సలహాలు, సూచనలు అందచేయాలని ప్రభుత్వం కోరింది. 

317 జీవోతో ఎక్కువగా నష్టపోయింది ఉద్యోగులు, టీచర్లే

317 జీవోతో అన్ని శాఖల ఉద్యోగులు, సుమా రు 40 వేల మంది టీచర్లు భారీగా నష్టపోయారు.  317 జీవోలో 13 జిల్లాల్లో ఆప్షన్లు పెట్టుకునేందుకు టీచర్లకు అవకాశం ఇవ్వలేదని, దీంతో స్పౌజ్ తో పాటు ఇతర సమస్యలు ఏర్పడ్డాయని ఉద్యోగులు చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సీనియర్లకు ఎక్కువ అవకాశం ఇవ్వగా.. హైదరాబాద్ శివార్లలో అప్షన్లు పెట్టుకొని అక్కడకు బదిలీ అయ్యారు. కానీ..జూనియర్ ఉద్యోగులు మహబూబ్ నగర్, వరంగల్ లోని దూరంగా ఉన్న కొత్త జిల్లాలు ములుగు, భూపాలపల్లి, నారాయణపేట కు బదిలీ అయ్యారని ఉద్యోగ సంఘం నేతలు చెప్తున్నారు. జీవో సవరణలో భాగంగా సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి, నష్టపోయిన ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ జీవో తో నష్టపోయిన ఉద్యోగులు బదిలీ అయి 3 ఏండ్లు పూర్తి కాలేదని, ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని స్థానికత ఉన్న జోన్ లోని జిల్లాలకు బదిలీ చేయాలని కోరుతున్నారు.

కార్యదర్శులకు న్యాయం చేయాలి

రాష్ర్టంలో  పంచాయతీ  సెక్రటరీలు ( సీనియర్లు)   3,500 మంది ఉండగా.. ఇందులో 70 0 మంది 317 జీవోతో నష్టపోయారు. స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా మేడ్చల్ స్థానిక త ఉన్న సెక్రటరీని నిజామాబాద్ జిల్లాకు, మహ బూబ్ నగర్ జిల్లా స్థానికత ఉన్న సెక్రటరీని నారాయణఖేడ్ కు బదిలీ చేశారని సెక్రటరీలు చెప్తున్నారు. సొంత జిల్లా జోన్లకు సెక్రటరీలను బదిలీ చేయాలని కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క ను సెక్రటరీలు కోరుతున్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందే ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని సెక్రటరీలు సూచిస్తున్నారు.

త్వరలో కేబినెట్​ సబ్​ కమిటీ మీటింగ్ 

ఎంపీ ఎన్నికల కోడ్ ముగియడంతో త్వరలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. గతంలో మంత్రులకు ఉద్యోగులు, టీచర్లు, యూనియన్లు అందించిన వినతిపత్రాలను ఇప్పటికే అధికారులు పరిశీలించి, రిపోర్ట్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఆన్ లైన్ గ్రీవెన్స్ సెల్ లో వచ్చిన విజ్ఞాపనలను సైతం అధికారులు పరిశీలించి, మంత్రులకు రిపోర్ట్ అందజేయ నున్నారు. ఈ నెలాఖరు కల్లా జీవో సవరణపై రిపోర్ట్ రెడీ చేసి, సీఎంకు అందించనున్నారు.