ఫ్యామిలీ యూనిట్​గా రుణమాఫీ.. కుటుంబానికి రూ.2 లక్షల లిమిట్​

  • అర్హుల గుర్తింపున‌‌‌‌కు రేష‌‌‌‌న్ కార్డు ప్రామాణికం
  • రుణమాఫీ  గైడ్​లైన్స్​ విడుదల చేసిన సర్కారు
  • 2018  డిసెంబర్​12  నుంచి 2023 డిసెంబర్ 9 ​మధ్య తీసుకున్న లోన్లు మాఫీ
  • లోన్ మొత్తం ​రూ.2 లక్షలు దాటితే  బ్యాలెన్స్ ​అమౌంట్ ​ముందుగా చెల్లించాలి
  • మాఫీ కోసం ప్రత్యేక వెబ్‌‌‌‌ పోర్టల్‌‌‌‌.. నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోనే

హైదరాబాద్, వెలుగు : రూ.2 లక్షలలోపు పంట రుణాల మాఫీకి కుటుంబాన్ని యూనిట్​గా తీసుకోవాలని రాష్ట్ర​ సర్కారు నిర్ణయించింది. అర్హుల గుర్తింపున‌‌‌‌కు రేష‌‌‌‌న్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15లోగా పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్​ సర్కారు.. ఇందుకు సంబంధించిన  గైడ్​లైన్స్​ను సోమవారం అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రకారం.. ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.2లక్షల దాకా క్రాప్​లోన్లు మాఫీ చేస్తారు. ముందుగా చెప్పినట్టు 2018 డిసెంబర్  12  నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. తాజా మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రంలో ఉన్న  రైతుల్లో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తారు. ముందుగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు గైడ్​లైన్స్​ చేరవేసి, ఆ ప్రకారం అర్హుల జాబితాలు సేకరిస్తారు. రూ.2 లక్షలకు మించి క్రాప్​లోన్లు (అసలు, వడ్డీతో కలిపి) ఉన్న కుటుంబాలు ముందుగా బ్యాంకులకు బ్యాలెన్స్​అమౌంట్ ​కట్టాలి. ఆ తర్వాత మిగిలిన రూ.2 లక్షలను సర్కారు చెల్లిస్తుంది. 

అగ్రికల్చర్​ డైరెక్టర్​ సారథ్యం..ఎన్ఐసీ భాగస్వామ్యం 

ప్రభుత్వం విడుదల చేసిన గైడ్​లైన్స్​ ప్రకారం పంట రుణమాఫీ –2024 పథకాన్ని అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్​ కమిషనర్​,​ డైరెక్టర్​..   అధికారికంగా అమలు చేస్తారు. హైదరాబాద్‌‌‌‌లోని  నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ పథకానికి భాగస్వామిగా ఉంటుంది. అగ్రికల్చర్​ డైరెక్టర్, ఎస్​బీఐ కలిసి ఐటీ పోర్టల్ నిర్వహిస్తారు. ఆ పోర్టల్‌‌‌‌లో అర్హత పొందిన ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా ఉంటుంది. ఐటీ పోర్టల్ ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌‌‌‌కు బిల్లులు సమర్పిస్తుంది. రుణమాఫీ స్కీమ్​కు సంబంధించిన భాగస్వాములతో సమాచారం పంపిణీకోసం, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయి.

