మున్సిపాలిటీల్లో సర్కారు రియల్​ బిజినెస్​

  • ల్యాండ్​ పూలింగ్​ పేరుతో సేకరణ
  • 400 ఎకరాలు సేకరించాలని లక్ష్యం
  • 20 శాతం భూ యజమానికి, మిగిలిన భూమి మున్సిపాలిటీకి
  • భువనగిరిలో 32 ఎకరాల ప్రైవేట్​ ల్యాండ్ ఓకే

యాదాద్రి, వెలుగు : ఆదాయాన్ని పెంచుకొనేందుకు హెచ్​ఎండీఏ తరహాలో మున్సిపాలిటీల్లో భూ వ్యాపారానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లోని ప్రైవేట్​ ల్యాండ్​ను గుర్తించి, ల్యాండ్ ​పూలింగ్​ పేరుతో రియల్​ ఎస్టేట్​ బిజినెస్​ చేయడానికి దృష్టి పెట్టింది. హెచ్​ఎండీఏ తరహాలో మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ మొదలైంది. యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో రియల్​ బిజినెస్​ చేయడానికి జిల్లా ఆఫీసర్లు అడుగులు ముందుకు

వేస్తున్నారు. 400 ఎకరాలకు పైగా .. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 400 నుంచి 500 ఎకరాల వరకూ ప్రైవేట్​ భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ ‌‌పార్ట్ ‌‌నర్ షిప్ ‌‌(పీపీపీ) పద్దతిలో భూమిని డెవలప్​ చేయనున్నారు.  ప్రైవేట్​ వ్యక్తుల నుంచి తీసుకున్న భూమిని డెవలప్​ చేసి, ఓనర్​కు ఎకరంలో 20.7 శాతం ఇచ్చి, డెవలప్​ చేసినందుకు మిగిలిన భూమిని తీసుకుంటుంది. లెక్కప్రకారం ఎకరానికి 4840 గజాల భూమి వస్తోంది. హెచ్​ఎండీఏ, డీటీసీపీ రూల్స్​ ప్రకారం ఒక్క ఎకరాన్ని డెవలప్​ చేస్తే   రోడ్లు, అవసరాలకు పోను  2800 గజాల భూమి మిగులుతుంది. ఇందులో ఓనర్​కు వెయ్యి గజాలిచ్చి.. మిగిలిన 1800 గజాల భూమిని మున్సిపాలిటీ తీసుకుంటుంది. అయితే భూమిని స్వాధీనం చేసుకోగానే.. ఆ భూమిని ఎవరికీ అమ్మకుండా నిషేధిత జాబితాలో చేరుస్తుంది.

ఈ ప్రాంతాలపై ఫోకస్​

జిల్లాలోని మోత్కూర్​ మినహా మిగిలిన భూదాన్​ పోచంపల్లి, చౌటుప్పల్​, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలు హైదరాబాద్​కు దగ్గరగానే ఉన్నాయి. ఈ కారణంగా జిల్లాలో రియల్​ బిజినెస్​ పెద్ద ఎత్తున విస్తరించింది. భూముల రేట్లు కూడా ఆకాశానికంటాయి. మున్సిపాలిటీల్లో ఎకరానికి రూ. కోటి నుంచి రూ. 3 కోట్ల వరకూ పలుకుతోంది. దీంతో ఈ జిల్లాలో ల్యాండ్​ పూలింగ్​ ద్వారా ఇన్​కం సమకూర్చుకోవాలని సర్కారు భావిస్తోంది. అందుకే వీలైనంత ఎక్కువగా భూమిని సేకరించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ల్యాండ్​ పూలింగ్​ సంబంధించి పూర్తి బాధ్యతలను కలెక్టర్​కు అప్పగించినట్టు తెలుస్తోంది. 

డెవలప్​మెంట్​ పనులు కాంట్రాక్టర్లకు

ల్యాండ్​ పూలింగ్​ ద్వారా సేకరించిన భూమిని డెవలప్ చేయడానికి మున్సిపాలిటీల్లో వ్యవస్థ లేదు. దీంతో డెవలప్​మెంట్స్​ను​ పనిని కాంట్రాక్టర్ల కు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. సదరు భూమిని డెవలప్​ చేయడానికి ఓనర్​ నుంచి ఎలాంటి డబ్బు తీసుకోరు కాబట్టి.. మున్సిపాలిటీకి వచ్చే 1800 గజాలను అమ్మడం ద్వారా సమకూరే ఆదాయం నుంచే కాంట్రాక్టర్​కు డెవలప్మెంట్​ చార్జీలు చెల్లిస్తారు. 

భువనగిరిలో 32 ఎకరాలు

జిల్లా కేంద్రమైన భువనగిరిలో 32 ఎకరాల ప్రైవేట్​ భూమిని ల్యాండ్​ పూలింగ్​ కింద మున్సిపాలిటీ సమకూర్చుకున్నది. భువనగిరి నుంచి జగదేవ్​పూర్​ వైపునకు వెళ్లే రోడ్డుకు కొద్ది దూరంలో ఈ ల్యాండ్​ ఉంది. ల్యాండ్​ పూలింగ్​ కింద సేకరించిన ఫస్ట్​ ల్యాండ్​ ఇదే. ఈ 32 ఎకరాలను డెవలప్​ చేసిన తర్వాత భూమి యజమానికి 32 వేల గజాల భూమి వస్తే.. 57,600 గజాల భూమి మున్సిపాలిటీకి సమకూరుతుంది. గజానికి రూ. 10 వేల చొప్పున  లెక్కేస్తే భూమి యజమానికి రూ. 32 కోట్లు, మున్సిపాలిటీకి రూ. 57 కోట్ల ఇన్​కం వస్తుంది. ఇందులోంచి డెవలప్మెంట్​ చార్జీ మినహాయించాల్సి ఉంటుంది. లక్ష్యం మేరకు మున్సిపాలిటీల్లో 400 ఎకరాలను సేకరిస్తే ఎకరానికి 1800 గజాల చొప్పున మున్సిపాలిటీలకు 7.20 లక్షల గజాల భూమి వస్తుంది. అన్ని మున్సిపాలిటీలకు దాదాపు రూ. 720 కోట్ల ఇన్​కం వస్తుంది. 

ల్యాండ్​ పూలింగ్​పై రివ్యూ

మున్సిపాలిటీల్లో ల్యాండ్​ పూలింగ్​పై మున్సిపల్​ కమిషనర్లతో యాదాద్రి అడిషనల్ కలెక్టర్​ (ఎల్​బీ) దీపక్​ తివారి ఇటీవల రివ్యూ నిర్వహించారు. మున్సిపాలిటీల్లో ప్రైవేట్​ ల్యాండ్​ డిటైల్స్​ సేకరించాలని ఆదేశించారు. ఆ తర్వాత భూమిని సేకరించి.. డెవలప్​ చేయడం ద్వారా ఇన్​కం సమకూర్చాలని సూచించారు.