ఫుడ్ పాయిజన్పై టాస్క్ ఫోర్స్.. బాధ్యులను తేల్చనున్న రాష్ట్ర ప్రభుత్వం

ఫుడ్ పాయిజన్పై టాస్క్ ఫోర్స్.. బాధ్యులను తేల్చనున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్ వాడీల్లో ఆహార నాణ్యత అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇటీవల నారాయణపేట జిల్లా మాగనూరు పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో విద్యార్థులు మూడు సార్లు ఫుజ్​ పాయిజన్​కు గురయ్యారు. దీనిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది.

ఈ నేపథ్యంలో ఆహార నాణ్యతపై దృష్టి సారించిన ప్రభుత్వం ఫుడ్​ పాయిజన్​కు కారణాలు తేల్చేందుకు ప్రత్యేక టాస్క్​ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులు ఉండే ఈ కమిటీలో ఒక ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఓ అదనపు డైరెక్టర్, ఒక జిల్లా స్థాయి అధికారి ఉంటారు.

గురుకులాలు, హాస్టళ్లలో ఆహార నాణ్యతను ఈ బృందం పరిశీలించనుంది. వీటితో పాటు అంగన్​వాడీలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతనూ పర్యవేక్షించనుంది. ఫుడ్‌ పాయిజన్‌ జరిగినప్పుడు కారణాలు తేల్చి, బాధ్యులను గుర్తించనుంది. ఈ మేరకు సీఎస్​ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

పాఠశాలల్లో ముగ్గురితో కమిటీలు
గురుకులాలు, అంగన్ వాడీలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందుకోసం అన్ని విద్యాసంస్థల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ కమిటీల్లో ప్రధానోపాధ్యాయుడితో పాటు ఇద్దరు సిబ్బంది సభ్యులుగా ఉంటారు. వీళ్లు వంట ప్రారంభానికి ముందు కిచెన్ ను పర్యవేక్షించాల్సి ఉంటుంది. 

నాణ్యమైన సరుకులతోనే వంట చేస్తున్నారా..? అనే అంశాన్ని నిర్ధారించిన తర్వాతే కుకింగ్ జరగాలి. భోజనం  సిద్ధమైన తర్వాత హెడ్ మాస్టర్, ఇద్దరు సభ్యులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు అందించాలని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.