మిషన్ స్పీడ్ 19 ప్రాజెక్టులపై సర్కార్​ ఫోకస్

మిషన్ స్పీడ్ 19 ప్రాజెక్టులపై సర్కార్​ ఫోకస్
  • రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బూస్ట్ ​ఇచ్చేలా యాక్షన్​ ప్లాన్​
  • పనులు వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు
  • ప్రాధాన్య అంశంగా ఫోర్త్​ సిటీ డెవలప్​మెంట్​
  • లిస్ట్​లో మూసీ రివర్ ఫ్రంట్,  శాటిలైట్ టౌన్స్​, ట్రిపుల్​ ఆర్ 
  • పనులను స్వయంగా సమీక్షించనున్న సీఎం
  • ఆన్​లైన్​ పోర్టల్​లో పనుల వివరాలు అప్​లోడ్​
  • ప్రత్యేకాధికారిని నియమించే అవకాశం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బూస్ట్​ఇచ్చేలా, హైదరాబాద్​కు పెట్టుబడులను ఆకర్షించేలా కీలక ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయా ప్రాజెక్టులను ‘స్పీడ్’ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) పేరుతో శరవేగంగా పూర్తిచేయాలని నిర్ణయించింది.  ఇందులో ఇప్పటికే 19 ప్రాజెక్టులను ప్రభుత్వం సెలెక్ట్​ చేసింది. ఈ పనులపై సీఎం రేవంత్​రెడ్డి స్వయంగా రివ్యూ చేయనున్నారు. డెడ్​ లైన్​ పెట్టుకుని ప్రాజెక్టులు, పనులను పూర్తి చేయడంతోపాటు నిర్దేశించిన లక్ష్యం నెరవేరేలా చూడనున్నారు. సంబంధిత విభాగాల అధికారులతో నెలకో సారి సమావేశమవుతారు. ఈ పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలో సమర్థవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

‘స్పీడ్’ నిర్దేశించిన ప్రణాళికకు అనుగుణంగా పనులు చేపట్టాలని సంబంధిత విభాగాల అధికారులను ఇప్పటికే ఆదేశించారు.  రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రామాణికమైన మౌలిక సదుపాయాల కల్పనలో వివిధ విభాగాల మధ్య ఉన్న అడ్డంకులు, అవరోధాలన్నింటినీ అధిగమించేందుకు స్పీడ్ ప్రత్యేక చొరవ చూపనున్నట్టు సెక్రటేరియేట్​ వర్గాలు వెల్లడించాయి.  పనుల్లో ఎక్కడా ఆలస్యం జరగకుండా నేరుగా సీఎం స్థాయిలో అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.  పట్టణాలకే పరిమితం కాకుండా.. అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై ‘స్పీడ్’ దృష్టి కేంద్రీకరించనుంది.  ఇందులో భాగంగా తమ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాలు స్పెషల్​ ప్లాన్లు తయారు చేయనున్నాయి. ఏ గడువులోగా.. ఎంత పని జరుగుతుందనే నిర్ణీత కాల వ్యవధిని ఇందులో పొందుపరుస్తారు. ఎప్పటివరకు ఏయే పనులు పూర్తవుతాయనే పనుల అంచనాలను ప్రస్తావిస్తారు.

ఆన్​లైన్​లో ఎప్పటికప్పుడు అప్​డేట్​

‘స్పీడ్’ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఆయా విభాగాలు ప్రత్యేక విధానం అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రమం తప్పకుండా పనితీరును సమీక్షించుకొని, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.  ‘స్పీడ్’ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రణాళిక విభాగం ప్రత్యేకంగా ఆన్​లైన్​ పోర్టల్​ను నిర్వహిస్తుంది. ఏ రోజుకు ఎంత పని జరిగిందనే అప్ డేట్ డేటాను ఇందులో పొందుపరుస్తుంది. దానికి అనుగుణంగా ఏ ప్రాజెక్టు ఎక్కడ?  ఏ దశలో ఉన్నది ? ఏదైనా కారణంతో నిలిచిపోయిందా ? ఎక్కడ పనుల్లో వేగం తగ్గుతున్నది? అనే వివరాలను తెలుసుకోనున్నది. దీంతో పాటు ఆయా అధికారులతో సీఎం రివ్యూ మీటింగ్ పెట్టి, ఆ ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూడనున్నారు. 

స్పీడ్​ కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. లేదా సీఎం సెక్రటరీల్లోనే ఒకరికి బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం ‘స్పీడ్’​లో తీసుకున్న ప్రాజెక్టుల్లో ఎక్కువగా క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ కింద ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కల్పించేవి ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే.. తెలంగాణ ఆర్థిక రంగం మరింత పుంజుకుంటున్నదని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతోపాటు రెసిడెన్షియల్​స్కూల్స్, హాస్పిటల్స్​ వంటి వాటిని కూడా ‘స్పీడ్’​లో పొందుపర్చింది. ఇందులో విద్య, వైద్యానికి ప్రభుత్వం చోటు ఇచ్చిందని.. వీటి విషయంలోనూ సీఎం రేవంత్​ రెడ్డి సీరియస్​గా పనిచేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

‘స్పీడ్’ ప్రోగ్రామ్​లోని 19 ప్రాజెక్టులు ఇవే..

‘స్పీడ్’​ ప్రోగ్రామ్​లో హైదరాబాద్, ఫోర్త్​ సిటీ డెవలప్​మెంట్​ప్రాధాన్య అంశంగా ఉన్నది. మొత్తం 19  ప్రాజెక్ట్​లను ఇందులో పొందుపర్చారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్,  శాటిలైట్ టౌన్స్​ డెవలప్​మెంట్, మెట్రో రైలు విస్తరణ,  జీహెచ్ఎంసీ పునర్​వ్యవస్థీకరణ,  రీజినల్ రింగ్ రోడ్,  హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఉన్నాయి. అలాగే,  ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం,  మహిళా శక్తి పథకం అమలు, జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం, రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి, ఐటీఐల్లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు, కొత్త ఉస్మానియా హాస్పిటల్​ను ఇందులో పొందుర్చారు.  వీటితోపాటు15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు,  హెల్త్ టూరిజం ప్రమోషన్ , ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్,  టెంపుల్ సర్క్యూట్స్ టూరిజం, యాంటీ డ్రగ్స్ స్ట్రాటజీ అమలు ఈ ప్రోగ్రామ్​లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏమైనా ప్రాధాన్యంగా భావిస్తే వాటిని కూడా ‘స్పీడ్’​ జాబితాలో చేర్చనున్నారు.