కేయూ వీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ

కేయూ వీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ
  • ప్రొఫెసర్​ తాటికొండ రమేశ్​పై వచ్చిన ఆరోపణలపై  విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
  • విజిలెన్స్, ఎన్ ఫోర్స్​మెంట్ డైరెక్టర్​ జనరల్​కు విద్యాశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ ఆదేశాలు 
  • రిక్రూట్​మెంట్స్​, ట్రాన్స్​ఫర్స్​, బిల్లుల చెల్లింపుల్లో  అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన అకుట్​ నేతలు
  • ఎంక్వైరీ ఆర్డర్స్​తో కాకతీయ వర్సిటీలో అలజడి

హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ (కేయూ) వైస్​ చాన్స్​లర్​ ప్రొఫెసర్​ తాటికొండ రమేశ్​ పై ప్రభుత్వం విజిలెన్స్​ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చింది. రిక్రూట్​మెంట్​, ట్రాన్స్​ఫర్స్​, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని రమేశ్‌‌‌‌‌‌‌‌పై ఆరోపణలు ఉన్నాయి. పలువురు వర్సిటీ ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు వీటిపై  ఉన్నతాధికారులకు,  యూజీసీకి  కంప్లైంట్​​ చేశారు. ఈ ఏడాది జనవరిలో అసోసియేషన్​ ఆఫ్​ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్​(అకుట్​)  చేసిన  ఫిర్యాదు మేరకు  విచారణ చేపట్టాలని  విజిలెన్స్,  ఎన్ ఫోర్స్​ మెంట్ డైరెక్టర్​ జనరల్​కు విద్యాశాఖ  ప్రిన్సిపల్​ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ఆదేశాలు ఇచ్చారు. 

ఫ్యాకల్టీపై కక్ష సాధింపు.!

సోషియాలజీ విభాగానికి చెందిన హెడ్  ప్రొఫెసర్ కుంట అయిలయ్యతో అదే విభాగానికి చెందిన రమేశ్​కు మొదటి నుంచి విభేదాలున్నాయి. రమేశ్ వైస్​ చాన్సలర్​ కాగానే అయిలయ్యను  సోషియాలజీ సబ్జెక్టే లేని ఖమ్మం పీజీ కాలేజీకి ట్రాన్స్ ఫర్ చేశారు. తన  ఆరోగ్యం బాగాలేదని   చెప్పినా వినలేదు. ఖమ్మంలో పరీక్షల నిర్వహణలో జరిగిన  చిన్న పొరపాటుకు బాధ్యుడిని చేస్తూ అయిలయ్యను శాశ్వతంగా విధుల్లోంచి తొలగించేందుకు సిద్ధం కాగా..  ఈసీ మెంబర్లు ఒప్పుకోకపోవడంతో అతడిని అసోసియేట్ ప్రొఫెసర్ గా డిమోట్ చేశారు.  కేయూ ఇంజినీరింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పని చేస్తున్న అయిలయ్య కుమారుడు కుంట శ్రీనివాస్ ను కొత్తగూడెం ఇంజినీరింగ్ కాలేజీకి  అకారణంగా బదిలీ చేసి కక్ష తీర్చుకున్నారు. తన  డిపార్ట్ మెంట్ కు   చెందిన మరో ప్రొఫెసర్ శ్రీనివాస్ కు  ప్రమోషన్ రాకుండా  అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి.  ప్రొఫెసర్ స్వర్ణలత అనారోగ్యంతో కొద్ది రోజులు కాలేజీకి రాకపోతే లీవ్ మంజూరు చేయకపోవడం, శాలరీ ఆపడంతో పాటు  నిర్మల్ పీజీ కాలేజీకి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేస్తానని బెదిరించినట్టు  రమేశ్​ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

