
- 25 శాతం రాయితీ తర్వాత పెరిగిన వసూళ్లు
- ఇప్పటి వరకు 911 కోట్ల ఫీజు వసూలు
హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించే గడువును మరో నెల రోజుల పాటు పెంచాలని డైరెక్టోరేట్ఆఫ్ టౌన్ అండ్కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ గడువు సోమవారంతో ముగియనుండగా మరో నెల పాటు పెంచాలని లేఖలో పేర్కొంది. ఎల్ ఆర్ ఎస్ ఫీజు చెల్లించేందుకు ఇటీవల 25 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. రాయితీ ప్రకటించిన తరువాత నుంచి ఫీజు వసూళ్లు పెరిగాయని డీటీసీపీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో నెల పాటు గడువు పొడిగిస్తే ఫీజులు గతం కంటే మరింత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎల్ఆర్ఎస్కు 15,27,360 అప్లికేషన్లు రాగా.. అందులో 10,76,700 అప్లికేషన్లను అధికారులు ఒకే చేసి ఫీజు చెల్లించాలని సమాచారం పంపారు. ఇందులో సోమవారం వరకు 1,82,714 మంది ఫీజు చెల్లించారు. దీంతో ఇప్పటి వరకు రూ. 911.2 కోట్లు వసూలు అయింది. ఫీజు పేమెంట్ పెండింగ్ అప్లికేషన్లు 8 లక్షల 93 వేలు ఉన్నాయి. ఫీజు ఎక్కువ వచ్చిన జిల్లాల్లో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ టాప్ లో ఉన్నాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
10 వేల కోట్ల టార్గెట్
ఎల్ఆర్ఎస్ ద్వారా రూ. 10 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సుమారు 14.5 లక్షలకు పైగా అప్లికేషన్లు ఉన్నాయి. అయితే, ప్రతి అప్లికేషన్ ను రెవెన్యూ, ఇరిగేషన్, డీటీసీపీ అధికారులు పరిశీలించి అప్రూవల్ ఇవ్వాల్సి ఉండటం, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జిల్లాల్లో తీరిక లేకుండా ఉండడంతో లేట్ అయిందని అధికారులు చెబుతున్నారు.
మరో వైపు మున్సిపల్ ఆఫీసర్లకు సైతం ఏడాది పాలన వేడుకలు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, కులగణన, వార్డు సభలు, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ తో తీరిక లేకుండా ఉండటంతో లేట్ అయింది. మొత్తం అప్లికేషన్ల లో 10 లక్షల మంది ఫీజు కట్టినా రూ. 7 వేల కోట్లు వసూలు అవుతుందని డీటీసీపీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గడువు పెంచే అంశంపై నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.