అరగంటకో కొత్త సాంకేతికత మార్కెట్‌లోకి దూసుకొస్తోంది. ఒక మోడల్ మొబైల్‌లో ఫీచర్లను అర్థం చేసుకునేలోపే సరికొత్త సాంకేతికత, ఫీచర్లతో మరో మొబైల్ మన ముందుకు వస్తున్న కాలం ఇది. ఒక్క మొబైల్ ఫోన్లే కాదు..పరిశ్రమలు, సేవల రంగంతోపాటు వ్యవసాయ రంగంలోనూ సాంకేతికతదే పెద్దపీట. మారుమూల పల్లెల్లోని రైతులు సైతం ఎరువులు, పురుగు మందులు చల్లేందుకు డ్రోన్లు వినియోగిస్తున్నారు.
పారిశ్రామిక రంగంలో ఈ మార్పు రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. సాంకేతికత ఇంతవేగంగా పరుగెడుతున్నా అందుకు తగినట్లుగా మాత్రం నిపుణుల లభ్యత లేదు. ఫలితంగా పరిశ్రమలు, సేవలరంగంతో పాటు ఇతర రంగాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మన సాంకేతిక విద్యాసంస్థలు నేటికీ సంప్రదాయ కోర్సులు, లేదా పదేండ్లో అంతకుముందు ప్రవేశపెట్టిన సిలబస్‌లు కొనసాగించడమే.
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోకపోవడం ఓ సమస్య. ఈ సమస్యను అధిగమించి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నవతరంలో నైపుణ్యాలు పెంపొందించాలని, తద్వారా మార్కెట్‌లో నిపుణుల కొరత తీర్చడంతోపాటు యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని 65 పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐటీఐ)లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది.
ఐటీఐలు అప్‌గ్రేడ్ కాలేకపోయాయి
దేశ స్వాతంత్య్రానంతరం నాటి దేశీయ అవసరాలకు అనుగుణంగా 1950లో ఐటీఐలను స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1960లో మల్లేపల్లి (హైదరాబాద్), కాకినాడ, విశాఖపట్నంల్లో ఐటీఐలు నెలకొల్పారు. ఐటీఐలు ప్రారంభమైన సమయంలో కులవృత్తులుగా ఉన్న వడ్రంగి, స్వర్ణకార, ఇండ్లకు రంగులు వేయడం వంటివాటితో పాటు అప్పుడప్పుడే విస్తరిస్తున్న డీజిల్ ఇంజిన్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్ వంటి కోర్సులు ప్రారంభించారు. తొలి మూడు దశాబ్దాల్లో పెద్దగా సాంకేతికపరమైన పురోగతి లేకపోవడంతో సంప్రదాయ కోర్సులతోనే కాలం గడిచిపోయింది. 1991లో దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి రావడం, ప్రపంచవ్యాప్తంగానూ ఐటీ, బయోటెక్నాలజీతో పాటు అన్ని రంగాల్లో అనూహ్య పురోగతి నెలకొంది. మానవ జీవితంపై సాంకేతికత తనదైన ముద్ర వేయడం ప్రారంభించింది. కృత్రిమ మేధ (ఏఐ)తో అది పతాకస్థాయికి చేరింది.
65 ఐటీఐలను ఐటీసీలుగా..
సాంకేతికత ఇంత అభివృద్ధి చెంది అధునాతన పరికరాలు వినియోగం బాగా పెరిగినపోయిన నేపథ్యంలో ఆ సాంకేతికతను అర్థం చేసుకోవడం, వాటి వినియోగం, మరమ్మతులకు సంబంధించిన నైపుణ్యం పెంచుకోవడం తప్పనిసరి. కానీ, పెరిగిన సాంకేతికత అనుగుణంగా ఆయా రంగాలకు సంబంధించిన నిపుణుల కొరత ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు ఈ సమస్యను అధిగమించేందుకు ఎప్పటికప్పుడు సాంకేతిక విద్యా సంస్థల్లో అధునాతన కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. దేశంలోనూ ఈ దిశగా కొంత పురోగతి ఉన్నా అవసరాలకు తగ్గట్లు మాత్రం లేదనేది స్పష్టం.
ఈ నేపథ్యంలో ఆధునిక అవసరాలకు తగినట్లు యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించాలని, అనంతరం వారికి ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు లభ్యమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చాలని అధికారులను ఆదేశించారు.
ఆధునిక శిక్షణ
ఐటీఐలను ఏటీసీలుగా ఆధునికీకరించడంతో పాటు నూతన కోర్సులకు అవసరమయ్యే పరికరాలు, ల్యాబ్‌ల ఏర్పాటు, శిక్షకుల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం పదేండ్ల కాలానికిగాను టీటీఎల్ తన వాటాగా రూ.2,016.25 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.307.96 కోట్లు వ్యయం చేయనున్నాయి. నూతన కోర్సులు శిక్షణకుగాను ప్రతి ఏటీసీకి ఇద్దరు చొప్పున శిక్షకులను టీటీఎల్ నియమిస్తుంది. ఆ శిక్షకులు అధునిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇప్పటికే ఐటీఐల్లో ఆ యా విభాగాల్లో ఉన్న ఫ్యాకల్టీలకు శిక్షణ ఇస్తున్నారు.
