రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల

రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల

వెలుగు : రాష్ట్రంలో కొత్త ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇవ్వకుండా, ఉన్న కాలేజీలను పటిష్టపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందని ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌ వీసీ ప్రకాశ్‌ , పరమేశ్వర్‌ అన్నారు. గతేడాది ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు ఇంటర్‌ , డిగ్రీ కాలేజీలకు స్పెషల్‌ బడ్జెట్‌‌ ద్వారా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌‌ బకాయిలన్నీ విడుదల చేశారని తెలిపారు. పార్టీలతో తమకు సంబంధంలేదని, అధికారంలో ఏ ప్రభుత్వమున్నా వారికి మద్దతిస్తామని చెప్పారు . సోమవారం సాంకేతిక విద్యాభవన్‌ లో అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం సీనియర్‌ నేతలు డాక్టర్‌ నాగయ్య, నరేందర్‌ రెడ్డి, జైపాల్‌ రెడ్డి, ప్రదీప్‌ తో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు.గత ప్రభుత్వాలన్ని కార్పొరేట్‌‌కు వత్తాసు పలికేవని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కార్పొరేట్‌‌ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్పారు . సర్కారు అనుసరించిన విధానాలతో నాణ్యతలేని 37 కార్పొరేట్‌‌ కాలేజీల బ్రాంచులు మూతపడగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రూ. 2.37 కోట్ల ఫైన్‌ వసూలుచేసిందని వివరించారు. 2017–18 ఫీజు బకాయిలన్ని దాదాపు విడుదల చేసిందని, 2018–19 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.446.43కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వం తో పంతానికి పోకుండా, సత్సంబంధాలతో సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని సంఘం తీర్మానం చేసినట్టు చెప్పారు .