హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉంటున్న పబ్లిక్కు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉంటున్న పబ్లిక్కు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
  • ప్రసాద్​రావు కమిటీ నివేదికపైనా చర్చ 
  • సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఆస్కీకి బాధ్యతలు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో శివారు ప్రాంతాల విలీనం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వ హయాం నుంచే ఈ అంశంపై విస్ర్తృత చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ​ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఓఆర్ఆర్ పరిధిలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగింది. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల సూచనలు కూడా తీసుకున్నారు. ఎలా చేస్తే బాగుంటుందన్న దానిపై ఉన్నతాధికారులతో డిస్కస్​చేశారు.

ఎనిమిది నెలల క్రితం వరకూ మూడు పోలీసు కమిషనరేట్ల మాదిరిగా మూడు కార్పొరేషన్లు చేయాలని ప్రభుత్వం అనుకుంది. కానీ, తర్వాత అంతా సైలెన్స్​అయిపోయారు. అయితే, ఇటీవల ఉన్నతాధికారులతో సీఎం నిర్వహించిన ఓ సమావేశంలో ఈ అంశం మళ్లీ ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ లో విలీనం చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ రెండింటిని ప్రత్యే కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ప్రపోజల్ పై చర్చించినట్లు సమాచారం. 

ప్రసాద్​రావు కమిటీ నివేదికపై చర్చ 

2012లో కాంగ్రెస్​హయాంలో ఉమ్మడి ఏపీ సీఎంగా రోశయ్య ఉన్నప్పుడు జీహెచ్ఎంసీలో మెరుగైన సేవలు అందించేందుకు ఏం చేయాలన్న దానిపై ప్రసాద్ రావు కమిటీని ఏర్పాటు చేశారు. గ్రేటర్ విస్తరిస్తున్న తరుణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన ఎలా చేయాలనే దానిపై ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. మొత్తం 30 సర్కిల్స్​ఉండగా వాటిని 50 సర్కిల్స్ గా మార్చాలని, ఒక సర్కిల్ లో నాలుగు వార్డులు సమానంగా ఉండేలా చూడాలని సూచనలు చేసింది.

150 వార్డులను 200 వార్డులు చేయాలని సూచించింది. దీనిపై కూడా సీఎం ఉన్నతాధికారులతో చర్చించినట్టు సమాచారం. ఇప్పుడున్న 150 డివిజన్ల స్థానంలో హైదారాబాద్​లో 100 , సికింద్రాబాద్ లో 100 డివిజన్లు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని కూడా డిస్కస్ చేసినట్టు తెలిసింది. 

స్టడీ కోసం ఆస్కీకి బాధ్యతలు

ముందు అనుకున్నట్టు మూడు కార్పొరేషన్లకు బదులు హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు కార్పొరేషన్లు చేసే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, అడ్మినిస్ట్రేషన్​పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? అన్న దానిపై స్టడీ చేసే బాధ్యతలను ఆస్కీ(అడ్మినిస్ర్టేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా)కి ప్రభుత్వం అప్పగించినట్లు తెలిసింది. ఈ అంశంపై సమగ్ర వివరాలు సేకరించిన తర్వాత ఆస్కీ పూర్తి స్థాయి నివేదికను సమర్పించనున్నది. దీని తర్వాతే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

శివారులో యాక్షన్​ షురూ   

ఇటీవల శివారు మున్సిపాలిటీల్లో కలిసిన గ్రామాలకు సంబంధించి వార్డుల బౌండరీలు ఫిక్స్ చేయడంలో అధికారులు బిజీ అయ్యారు. కొన్ని మున్సిపాలిటీల్లో ఈ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. అయితే, భవిష్యత్తులో ప్రభుత్వం రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎందులోనైనా విలీనం చేస్తే సమస్య రాకుండా ఉండేలా పక్కా ప్లాన్​తో బౌండరీలు సెట్​చేస్తున్నారు. ఇప్పటికే శివారు మున్సిపాలిటీల పాలకమండళ్ల గడువు ముగిసి నెల రోజులైంది. బల్దియా పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం  నిర్ణయం తీసుకుంటున్నదానిపై ఆసక్తి నెలకొంది.

రెండు కార్పొరేషన్ల పరిధిలోనే.. 

ప్రభుత్వ స్థలాల ఆక్రమణను కట్టడి చేసేందుకు సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకే ఉంది. అయితే, రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా వీటి పరిధిలోని భూములు, చెరువులు, ప్రభుత్వ స్థలాల రక్షణ, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్) బాధ్యతలను హైడ్రాకే అప్పగించే అవకాశం ఉంది. రెండు కార్పొరేషన్ల నుంచి వచ్చే ఫిర్యాదులను ఇప్పటిలాగే స్వీకరించే అవకాశం ఉంటుంది. డీఆర్ఎఫ్ లో భాగంగా ఫైర్ యాక్సిడెంట్లు, వరదలు వచ్చినా హైడ్రానే రెస్క్యూ చేసే చాన్స్​ఉంటుంది.