సర్కారు బడుల్లో సర్వే .. థర్డ్​ పార్టీ ద్వారా పాఠశాలల వారీగా సమగ్ర వివరాల సేకరణ

సర్కారు బడుల్లో సర్వే .. థర్డ్​ పార్టీ ద్వారా పాఠశాలల వారీగా సమగ్ర వివరాల సేకరణ
  • ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టనున్న ప్రభుత్వం
  • సర్వే కోసం బీఈడీ, డీఈడీ విద్యార్థులకు శిక్షణ

మహబూబాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రతి ఏడాది ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయినప్పటికీ ఆయా స్కూళ్లలో వసతులపై సరైన సమాచారం లేకపోవడంతో, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య, వసతులపై క్షేత్ర స్థాయిలో ఆరా తీసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి 21 వరకు బీఈడీ, డీఈడీ విద్యార్థులతో సర్వే నిర్వహిస్తోంది. ఉమ్మడి వరంగల్​ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, వరంగల్, ములుగు, జనగామ, హనుమకొండ, జయశంకర్​భూపాలపల్లి జిల్లాలో సర్వే నిర్వహించడానికి ఇప్పటికే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో సర్వే షురూ అయ్యింది. 

థర్డ్ పార్టీ సర్వేతో సమగ్ర వివరాల సేకరణ.. 

ప్రభుత్వ పాఠశాలల్లో సర్కార్​ కల్పించిన కనీస సౌకర్యాలపై ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతోపాటు, హెచ్​ఎంలు యూడైస్ ప్రకారం ఇస్తున్న వివరాలు గందరగోళంగా మారుతున్నాయి. పాఠశాలలకు నిధులు తక్కువగా మంజూరవుతాయనే కారణంతో  చాలా వసతులు ఉన్నప్పటికీ లేవని నమోదు చేయడం పరిపాటిగా మారింది. థర్డ్​ పార్టీ సర్వే చేపడితే పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలపై కచ్చితమైన సమాచారం లభించనుంది. పాఠశాలలో విద్యుత్, కంప్యూటర్లు, టాయిలెట్స్, తాగు నీరు. వంటగదులు, స్కావేంజర్లు, ప్రహరీలు, బ్లాక్​బోర్డులు, భవనాల స్థితిగతులు, గ్రౌండ్, తరగతి గదులు, విద్యార్థులు, టీచర్ల సంఖ్య ఇతర వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేసి నివేదిక అందించనున్నారు. 

సర్వేకు సహకరించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై సర్వే చేపట్టే బీఈడీ, డీఈడీ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, హెచ్​ఎంలు సహకరించాలి. సర్వేలో ఏదైతే వారు గుర్తిస్తారో, ఆ వివరాలు యూడైస్ నివేదికలో సరిచేస్తూ సమగ్ర వివరాలు నమోదు చేయాలి. పాఠశాలల వారీగా వాస్తవ వివరాలు తెసుకునే అవకాశం దక్కుతుంది. ఈ నెల 21 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో సర్వే కొనసాగుతుంది. 

రవీందర్​రెడ్డి, డీఈవో, మహబూబాబాద్​ జిల్లా