- ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారును ఆదేశించండి
- జాతీయ ఎస్టీ కమిషన్‌కు ట్రైబల్ ఫెడరేషన్ ఫిర్యాదు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లయినా రాష్ట్ర సర్కారు ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేయట్లేదని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్(ఎన్టీఎఫ్) తెలంగాణ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ అనంత నాయక్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణలో ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ వేసేలా రాష్ట్ర సర్కారుకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అనంతరం తెలంగాణ భవన్లో ఎన్టీఎఫ్ టీఎస్ ప్రెసిడెంట్ ఉషాకిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి మాట్లాడారు. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఆదివాసీలు, గిరిజనులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణలోనే ఎక్కువగా 32 లక్షలకు పైగా ఎస్టీ జనాభా ఉందని, మొత్తం జనాభాలో 12 శాతం మంది గిరిజనులేనని గుర్తుచేశారు. తెలంగాణ కంటే తక్కువ జనాభా ఉన్న ఎపీలో ఎస్టీలకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ వేసిందని, తెలంగాణలో మాత్రం ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ వేయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాష్ట్రంలో ఆదివాసీలకు నష్టం జరుగుతోందన్నారు.