మెడికో ప్రీతి మృతిపై సర్కారుకు హైకోర్టు నోటీసులు

  • కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఆదేశం
  • ప్రీతిది హత్యేనని ఎస్సీ ఎంప్లాయీస్‌‌ వెల్ఫేర్‌‌ అసోసియేన్‌‌ అధ్యక్షుడు లేఖ
  • పిల్‌‌గా పరిగణించి విచారణ చేపట్టిన కోర్టు 

హైదరాబాద్, వెలుగు: మెడికో ధరావత్‌‌ ప్రీతి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిల్​ను విచారించిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ఎస్సీ ఎంప్లాయీస్‌‌ వెల్ఫేర్‌‌ అసోసియేన్‌‌ అధ్యక్షుడు ఎం.మల్లయ్య రాసిన లెటర్‌‌ను పిల్​గా పరిగణించిన కోర్టు.. చీఫ్‌‌ సెక్రటరీ, మెడికల్‌‌ అండ్‌‌ హెల్త్‌‌ ముఖ్య కార్యదర్శి, డీఎంఈ, వరంగల్‌‌ పోలీస్‌‌ కమిషనర్, కాకతీయ మెడికల్‌‌ కాలేజీ ప్రిన్సిపాల్, అనస్తీషియా విభాగం చీఫ్‌‌లకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ‘ప్రీతిని కులం పేరుతో వేధించారు. ర్యాగింగ్‌‌ చేశారు. దారుణంగా హత్య చేశారు.

దీనిపై పోలీసుల ఎంక్వైరీ సమగ్రంగా జరగడం లేదు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. లేదంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలి. బాధ్యులపై క్రిమినల్‌‌ కేసులు నమోదు చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. అనస్తీషియా హెచ్‌‌వోడీ, కాలేజీ ప్రిన్సిపాల్​ను సస్సెండ్‌‌ చేసి వాళ్లపైనా చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్‌‌ జీవో 13 ప్రకారం ప్రీతి కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారాన్ని చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలి’ అని మల్లయ్య హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లెటర్​ను పిల్‌‌గా పరిగణించిన హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ తుకారాంజీలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ మంగళవారం విచారించింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి విచారణను జులై 28వ తేదీకి వాయిదా వేసింది.