పాలిటెక్నిక్, ఇంజినీరింగ్
విద్యార్థులకు ప్రయోజనకరంగా..
ఏటీసీల్లో ఏర్పాటు చేసే పరికరాలు, ల్యాబ్‌లు.. పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉపయోగపడనున్నాయి. భవిష్యత్తులో ఏటీసీలు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల నైపుణ్యాలకు సానపెట్టను న్నాయి. పరిశ్రమలు 4.0 అవసరాలకు తగ్గట్లు ఏటీసీల్లో కోర్సులకు రూపకల్పన చేయడంతోపాటు శిక్షణ అందించనుండడంతో ఇక్కడ శిక్షణ పొందినవారు దేశంతో పాటు మధ్య ప్రాచ్య, పశ్చిమ దేశాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంది. మన దేశం నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది ఉపాధి కోసం వివిధ పనులపై మధ్య ప్రాచ్య దేశాలకు వెళుతున్నారు. సరైన శిక్షణ, నైపుణ్యం లేకపోవడంతో తక్కువ జీతాలకే పని చేయాల్సి వస్తోంది. అక్కడ శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఏటీసీల్లో శిక్షణతో ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
స్కిల్స్‌తో పెరగనున్న ఉద్యోగ, స్వయం ఉపాధి
రాష్ట్రంలోని 65 ఐటీఐల నుంచి గత పదేండ్లలో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే శిక్షణ పొందారు. కానీ, ఏటీసీల నుంచి పదేండ్లలో 4.70 లక్షల మంది శిక్షణ పొందనున్నారు. ఏటీసీల్లో శిక్షణపొందిన వారికి ఉద్యోగాల కల్పనలోనూ టీటీఎల్ తోడ్పడనుంది. ఆధునిక శిక్షణ, ఉపాధి అవకాశాల మెరుగుదలతో రాష్ట్రంలోని యువతకు మంచి భవిష్యత్తు లభించడంతో పాటు ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి.
రూ.2,324 కోట్ల వ్యయంతో..ఇండస్ట్రియల్ రోబోటిక్స్ సహా 29 కోర్సులు..
ఆధునిక అవసరాలకు తగినట్లు రాష్ట్రంలోని 65 ఏటీసీల్లో ఆరు దీర్ఘకాలిక కోర్సులు, 23 స్వల్పకాలిక కోర్సులకు (కాల వ్యవధి మూడు నెలలు) రూపకల్పన చేశారు. దీర్ఘకాలిక కోర్సుల్లో మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్, ఆర్టిషన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ (ఈ మూడింటి కాల వ్యవధి ఏడాది), బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ (మెకానికల్), అడ్వాన్స్డ్ సీఎన్సీ మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ (కాల వ్యవధి రెండేళ్లు), మూడు నెలలు శిక్షణ ఇచ్చే స్పల్ప కాలిక కోర్సుల్లో ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ ప్రాజెక్టు డిజైన్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్, ఆటో ఎలక్ట్రికల్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ వెరిఫికేషన్ అండ్ అనాలిసిస్, కంప్యూటర్ ఎయిడెడ్ మాన్యుఫాక్చరింగ్‌తో పాటు కంప్యూటర్, ఎలక్ట్రిక్ వెహికల్, ఇంటర్నెట్ థింగ్స్, వివిధ మిషనరీలకు సంబంధించిన అడ్వాన్స్డ్ కోర్సులు ఉన్నాయి.
సీఎం రేవంత్ దార్శనికతతోనే..
రాజకీయవేత్త వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు, దార్శనికుడు రాబోయేతరం గురించి ఆలోచిస్తారని అమెరికన్ రచయిత జేమ్స్ ఫ్రీమెన్ క్లార్క్ వ్యాఖ్యానించారు. దేశ ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దార్శనికతతోనే దేశంలో బహుళార్థ సాధక ప్రాజెక్టులు, ఐఐటీలు, ఐఐఎం, ఐటీఐలు వంటివి పురుడుపోసుకున్నాయి. వాటి ప్రగతి ఫలాలను ప్రస్తుతం దేశ ప్రజలు అనుభవిస్తున్నారు. నెహ్రూ అడుగుజాడల్లోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. యువత తమ శక్తిసామర్థ్యాలను సక్రమంగా వినియోగించుకోవడంతోపాటు వారిని ఆధునిక యుగానికి తగినట్లు తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏటీసీలకు రూపకల్పన చేశారు. ప్రతి ఉమ్మడిజిల్లాకో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
- డి. విజయ్‌కుమార్,
సీఎం కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి