పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగు : ఉత్తమ్​, తుమ్మల

పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగు : ఉత్తమ్​, తుమ్మల
  • మంత్రులు ఉత్తమ్​, తుమ్మల 

సూర్యాపేట, యాదాద్రి, వెలుగు : సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు ఉత్తమ్​కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యాదాద్రి, సూర్యాపేట, జిల్లాల్లో వేర్వేరుగా జరిగిన సంక్షేమ పథకాల ప్రారంభ మీటింగ్​ల్లో మంత్రులు మాట్లాడారు. అర్హులైన ప్రతిఒక్కరికీ దశలవారీగా సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు. ఇప్పటికే రుణమాఫీ చేయడంతోపాటు గృహజ్యోతి, మహాలక్ష్మి అమలు చేశామన్నారు. రాజీవ్​ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచామన్నారు.

గత ప్రభుత్వం పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తాము మాత్రం ఏడాదిలోనే ఇస్తున్నామని చెప్పారు. రేషన్​ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినడం లేదని, అందుకే రేషన్​ కార్డుల పంపిణీ పూర్తయిన తర్వాత సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. స్టేట్​లో 155 లక్షల టన్నుల వడ్ల దిగుబడి వచ్చిందని చెప్పారు. సాగయ్యే ప్రతి ఎకరానికి రైతు భరోసా కింద రూ.12 వేలు, భూమి లేని కూలీలకు రూ. 12 వేల చొప్పన అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి సొంత ఇంటి కల నెరవేరబోతుందని తెలిపారు. 

సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. నల్గొండ మండలం గుండ్లపల్లిలో లబ్ధిదారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి, జిల్లా నోడల్ అధికారి అనితారామచంద్రన్ ప్రొసీడింగ్​పత్రాలను అందజేశారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో భువనగిరి ఎంపీలు చామల కిరణ్​కుమార్​ రెడ్డి, టూరిజం కార్పొరేషన్​ చైర్మన్​ పటేల్​రమేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, జగదీశ్ రెడ్డి, అధికారులు​పాల్గొన్నారు.