- 15 వేల కుటుంబాలకు రూ.25 వేల చొప్పున సాయం
హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఇండ్లు ఖాళీ చేసి వెళ్తున్న నిర్వాసితులకు ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించేందుకు రూ.37.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 15 వేల కుటంబాలకు రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ శనివారం జీవో జారీ చేశారు.
‘‘ఈ నిధులను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ రిలీజ్ చేయాలి. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిన తర్వాత యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కాగ్ కు అందజేయాలి” అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో వాళ్లు అక్కడికి తరలివెళ్లేందుకు ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేస్తున్నది.