ఆలయాల్లో పాలకవర్గాలకు నోటిఫికేషన్

ఆలయాల్లో పాలకవర్గాలకు నోటిఫికేషన్
  • మొత్తం 546లో 408 కమిటీలకు ప్రకటన
  • ఇంకా పెండింగ్ లో 81 అడ్మినిస్ట్రేషన్లు

హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలో ఆలయాలకు పాలకవర్గాలను నియమించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్  జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 546 కమిటీలు ఉండగా.. ప్రభుత్వ పరిధిలో 56 కమిటీలు, ధార్మిక పరిషత్ (రెనోవేషన్  కమిటీ) పరిధిలో 118, కమిషనర్  పరిధిలో 372 కమిటీలు ఉన్నాయి. గవర్నమెంట్  పరిధిలోని 27 కమిటీలు, ధార్మిక పరిషత్  పరిధిలో 41, కమిషనర్  పరిధిలో 340 ఆలయ కమిటీలకు ప్రభుత్వం నోటిఫికేషన్  జారీ చేసింది.

కోర్టు స్టేలో 47 కమిటీలు, 10 కమిటీలకు మినహాయింపు ఇచ్చింది. 81 కమిటీలను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. అందులో గవర్నమెంట్  పరిధిలో 22 ఉండగా, ధార్మిక పరిషత్  పరిధిలో 59 ఉన్నాయి. నోటిఫికేషన్ వేసిన కమిటీలను 20 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, ఇప్పటికే 408 కమిటీలకు నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఇవ్వడంతో సగానికి పైగా కమిటీలను నియమించినట్లు దేవాదాయ అధికారులు తెలిపారు.  పెండింగ్ లో ఉన్న 81 కమిటీలకు సైతం త్వరలోనే నోటిఫికేషన్  వెలువడనున్నట్లు తెలిసింది. 

పది ఆలయాలకు పాలకవర్గాల్లేవ్ 

రాష్ట్రంలోని పది ఆలయాలకు ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడంతో కమిటీలను పెండింగ్ లో ఉంచామని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ లోని వీర హనుమాన్  ఆలయం, బాకారంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి టెంపుల్, ఆదిలాబాద్  పట్టణంలోని రామచంద్ర గోపాలకృష్ణ మఠ్, ధార్మిక పరిషత్ (రెనోవేషన్ కమిటీ) ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గంలోని లక్ష్మణ్ జీ మహరాజ్ ఆలయం, ఆదిలాబాద్ లోని మార్వాడీ పంచాయత్  భవన్ ధర్మశాల, భువనగిరి జిల్లా అనంతారంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం, నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం, కరీంనగర్  గణేష్  నగర్ లోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయం, ఆదిలాబాద్ లోని మంగంమఠ్  ఆలయాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.