
- 15 శాతం నాన్ లోకల్ కోటా ఎత్తేసిన సర్కార్
- ఇంజినీరింగ్, ఫార్మసీ, ప్రొఫెషనల్ కాలేజీల్లో కొత్త అడ్మిషన్ల విధానం
- అడ్మిషన్లలో 15 శాతంఏపీ కోటా ఎత్తివేత
- రాష్ట్రంలో పదేండ్లు నివాసం ఉన్నోళ్లకు ఆ సీట్లు కేటాయింపు
- జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న 15 శాతం ఓపెన్ కోటాను తీసేసింది. ఆ కోటా సీట్లను తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్లు, ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించనున్నది. దీనికి సంబంధించి జీవో నంబర్ 15ను విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా రిలీజ్ చేశారు. స్టేట్లోని ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఫార్మా–డీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో 85 శాతం స్థానిక తెలంగాణ స్టూడెంట్లకు, 15శాతం ఓపెన్ కేటగిరిలో సీట్లు నింపేవారు.
15శాతం సీట్లలో తెలంగాణతో పాటు ఏపీ స్టూడెంట్లూ పోటీపడే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన సమయం నుంచి పదేండ్ల వరకు ఈ విధానాన్ని అమలు చేశారు. ఏపీ, తెలంగాణ విభజన జరిగి పదేండ్లు పూర్తయిన నేపథ్యంలో, పాత విధానానికి తెలంగాణ సర్కార్ స్వస్తి పలికింది. ప్రస్తుతం 85 శాతం సీట్లు పూర్తిగా తెలంగాణ స్టూడెంట్లకే అలాట్ చేస్తది. స్థానికత, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా ఆ సీట్ల అలాట్ ఉంటుంది. మిగిలిన 15శాతం సీట్లను తెలంగాణ స్థానికత ఉండి.. ఇతర రాష్ట్రాల్లో చదువుకునే వారితో భర్తీ చేయనున్నది. అయితే, తెలంగాణలో పదేండ్ల పాటు నివాసముండాలనే షరతును ప్రభుత్వం పెట్టింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. దీనికి తోడు చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి
ఉపయోగపడనున్నది.
స్థానికతపై కమిటీ నివేదిక
స్థానికత, అడ్మిషన్ల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ పలు కోర్సుల్లో అడ్మిషన్లలో స్థానికత అంశంపై పలు రకాల సిఫార్సులను సర్కార్ ప్రతిపాదించింది. దీంట్లో పాత విధానంలోనే 15శాతం సీట్లు మెరిట్ కింద ఏపీ, తెలంగాణ స్టూడెంట్లు పోటీపడటం, మొత్తం తెలంగాణ స్టూడెంట్లకే కేటాయించడం, 5శాతం నాన్ లోకల్ కోటా పెట్టడం, తెలంగాణలో ఉండి ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న వారికోసం 15శాతం సీట్లు కేటాయించడం తదితర ఉన్నాయి. స్థానికతపై స్పష్టత రాకపోవడంతో ఈ నెల 25 నుంచి ప్రారంభం కావాల్సిన ఎప్సెట్ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది.