
- కలెక్టర్లకు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 31లోపు లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) అప్లికేషన్లను వంద శాతం పరిష్కరించాలని కలెక్టర్లను మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఆదేశించారు. శుక్రవారం ఎల్ ఆర్ఎస్ స్కీంపై కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి తప్పులు జరగకుండా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని, అప్లికెంట్లు బిల్డింగ్ పర్మిషన్లు తీసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్లకు సూచించారు.
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన అప్లికేషన్లకు సంబంధించి ప్రొసీడింగ్స్ జనరేట్ చేసి అప్లికెంట్లకు పంపాలని, ఇప్పటికీ ఫీజు చెల్లించని అప్లికెంట్లకు రెండో సారి ఫోన్ చేసి ఈ నెల 31లోగా ఫీజులు చెల్లించేలా చూడాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు పూర్తి చేసేందుకు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు.