కొత్త "బార్" లకు ప్రభుత్వం అనుమతి.. దరఖాస్తు ఫీజు లక్ష రూపాయలు.. వాపస్ ఇయ్యరు..!

కొత్త "బార్" లకు ప్రభుత్వం అనుమతి.. దరఖాస్తు ఫీజు లక్ష రూపాయలు.. వాపస్ ఇయ్యరు..!

హైదరాబాద్: కొత్త "బార్" లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణలో కొత్త బార్లకు రేపు(మార్చి 30, 2025) నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 41 కొత్త బార్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ను మినహాయిస్తే రాష్ట్రంలో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్ నగర పరిధిలో 16 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లోకల్ ఎలక్షన్స్ తర్వాత జీహెచ్ఎంసీలో ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఒక్కో బార్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు లక్ష రూపాయలు ఫీజును ప్రభుత్వం ఖాయం చేసింది. ఈ లక్ష రూపాయలు తిరిగి ఇవ్వబడదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఒక్కో బారుకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లక్కీ డ్రా ద్వారా ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ఏప్రిల్ 26 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని అబ్కారీ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1171 బార్లు ఉన్నాయి. 2620 వైన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న బార్లే నష్టాల్లో ఉన్నాయని, కొత్త బార్లు ఎందుకు అని బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ ప్రశ్నిస్తున్నారు. 2017 జనవరిలో ఆగిపోయిన టెండర్లనే మళ్లీ ఇప్పుడు కొత్తగా పిలుస్తున్నామని ఎక్సైజ్ శాఖ వివరణ ఇచ్చింది.

ఇదిలా ఉండగా తెలంగాణలో బీర్ల ధరలను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకురావడం, ఎలైట్ బార్లు, వైన్స్లకు అనుమతులు ఇవ్వడం ద్వారా లిక్కర్ ఆదాయం కూడా అమాంతం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. కనీసం నెలకు రూ. 4,500 కోట్లు ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరం (2024–25)లో మద్యం అమ్మకాల వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుందని రేవంత్  సర్కారు అంచనా వేసింది. 2024 ఏప్రిల్‌‌,‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -సెప్టెంబర్ వరకు ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా రూ.8,040 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. అంటే తొలి 6 నెలల్లో రూ.17,533 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. అయితే, ఆ తర్వాత పండుగలు, డిసెంబరులో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఆదాయం పెరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు‌‌‌‌‌‌, క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, పబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా ద్వారా రోజుకు సరాసరిగా రూ.90 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. నెలకు సగటున రూ.2,700 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల  వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్  అధికారులు వెల్లడించారు. ఇక బీర్ల రేట్లు పెరగడంతో ప్రతినెలా దాదాపు రూ.300 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.