వరంగల్: కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీసీ రమేశ్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు చర్యలు చేపట్టారు అధికారులు. అక్రమ నియామకాలు, బదిలీలు, ఫేక్ ప్రాజెక్టులకు అప్రూవల్స్ తదితర అక్రమాలపై ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు సర్కారుకు ఫిర్యాదు చేశారు.
పీహెచ్ డీ సీట్ల కేటాయింపులోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనర్హులకు సీట్లు కేటాయించారని గతంలో విద్యార్థి సంఘాల నేతలు నిరసనలకు దిగారు. ఇప్పటికే వీసీ అవినీతి అక్రమాలపై పలుమార్లు ఫిర్యాదు చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో కేయూకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వీసీపై ఫిర్యాదులు వెల్లువెత్తిన క్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విచారణకు ఆదేశాలు జారీ చేశారు.