ఎల్ఆర్ఎస్​ పూర్తయితే రూ.10 వేల కోట్ల ఆదాయం.. ఈ డబ్బులపై ప్రభుత్వ నిర్ణయం ఇది..

హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలోనే  మొత్తం 4.60 లక్షలకు పైగా దరఖాస్తులు ఎల్ఆర్ఎస్​ కింద అందగా, వాటి ద్వారా హెచ్ఎండీఏకు రూ.వెయ్యి కోట్లు, జీహెచ్ఎంసీకి రూ.450 కోట్ల ఆదాయం సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో అక్రమ లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో బీఆర్ఎస్​ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో కేసులు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

ఆ తర్వాత గత ఆగస్టులో కాంగ్రెస్​ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్​ అప్లికేషన్లను పరిశీలించి.. పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తుల్లో అర్హమైన వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ మొత్తం ఆయా మున్సిపాలిటీల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక మొత్తం అప్లికేషన్లలో దాదాపు 20 శాతం వరకు దరఖాస్తులు అనర్హమైనవని అధికారులు గుర్తించినట్లు సమాచారం.

రాష్ట్రంలో పెండింగ్‌‌లో ఉన్న జీవో 59ను అమలు చేసి, అర్హులైన వారికి రెగ్యులైజేషన్ కింద పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. గత ప్రభుత్వంలో అప్లికేషన్లు తీసుకున్నారు. అయితే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో జీవో 58,59 దరఖాస్తులను కాంగ్రెస్​ ప్రభుత్వం పక్కన పెట్టింది.  ఈ దరఖాస్తుల్లో నిజమైన లబ్ధిదారులు ఉంటే వాటిని పరిష్కరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ అప్లికేషన్లను పూర్తి చేయాలనుకుంటున్నది.

Also Read :- 300 కోట్ల ఉపాధి బిల్లులు విడుదల

59 జీవో కింద వచ్చిన 50 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా సుమారు రూ.6 వేల కోట్ల వరకు ఖజానాకు సమకూరుతుందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది.  ఇదే జీవో కింద అధిక విలువ గల భూములను క్రమబద్దీకరిస్తే ఇంకో రూ.5,500 కోట్లు వస్తాయని... జీవో 76, 118 దరఖాస్తుల పరిష్కారం ద్వారా అదనంగా రూ.300 కోట్లు అందుతాయని ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.  ఈ జీవో కింద పరిశీలన పూర్తై డిమాండ్‌‌ నోటీసు మేరకు డబ్బులు పూర్తిగా చెల్లించినవారు, పాక్షిక మొత్తం చెల్లించినవారు, తనిఖీలు పూర్తిచేసుకున్న వారు, కన్వేయన్స్‌‌ డీడ్‌‌లు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం విధించిన స్టేతో ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేనివారు వేల మంది ఉన్నారు.

జీవో 59 ప్రకారం  రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  తొలుత 2014 జూన్‌‌ 2 నాటికి ఆక్రమణలో ఉన్న భూములను రెగ్యులరైజ్​ చేస్తామని జీవోలో పేర్కొన్నా.. 2023లో విడుదల చేసిన జీవోలో దరఖాస్తు చేసుకునే నాటికి ఆక్రమణలో ఉన్నా క్రమబద్ధీకరిస్తామని సర్కారు పేర్కొన్నది. రెగ్యులరైజ్​ కోసం 125 నుంచి 250 గజాల వరకు స్థలాలకు మార్కెట్‌‌ విలువలో 25 శాతం.. 250 గజాల నుంచి 500 గజాల ఉన్న స్థలాలకు 50 శాతం, 500–750 గజాల స్థలాలకు 75శాతం, 750 గజాలపైన ఉంటే మార్కెట్‌‌ విలువలో 100 శాతం సొమ్ము చెల్లించాలి. క్రమబద్ధీకరణకు సంబంధించిన మరో జీవో 58 ప్రకారం... 125 చదరపు గజాలలోపు భూమిలో నిర్మాణాలుంటే ప్రభుత్వం ఉచితంగా  రెగ్యులరైజ్​ చేస్తుంది.