స్పోర్ట్స్​గ్రౌండ్​ లేకుంటే..  ప్రైవేట్ స్కూళ్లకు నో పర్మిషన్ : ఏపీ జితేందర్ రెడ్డి

  • గత ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది: జితేందర్​ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రైవేట్ పాఠశాలలకు క్రీడా మైదానం లేకుంటే ఇక నుంచి అనుమతులు ఇచ్చేది లేదని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి(ఎస్సార్) ఏపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ప్రైవేట్ పాఠశాలలకు క్రీడా మైదానం లేకపోయినా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇకపై కచ్చితంగా స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండాలని. ఒకవేళ సొంత గ్రౌండ్ లేకపోతే అద్దె మైదానమైనా ఉండాలనే నిబంధన పెడుతున్నామని చెప్పారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ హయాంలో తెలంగాణలో క్రీడలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. స్పోర్ట్స్ అవసరమా? అంటూ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా క్రీడాకారుడు, క్రీడా ప్రేమికుడని అన్నారు. అందుకే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు సేకరించి క్రీడాకారుల సంక్షేమం, సౌలతుల కల్పనకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా అమలు చేస్తోందన్నారు. ఇతర ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నట్టు వెల్లడించారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపారు. ఒలింపిక్స్ లో ఉన్న 38 రకాల క్రీడల్లో క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

పర్యాటక అభివృద్ధికి సహకరించండి

తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని జితేందర్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్​ను కోరారు. బుధవారం ఢిల్లీలో మంత్రిని కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా తెలంగాణ లో పెండింగ్ లో ఉన్న పలు పర్యాటక ప్రాజెక్టుల పురోగతికి నిధులు విడుదల చేయాలని కోరారు.