రుణమాఫీ అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని నోడల్​ఆఫీసర్​గా నియమిస్తారు. ఈ నోడల్​ఆఫీసర్లు.. బ్యాంకులు, అగ్రికల్చర్​ డైరెక్టర్, ఎస్ఐసీ మధ్య కో ఆర్డినేటర్​గా వ్యవహరిస్తారు. వీరు తమ బ్యాంకుల్లోని పంట రుణాల డేటాను డిజిటల్ సంతకాలు చేసి, ప్రభుత్వానికి పంపించాలి. ఈ క్రమంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా అగ్రికల్చర్​ డైరెక్టర్​, ఎన్ఐసీ డేటా వాలిడేషన్​ చెక్​ చేయాల్సి ఉంటుంది. ముందుగా బ్యాంకులు ఇచ్చే రైతు లోన్​ అకౌంట్​లోని ఆధార్, పట్టా పాస్​బుక్​ డేటా బేస్​లో ఉన్న డేటా, ఫుడ్​సెక్యూరిటీ కార్డులోని డేటాబేస్​తో మ్యాపింగ్ చేస్తారు. అర్హులైన  రైతు కుటుంబానికి రుణమాఫీ మొత్తాన్ని డైరెక్ట్​ బెనిఫీషియరీ ట్రాన్స్​ఫర్​ పద్ధతిలో నేరుగా  లోన్​ అకౌంట్​లో జమచేస్తారు. ప్యాక్స్​ విషయంలో రైతురుణ మాఫీ మొత్తాన్ని డీసీసీబీ బ్యాంకు, బ్యాంకు బ్రాంచ్​కు విడుదల చేస్తారు. ఆ బ్యాంకు  ప్యాక్స్​లో ఉన్న రైతు లోన్​అకౌంట్​లో జమ చేస్తుంది. ఏ కుటుంబానికైతే 2 లక్షలకు మించి రుణం ఉంటుందో, ఆ రైతులు 2 లక్షలకు పైబడిన మొత్తాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత మిగిలిన రూ.2 లక్షలను లోన్​అకౌంట్​కు బదిలీ చేస్తారు. ఒకవేళ కుటుంబంలో రుణం తీసుకున్న మహిళ ఉంటే ఆమె రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగిలిన మొత్తాన్ని దామాషా పద్ధతిలో  పురుషులకు బదిలీ చేస్తారు. 

ఫర్మ్​లకు, కంపెనీలకు రుణమాఫీ లేదు..

కేవలం పంట రుణాలే తప్ప ఫర్మ్​లు, కంపెనీలకు రుణమాఫీ వర్తించదని గైడ్ లైన్స్​లో సర్కారు స్పష్టం చేసింది. ఎస్‌‌హెచ్​జీ(సెల్ఫ్​​హెల్ప్​గ్రూప్​)లు, జాయింట్​లయబిలిటీ  (జేఎల్టీ)లు, రైతు మిత్ర సంఘాలు (ఆర్ఎం జీ) కింద  తీసుకున్న లోన్లకు పంట రుణమాఫీ వర్తించదని వెల్లడించింది. ఇక పునర్వ్యవస్థీకరించిన, రీషెడ్యూల్​ చేసిన లోన్లకూ మాఫీ లేదని, పీఏసీఎస్ ద్వారా తీసుకున్న క్రాప్​లోన్లకు మాఫీ వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది. కాగా, ఎవరైనా తప్పుడు సమాచారంతో రుణమాఫీ పొందితే రికవరీ చేసేందుకు అగ్రికల్చర్​ డైరెక్టర్​కు స్పష్టమైన అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది. 

లోన్​ అమౌంట్​ తక్కువ ఉన్నోళ్లకు ఫస్ట్​

రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసిన‌‌‌‌ట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. పంట రుణ‌‌‌‌మాఫీ సొమ్ము డీబీటీ(డైరెక్ట్​ బెనిఫిట్​ ట్రాన్స్​ఫర్​) పద్ధతిలో నేరుగా ల‌‌‌‌బ్ధిదారుల లోన్​ అకౌంట్​లో జ‌‌‌‌మ కానుంది. ఆరోహ‌‌‌‌ణ క్రమంలో రుణ‌‌‌‌మాఫీ సొమ్మును ప్రభుత్వం విడుద‌‌‌‌ల చేస్తుంది. అంటే తక్కువ అమౌంట్​ ఉన్న లోన్లు ముందుగా, ఎక్కువ అమౌంట్​ ఉన్న లోన్లు తర్వాత చెల్లిస్తుంది. కాగా, రాష్ట్రంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో రూ.42 లక్షల దాకా క్రాప్​లోన్​ అకౌంట్లు ఉన్నాయి. వీటిలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య క్రాప్​లోన్లు తీసుకున్న రైతుల వివరాలు ముందుగా తేలుస్తారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల దాకా రేషన్​ కార్డులు ఉన్నాయి. లోన్ల వివరాలతో రేషన్​కార్డులు, ఆధార్​ డేటాను మ్యాపింగ్​ చేసి అర్హులను తేల్చనున్నారు. తాజా అంచనాల ప్రకారం దాదాపు రూ.31 వేల కోట్ల వరకు క్రాప్​లోన్లు మాఫీ చేయాల్సి ఉంటుంది.