కేటీఆర్ చెప్పారని మహిళా పార్ట్ టైం లెక్చరర్ ట్రాన్స్ ఫర్

ఖమ్మం పీజీ కాలేజీలో సోషల్ వర్క్ పార్ట్ టైం లెక్చరర్ గా పని చేస్తున్న రజితను (ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు దగ్గరి బంధువు)  హనుమకొండకు ట్రాన్స్ ఫర్ చేసేందుకు ఇక్కడి  ఆర్ట్స్ కాలేజీలో  పని చేస్తున్న  డాక్టర్ ఎస్. సాహితీని ఖమ్మంకు పంపారని రమేశ్​పై ఆరోపణలున్నాయి. తన హెల్త్​ బాగాలేదని,  ఖమ్మం వెళ్లి రావడం ఇబ్బందని సాహితీ  మెడికల్ రిపోర్టులతో రిక్వెస్ట్ పెట్టుకున్నా పట్టించుకోలేదు. బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ రెకమండేషన్​తో రజితను ఇక్కడ నియమించారని రమేశ్​ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్ట్స్ కాలేజీ  సోషల్ వర్క్ పార్ట్ టైం లెక్చరర్ ఇటీవల రిటైర్డ్​ అయినా.. కనీసం ఆయన స్థానంలోనైనా తనకు అవకాశం ఇవ్వాలని సాహితీ కోరుతున్నా రమేశ్​ స్పందించలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 

ఆరోపణలు కోకొల్లలు

కేయూ వీసీగా 2021 మేలో బాధ్యతలు తీసుకున్న ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ పై మొదటి నుంచే  ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రొఫెసర్​ గా పదేండ్ల అనుభవం లేకున్నా వీసీగా నియమించడంపై వివాదం రాజుకున్నది. దీనిపై   కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. వర్సిటీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ ఉండగా, ఈ కేసు వాదించడానికి మరో అడ్వకేట్​ను నియమించి  రూ.5 లక్షలు ఫీజు ఇచ్చినట్టు  ఆరోపణలున్నాయి.  రమేశ్​, అప్పటి రిజిస్ట్రార్​ శ్రీనివాస్​రావుతో కలిసి ప్రొఫెసర్ల ప్రమోషన్లలో అక్రమాలకు పాల్పడినట్టు విమర్శలున్నాయి.  రూల్స్​కు విరుద్ధంగా నియమించి 16 మంది అడ్జంట్ ఫ్యాకల్టీలకు నెలకు రూ.8 లక్షలు చెల్లించారు. ఎలాంటి క్లాసులు బోధించని ఆ ​ ప్రొఫెసర్లకు   రూ.98 లక్షలు చెల్లించడంపై  విచారణ జరగనుంది.  13 మంది కేయూ భూములను ఆక్రమించినా పట్టించుకోలేదు. ఈ భూకబ్జాల్లో రమేశ్​ పాత్రపైనా విచారణ జరగనుందని తెలుస్తున్నది.  ఫేక్ ప్రాజెక్టుల పేర డబ్బులు తీసుకున్న  అప్పటి రిజిస్ట్రార్ శ్రీనివాస రావు, ఇప్పటి రిజిస్ట్రార్ మల్లారెడ్డిపై,  మరో ముగ్గురు టీచర్లపై విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టే చాన్స్​ ఉన్నది. ఆర్ట్స్ కాలేజీ లో విద్యార్థుల ఫీజుల రూపంలో  యూనివర్సిటీకి రావాల్సిన  రూ.5 కోట్ల స్వాహాకు బాధ్యులైనవారితో వీసీ రమేశ్​ కుమ్మక్కైనట్టు కూడా  ఆరోపణలున్నాయి. విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారాలన్నింటి పైనా విచారించనున్నారు.  

విజిలెన్స్ ఎంక్వైరీని స్వాగతిస్తున్నా: వీసీ రమేశ్​

కేయూ వీసీగా తన మూడేండ్ల పదవీ కాలంలో ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని, ప్రభుత్వం నియమించిన విజిలెన్స్​ ఎంక్వైరీని స్వాగతిస్తున్నానని కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్​అన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వీసీగా మూడేండ్లుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని వర్సిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశానని చెప్పారు. గడిచిన మూడేండ్లలో  వర్సిటీ సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన అన్ని రకాల  బెనిఫిట్స్, బకాయిలు  అందించానని, వర్సిటీ చరిత్రలోనే మొదటిసారిగా 507 మంది దినసరి, తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు 3 నుంచి 4 రెట్లు పెంచామని తెలిపారు. లెక్చరర్ల కొరత ఉన్నప్పటికీ అన్ని రకాల రూల్స్​ పాటిస్తూ 300 మందికి పైగా పీహెచ్​డీ అడ్మిషన్లు  కల్పించామని, దీనిపై  గతంలో కొందరు ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం  ఎంక్వైరీ కమిటీని నియమించగా.. ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిందని చెప్పారు.