పాలన పేరుతో ప్రజా ధనం దుబారా..!

మొక్కుల పేరుతో 8 కోట్ల 73 లక్షల రూపాయలు ఖర్చు
అప్పుల రాష్ట్రంగా తెలంగాణ


ప్రజల బాగోగులే పాలకుల ప్రథమ కర్తవ్యం కావాలి. విజ్ఞత, వివేకం జవాబుదారీతనం పాలకుల్లో కొరవడకూడదు. అసందర్భ హామీలు, అనవసర ఖర్చులు చేయకూడదు. ఖజానాలో జమయ్యే ప్రతి పైసా పన్నుల ద్వారా వచ్చిందే. ప్రజలు కొనుగోలు చేసే ఉప్పు, పప్పు ద్వారా ఖజానా నిండుతుంది. టాక్స్​ల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మును ఖర్చు చేసేటప్పడు నాయకులకు చాలా జాగ్రత్త అవసరం. ఒక్కసారి ప్రజల్లో చులకన భావన ఏర్పడితే భవిషత్తులో ఎంత మంచి చేసినా పట్టించుకోరు. పాలకులు వేసే ప్రతి అడుగు ప్రజలు మెచ్చేలా  ఉండాలి.

నవాబ్ జీ, రేపు మీరు కొత్త షేర్వాణీతో రండి… అన్నారు భారత మిలట్రీ చీఫ్ జెఎన్. చౌదరి. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తికి రెండు రోజుల ముందు అప్పటి నిజాంతో వినమ్రంగా చెప్పిన మాటలు అవి. కానీ నిజాం నవాబు కొత్త షేర్వాణీ కొనలేదు. పాతదానికే చిరుగులు కుట్టి ఇస్త్రీ చేసుకొని బేగంపేట్ ఎయిర్ పోర్టుకు వెళ్లి సర్దార్ పటేల్​ను కలిశారు. కొత్తది కావాలంటే ఆయన ఎన్నో కొనవచ్చు. కానీ పాత షేర్వాణీనే తొడిగారు. అది ఆయన పొదుపరితనానికి నిదర్శనం. నిజాం పాలన ముగిసి నైజాం స్టేట్ ఇండియాలో విలీనమయ్యేనాటికి 540 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంది.

2014 జూన్ 2… ఆంధ్ర పాలకులనుంచి విడిపోయి తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించిన రోజు. అప్పటికి మిగులు బడ్జెట్ సుమారు రూ.16,000 కోట్లు. మరి నేడు కేవలం 5 సంవత్సరాల్లోనే రాష్ట్రం లక్షా 80 వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. ఆంద్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన నాడున్న 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ దుబారాకు అరిగి కరిగి తరిగిపోయి నేడు అప్పుల రాష్ట్రంగా మిగిలింది.

సొంత డబ్బులు ఎంత దర్జాగానైనా ఖర్చుపెట్టవచ్చు… కానీ ప్రజల సొమ్ము మాటేమిటి? నాయకులు ఖర్చు చేసే ప్రతి పైసా పన్నుల రూపంలో వచ్చేదే. అధికారంలోకి వచ్చాక నాయకులు చేస్తున్నదేంటి? అప్పటివరకు పిల్లికి బిచ్చం పెట్టని నాయకులు అధికారంలోకి రాగానే ప్రజల సొమ్ము జల్సాగా దుబారా చేస్తుండ్రు. కాలు పెడితే  పాలరాతి భవనాలు, ప్రత్యేక విమానాలు… ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్న పేరుతో వేలకోట్ల రూపాయలు తగలేస్తున్నారు. ప్రజల సొమ్ముకు జవాబుదారీ లేకుండా పోతోంది. కేవలం తిరుగుడు, తినుడు పేరుతో కోట్ల రూపాయలు ఖర్చయిపోతున్నాయి! ఈ అంశం ‘ఎప్పటినుంచో ఉందిగా’, ఇప్పుడెందుకు చర్చలోకి వచ్చిందనుకుంటున్నారా? తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగుకోసం వచ్చిన ఇద్దరు గెస్టులకు మర్యాదపూర్వకంగా ఇచ్చిన ఖరీదైన గిఫ్టుల గురించి రాష్ట్రంలో చర్చ మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిని సీఎం ఆహ్వానించారు. వారూ వచ్చారు. రికార్డు టైంలో పాజెక్టు పూర్తి చేయడంపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి​ని  ప్రశంసించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సందర్భంగా కోటి 66 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసి అతిథులకు బహుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉందా..? అన్న చర్చ మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు టైంలో, యాభై వేల కోట్లు ఖర్చు చేసి, పూర్తి చేశాం. అందువల్ల అతిథులకు ఇచ్చే బహుమతులుకూడా అంత రిచ్​గా ఉండాలని ప్రభుత్వ పెద్దలు భావించి ఉండవచ్చు, కానీ దానివల్ల ఏం సాధించారు?  కోటి 66 లక్షల రూపాయలు పెట్టి సిల్వర్ ఫిలిగ్రీ మెమోంటోలు ఇవ్వకపోతే అతిథులు రామన్నారా?

ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రులంతా పొదుపు చేయకపోయినా, దుబారా చేయలేదన్న అభిప్రాయం ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడి టీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హంగు ఆర్భాటాలు పెరిగాయన్న విమర్శలు ఎక్కువైనాయి. అదాయాలు కూడా పెరిగాయి, అపైన అప్పులు తెచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని సమర్థించుకున్నా… ఒకవైపు అప్పులు కొండలా పెరుగుతున్నప్పుడు దుబారా ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరాన్ని పొలిటికల్​ అబ్జర్వర్లు గుర్తు చేస్తున్నారు.

ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ప్రజలదేనన్న ధ్యాస దశాబ్దాలుగా పాలకుల్లో కనుమరుగైపోయింది. రాను రాను ఖర్చుకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.  కాళేశ్వరం ఓపెనింగ్ సందర్భంగా రెండు ప్లవర్ బోకేలు ఇచ్చినా అతిథులు అనందంగా వెళ్లేవారే. కానీ ప్రభుత్వం కోటి 66 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఈ డబ్బు అధికారంలో ఉన్నవారికి చిన్న మొత్తమే కావచ్చు. కానీ అదే సొమ్మును ప్రజల మేలుకు వాడితే ఎంతో మంచిది. ప్రజాకర్షక పథకాల్లో జరుగుతున్న దుబారాని పక్కన పెడితే, ప్రస్తుతం పాలన పేరుతో ప్రజా ధనం బాగా దుబారా అవుతోంది. గతంలో ప్రత్యేక తెలంగాణ కోరిక సిద్ధించాలని, కేసీఆర్ దేవుళ్లకు ఖరీదైన మొక్కులు  మొక్కారు. మొక్కిన విధంగా అధికారంలోకి వచ్చాక ఆంధ్రాలో మూడు దేవాలయాలు, తెలంగాణలో రెండు దేవాలయాలకు కలిపి… ప్రభుత్వ సొమ్ము 8 కోట్ల 73 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన బంగారు మొక్కులు చెల్లించారు.

సెంటిమెంట్ల పేరుతో ప్రజల సొమ్మును దేవుళ్లకు కానుకలుగా సమర్పించడం ఏ రూల్స్ బుక్​లోనూ లేదు. ఇది పాలకుల విజ్ఞతకు సంబంధించిన విషయం. ఇక, ముఖ్యమంత్రి చేసిన యాగం కూడా అటువంటిదే, యాగం ఖర్చంతా సొంత డబ్బే కావచ్చు. అంతకు పదిరెట్లు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారన్నదే ప్రధాన విమర్శ. దీన్ని మేధావులు తప్పుబట్టారు. ‘ఈ మాత్రం ఖర్చు ఓ లెక్కా’ అని పాలకులు అనుకోవచ్చు. అదే అయిదేళ్ల టర్మ్ ముగిసేసరికి వందల కోట్ల రూపాయలకు చేరుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన సీఎంలు ఎటు వెళ్లాలన్నా గతంలో కార్లలో వెళ్లేవారు. ఆ తర్వాత గత 15 ఏళ్ల నుంచి మెల్లిగా హెలికాప్టర్లు రంగ ప్రవేశం చేశాయి.  ఇప్పడు ఏకంగా అద్దె విమానాలనే వాడుతున్నారు. తక్కువ ఖర్చుతో వెళ్లగల ఇతర మార్గాలున్నా… పాలకులు ప్రత్యేక విమానం దిగడం లేదు. ఢిల్లీ వెళ్లినా, తీర్థయాత్రలకు వెళ్లినా, చివరకు విదేశాలకు వెళ్లినా స్పెషల్​ ఫ్లయిట్లు (అద్దె విమానాలు) వాడుతున్నారు. చేతికి ఎముక లేకుండా ఖర్చు చేస్తున్నరు. మాట్లాడితే ‘ధనిక రాష్ట్రంలో ఈ మాత్రం ఖర్చు చేయకూడదా..’ అంటారు! ఎక్కడి ధనిక రాష్ట్రం? మిగులు బడ్జెట్ నుంచి కోటి 80 లక్షల కోట్ల రూపాయల అప్పుకు రాష్ట్రం ఎగబాకడం ధనికమా?

‑ మద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి

సౌలత్ పేరుతో సోకులు!

పాలన చేయాలంటే కొన్ని సౌకర్యాలు అవసరమే. వాటిని సమకూర్చుకుంటే ఎవ్వరూ కాదనరు. ఏకంగా ఉన్న భవనాల్ని కూలగొట్టి అత్యాధునాతన సౌకర్యాలతో రాజమహల్ లాంటి బిల్డింగులు కట్టుకోవడం రాష్టంలో సహజమైంది. అప్పట్లో వై, ఎస్ రాజశేఖర్ రెడ్డి  కట్టుకున్న క్యాంప్ ఆఫీసే పెద్ద చర్చనీయాంశమైతే,  ఇప్పుడు ప్రగతి భవన్ అచ్చంగా ఓ రాజమహల్ అంటున్నారందరు. ముఖ్యమంత్రులు, మంత్రులు నివాసాలు, వారి టూర్ల పేరుతో జరిగే ఖర్చుకు హద్దు లేదా? ఏ స్థాయిలో అయినా ఖర్చు చేయవచ్చా? ