చెడగొట్టు వానలకు సర్వం కోల్పోయి రోడ్డునపడ్డ రైతులు

  • నాలుగు రోజుల్లో 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో పంటనష్టం
  • రివ్యూ చేయని సీఎం.. పార్టీని విస్తరించే పనిలో నిమగ్నం
  • పట్టించుకోని వ్యవసాయ మంత్రి.. ప్లీనరీ, సమ్మేళనాల్లో నేతలు బిజీ
  • ఒకరిద్దరు మంత్రులు తప్ప రైతుల దిక్కు చూడని అధికార పార్టీ లీడర్లు
  • ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని నెల కింద చెప్పిన కేసీఆర్​.. 
  • ఒక్కరికి కూడా పైసా అందలే

హైదరాబాద్/ నెట్​ వర్క్​, వెలుగు: కోతకు సిద్ధంగా ఉన్న వరి..  పాలగింజ దశలో ఉన్న మక్క.. రేపో మాపో తెంపేందుకు రెడీగా ఉన్న మామిడి.. ఇన్నాళ్ల తమ కష్టాలు తీరినట్టేనని రైతులు ఊపిరి పీల్చుకుంటుండగా చెడగొట్టు వానలు, వడగండ్లు నిండా ముంచెత్తాయి. గొలకల మీద ఒక్క  గింజ కూడా మిగలకుండా వడ్లను నీటిపాల్జేశాయి. మక్క.. ఉన్నదున్నట్టు నేలకొరిగిపోయింది. మామిడి కాతంతా రాలిపోయింది. వాటిని చూస్తూ రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ‘‘చేతులకు పంటరాదు.. మా కండ్లకు నీళ్లొస్తున్నయ్​.. అప్పులెట్ల తీర్చాలె’’ అంటూ గోసపడుతున్నారు. ఆ కన్నీళ్లు ప్రభుత్వ పెద్దలను కదిలించడం లేదు. పరామర్శించి, ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు అటు దిక్కు కన్నెత్తి చూడటం లేదు. ఒకరిద్దరు మంత్రులు, ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప అధికార పార్టీ లీడర్లెవరూ ఆ వైపు వెళ్లడం లేదు. ఆ వెళ్తున్న ఒకరిద్దరు మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో, తమ జిల్లాల్లోనే పర్యటిస్తున్నారు. మహారాష్ట్రలో బీఆర్​ఎస్​ విస్తరణ, నాయకుల చేరికలు, పార్టీ ఆవిర్భావ వేడుకలపైనే సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. రైతులకు భరోసానివ్వాల్సిన వ్యవసాయ మంత్రి పత్తా లేరు. రైతులకు అండగా నిలవాలని పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ ​టెలీకాన్ఫరెన్స్​లో చెప్పారే తప్ప  పంట నష్టపోయిన రైతులను పరామర్శించే ప్రయత్నం చేయలేదు. 

నెల కింద ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్​ జిల్లాల్లో పంట నష్టాన్ని సీఎం కేసీఆర్​హెలీకాప్టర్​లో వెళ్లి పరిశీలించారు. పంట కోల్పోయిన వారికి ఎకరానికి రూ. 10‌‌‌‌ వేల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన ప్రకటించినా.. ఇంత వరకు ఒక్కరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయలేదు. నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలు, పంట నష్టంపై ఆయన స్పందించడం లేదు. రివ్యూలు కూడా చేయడం లేదు. 

4 రోజుల్లో 4.50 లక్షల ఎకరాలకు పైగానే నష్టం

రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వరుసగా శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. టెన్నిస్​బాల్​ సైజులో వడగండ్లు పడుతున్నాయి. కోతకు వచ్చిన వరి చేలు రాళ్లు, అకాల వర్షాలతో నేలమట్టమయ్యాయి. అప్పటికే కోసి పంట చేలలోనే కుప్పపోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. రోజూ వర్షం కురుస్తుండటంతో ధాన్యం ఆరబెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. నాలుగు రోజుల్లో 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నేలపాలైంది. కల్లాల్లో ఆరబోసిన వడ్లు మొలకలు వచ్చాయి. కొందరు రైతులు పంటను కోసి.. కొనుగోలు సెంటర్లకు తరలిస్తే అక్కడా కొనే దిక్కులేదు. ఆ వడ్లు కూడా వర్షానికి తడిసి మొలకలొచ్చాయి. రాష్ట్రమంతా రైతులు ఇలా అవస్థలు పడుతుంటే ప్రభుత్వ పెద్దలు వారికి కనీసం భరోసానిచ్చే ప్రయత్నం చేయడం లేదు. నెల కింద పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్​ఆ తర్వాత రైతుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎస్​కు ఆదేశాలిచ్చి బీఆర్​ఎస్​ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణల నుంచి ఎలా బయట పడాలనే ప్రయత్నాలు చేయడం మినహా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వంలో, బీఆర్ఎస్​ పార్టీలో నంబర్​2గా ఉన్న మంత్రి కేటీఆర్​నాలుగు రోజుల తర్వాత బుధవారం పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు భరోసానివ్వాలని ఆదేశించారు. మంత్రులు హరీశ్​రావు, గంగుల కమలాకర్, కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే తమ జిల్లాలు, నియోజకవర్గాల్లో నష్టపోయిన పంట పొలాలు పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. కేబినెట్​లోని మిగతా మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులంతా బీఆర్ఎస్​ నియోజకవర్గాల ఆత్మీయ సమ్మేళనాలు, ప్లీనరీ.. పార్టీ ఇతర వ్యవహారాల్లోనే బిజీగా ఉన్నారు.

నిండా మునిగినం.. ఆదుకోండి

అకాల వర్షాలతో పంట నష్టపోయిన తమకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని, తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ బుధవారం పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానలతో వరి చేలలో వడ్లన్నీ రాలిపోయాయని,  కల్లాల్లోనూ, కొనుగోలు సెంటర్లలోనూ వడ్లు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  వడ్ల కొనుగోళ్లలో ఆలస్యం వల్లే కల్లాల్లో వడ్లు కొట్టుకపోయాయని అన్నారు. 
కామారెడ్డి  జిల్లా లింగాయపల్లి చౌరస్తా లో  కొటాల్​పల్లి,  లింగాయపల్లికి చెందిన  రైతులు గింజలు రాలిన వరికంకులతో రోడ్డుపై ఆందోళన చేశారు. కలెక్టర్​ వచ్చి కచ్చితమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని పట్టుబట్టారు. వారితో తహసీల్దార్​ వెంకట్​రావు , ఏవో శ్రీనివాస్​రావు మాట్లాడారు. రాజంపేట  మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు.  కామారెడ్డి మండలం పాతరాజంపేట మెయిన్​ రోడ్డుపై  రైతులు రాస్తారోకో చేశారు.  ఆందోళన జరుగుతుండగా అక్కడకు వచ్చిన అధికార పార్టీకి చెందిన కామారెడ్డి జెడ్పీటీసీ మెంబర్​ చిదుర రమాదేవి, ఆమె భర్త  చిదుర లక్ష్మారెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో వారిద్దరు కూడా రైతులతో కలిసి  రాస్తారోకోలో పాల్గొన్నారు.  

అకాల వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని కరీంనగర్​ కలెక్టరేట్​ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. ప్రతి ఎకరాకు  రూ. 30వేల నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఓ వైపు రైతులు కన్నీళ్లు పెడుతుంటే ఆత్మీయ సమ్మేళనాల పేరిట బీఅర్ఎస్ లీడర్లు  చిందులు వేయడం ఏమిటని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​లో రాజీవ్​ రహదారిపై కాంగ్రెస్​ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. సీఎం ప్రకటించిన రూ. 10 వేల సాయం ఇంతవరకు ఒక్కరికీ అందలేదని, వడగండ్లవానతో రైతులు మరోసారి కోలుకోలేని దెబ్బ తిన్నారని డీసీసీ ప్రెసిడెంట్​ కె. సత్యనారాయణ అన్నారు. 20 రోజుల కిందటే రైతులు సెంటర్లకు వడ్లు తెచ్చినా కాంటాలు వేయకపోవడంవల్ల  తీవ్రంగా వడ్లు తడిసిపోయాయని తెలిపారు. 

వడ్ల కొనుగోలులో ఆలస్యం వల్లనే  సెంటర్లలో వడ్లు తడిసిపోయాయని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్​లో  రైతులు ధాన్యానికి నిప్పు పెట్టారు. తప్ప, తాలు లేకుండా శుభ్రపరిచిన వడ్లు తేవాలని సెంటర్ నిర్వాహకులు చెప్పడంపై మండిపడ్డారు. యాదాద్రి జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని,  తడిసి, మొలకెత్తిన వడ్లను కొనుగోలు చేయాలని బీజేపీ, కాంగ్రెస్​లీడర్లు  డిమాండ్​ చేశారు.  ఆయా పార్టీల లీడర్లు.. కొనుగోలు సెంటర్లలో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిచారు.  ఎకరానికి రూ. 10 వేల నష్టపరిహారం ఏ మాత్రం సరిపోదని,  ఎకరానికి కనీసం 25 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ  భువనగిరిలో బీజేపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు.   

పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా నర్మేట చౌరస్తాలో ధర్నా జరిగింది. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50వేలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫసల్ బీమా రాష్ట్రంలో అమలు చేస్తే రైతులకు మేలు జరిగేదని బీజేపీ  జిల్లా అధ్యక్షుడు దశమంత రెడ్డి అన్నారు. ధర్నాలో సీపీఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్, మాజీ జెడ్పీటీసీ  గాదె మోహన్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి గంగం నర్సింహారెడ్డి ,  సీపీఎం నాయకురాలు పాతూరి సుగుణమ్మబీజేపీ  మండల   అధ్యక్షుడు ధారావత్ రాజు, భూక్యా జయరాం తదితరులు పాల్గొన్నారు. అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ధర్నా వద్ద ఆగి మాట్లాడారు. రైతులపై ప్రేమ ఉంటే  కేంద్ర ప్రభుత్వం ఎకరానికి రూ. 30 వేలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు. ఇదే జిల్లా వడ్లకొండ, అడవి కేశ్వాపూర్​లోని ఐకేపీ సెంటర్ల​ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చినా కొనడం లేదని, దీంతో వర్షానికి వడ్లు తడిసిపోయాయని, మొలకలొస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. చెడగొట్టు వానలకు అటు పొలాల్లో పంటలు నేలకొరిగిపోయాయని, ఇటు కోసిన పంటను కొనుగోలు సెంటర్​కు తెస్తే కాంటా పెట్టడం లేదని అన్నారు.


సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంత్రి హరీశ్ రావు బుధవారం పరిశీలించారు. ఫీల్డ్​ సర్వే చేసి నష్టపోయిన రైతుల వివరాలు పంపాలని అధికారులను ఆయన ఆదేశించారు. కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లి శివారులో వరి పంటను,  పొందుర్తిలో వడ్ల కొనుగోలు సెంటర్​ను 
పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.