చనిపోయిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలేవి? ..రోడ్డున పడ్డ 178 వీఆర్వోల కుటుంబాలు

కరీంనగర్, వెలుగు: రెవెన్యూ శాఖలో ఏండ్ల తరబడి పని చేస్తూ చనిపోయిన వీఆర్ఏలు, వీఆర్వోల కుటుంబాలపై సర్కార్ కారుణ్యం చూపడం లేదు. వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంలో తహసీల్దార్లు, కలెక్టర్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో వారి వారసులు అప్లికేషన్లు పట్టుకుని ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంటి పెద్ద చనిపోవడం, ఇంట్లో మరొకరికి జాబ్ రాకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డునపడాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారు సుమారు వెయ్యి మంది వరకు ఉంటారని అంచనా. మరో వైపు వీఆర్​వో వ్యవస్థ రద్దుకు కొద్ది నెలల ముందు, అలాగే వీఆర్​వోలను ఇతర శాఖల్లో విలీనం చేసిన రెండేండ్ల కాలంలో కరోనా, రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో 178 మంది వీఆర్​వోలు తనువు చాలించారు. ఈ కుటుంబాలకు కూడా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు.  

చనిపోయే దాక డ్యూటీలోనే..

రాష్ట్ర సర్కార్​లో పని చేసే ఇతర ఉద్యోగుల రిటైర్​మెంట్ ఏజ్ 61 ఏండ్లు కాగా, ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్​మెంట్ చేసిన వీఆర్ఏల రిటైర్మెంట్ ఏజ్ 65 ఏండ్లుగా ఉంది. అయితే, డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కాని వీఆర్ఏలకు మాత్రం ఎలాంటి రిటైర్మెంట్ ఏజ్ లేదు. దీంతో వృద్ధాప్యం వచ్చినా చనిపోయే వరకూ డ్యూటీలోనే కొనసాగుతున్నారు. అందుకే సోమవారం సీసీఎల్ఏ అడిగిన వివరాల్లోనూ ఏజ్ గ్రూప్ కాలమ్ లో 100 ఏండ్లు దాటిన వీఆర్ఏల వివరాలు కూడా చేర్చారు. రెవెన్యూ శాఖలో దశాబ్దాలుగా పని చేస్తున్న వీఆర్ఏల్లో సుమారు 3 వేల మందికి ఇప్పటికే 65 ఏండ్లు దాటగా.. చేతకాకపోవడంతో వీరి వారసులు  తండ్రుల పేరుపైనే పని చేస్తున్నారు. 55–65 ఏండ్ల మధ్య మరో 4 వేల మంది వరకు ఉండగా వీరంతా ఉద్యోగమిస్తే తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. పని చేస్తూనే వృద్ధాప్యంతో చనిపోయిన కొన్నిచోట్ల కొందరు తహసీల్దార్లు వారి వారసులకు జాబ్స్​ఇవ్వగా, చాలా చోట్ల తహసీల్దార్లు కొర్రీలు పెట్టారు. ఇలా జాబ్ కు నోచుకోని కుటుంబాలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యి మంది వరకు ఉంటాయని అంచనా. వీఆర్ఏల జాబ్ రెగ్యులరైజేషన్ నేపథ్యంలో తమకూ న్యాయం చేయాలని  వీఆర్ఏల కుటుంబసభ్యులు కోరుతున్నారు. సీసీఎల్ఏ అడిగిన ప్రొఫార్మాలో తమ పేర్లు కూడా జత చేసి పంపాలంటున్నారు.

రోడ్డున పడ్డ 178 వీఆర్వోల కుటుంబాలు 

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చే క్రమంలో 2020 సెప్టెంబర్ 7న వీఆర్​వో వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత వారు ఎలాంటి డిజిగ్నేషన్ లేకుండా సుమారు 22 నెలలు రెవెన్యూ శాఖలోనే పని చేశారు. వీరిని నిరుడు ఆగస్టు 1న లాటరీ ద్వారా ఇతర శాఖల్లోకి పంపించారు. అయితే వీఆర్వో వ్యవస్థ రద్దుకు కొన్ని నెలల ముందు, వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత 178 మంది వీఆర్వోలు అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో చనిపోయారు. వీరంతా ఆయా జిల్లాల కలెక్టర్ల వద్ద కారుణ్య నియామకం కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దు కావడం, వీరి కారుణ్య నియామకాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ లేకపోవడంతో కలెక్టర్లు ముందుకెళ్లడం లేదు.