సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం : భట్టి విక్రమార్క

సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం : భట్టి విక్రమార్క
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల 
  • ఉమ్మడి జిల్లాలో గ్రాండ్​గా నాలుగు పథకాల ప్రారంభం
  • ఆయా నియోజవర్గల్లో ఎమ్మెల్యేలు, అధికారులు హాజరు 

నెట్​వర్క్, వెలుగు : రాష్ట్రంలో సంపదను సృష్టించి నిరుపేదలకు పంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్​చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల  రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్​ కార్డుల పంపిణీ పథకాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొణిజర్ల మండలం చినగోపతిలో భట్టి విక్రమార్క, ముదిగొండ మండలం ఖానాపురంలో కోమటిరెడ్డి,  రఘునాథపాలెం మండలం మల్లేపల్లిలో తుమ్మలతోపాటు ఆయా నియోజవకర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు ప్రారంభించారు.

డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగాన్ని నేడు అమలు చేసుకున్న పవిత్రమైన రోజున నాలుగు కొత్త పథకాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సాచురేషన్ పద్ధతిలో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో పాలకులు రైతు కూలీలు, పేదలకు ఇండ్ల గురించి ఆలోచన చేయలేదన్నారు. భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయం, ఇండ్లు లేని చివరి పేద కుటుంబానికి ఇండ్లు ఇచ్చేవరకు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పథకాల అమలు పట్ల కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. నేడు మంజూరు పత్రం ఇచ్చిన ప్రతి రైతుకు, రైతు కూలీ బ్యాంకు ఖాతాలో సోమవారం నిధులు జమ అవుతాయన్నారు.

Also Read :- టూరిస్టులకు ఇండ్లలోనే నివాసం, భోజన వసతి.!

గత పాలకులు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని, తమ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేసిందని తెలిపారు. సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ ల ఉచిత విద్యుత్, 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మెటిక్ చార్జీలు పెంపు లాంటి అనేక కార్యక్రమాలు అమలు చేసామన్నారు. మహిళా సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కు ప్రణాళికలు తయారు చేశామని చెప్పారు. త్వరలోనే రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నరకం బియ్యం సరఫరా చేస్తామన్నారు. 

ప్రతి హామీ అమలు చేస్తాం......

గ్రామంలోని వివిధ పథకాల లబ్ధిదారులతో మంత్రి కోమటిరెడ్డి నేరుగా మాట్లాడుతూ వారికి వచ్చే లబ్ధి వివరాలను వివరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. గతంలో పేదలకు పని కల్పించేందుకు చట్టబద్ధతను కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, భూమిలేని నిరుపేదలకు నేడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆర్థిక సహాయం అందించనున్నామని తెలిపారు. కిరాయి ఇండ్లలో ఉంటున్న పేదల ఇబ్బందులను తొలగించేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. గతంలో వైయస్సార్ హయాంలో పూర్తి స్థాయిలో పేదలకు ఇల్లు నిర్మించామని, నేడు అదే తీరులో గ్రామాలలో ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. 

ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతాం

రాష్ట్రంలోనే రఘునాథపాలెం మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి తుమ్మల అన్నారు.  ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను గ్రామ సభల ద్వారా పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అందిస్తున్నామని, మొదటి దశలో గుడిసెలో ఉండే పేదలకు ఇస్తామని తెలిపారు. కొణిజెర్లలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ చివరి దశకు చేరుకుంటుందని, ఉగాది నాటికి పూర్తి చేసుకుంటే రైతులకు ఉపయోగపడుతుందన్నారు.

మండలంలో మంచుకొండ ఎత్తిపోతల పథకం ఉగాది కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో రూ.38 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపట్టామన్నారు. అనంతరం రూ. 66.33 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్​ పైప్ లైన్ నిర్మాణ పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు. 

కాగా  కొణిజర్ల మండలం చినగోపతిలో డిప్యూటీ సీఎంతో పాటు ఎమ్మెల్యే రాందాస్​నాయక్, ఇల్లెందు మండలం పూబెల్లి, టేకులపల్లి మండలం కోయగూడెంలో కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలంలో  పట్టణంలోని సుభాష్​నగర్​ కాలనీలో ఐటీడీఏపీవో రాహుల్, కరకగూడెం మండలం రేగళ్లలో, బుర్గంపహాడ్​ మండలం సోంపల్లిలో  ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు, ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లిలో, చండ్రుగొండ మండలంలోని బెండాలపాడులో , అన్నపురెడ్డి పల్లి మండలం జానకీపురంలో, అశ్వారావుపేట మండలం పాత రెడ్డిగూడెంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కల్లూరు మండల పరిధిలోని తూర్పులోకారం గ్రామంలో ఎమ్మెల్యే మట్టా రాగమయితోపాటు అధికారులు, నాయకులు హాజరై నాలుగు పథకాలను ప్రారంభించారు. ఆ కార్యక్రమాల్లో అడిషనల్​కలెక్టర్లు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.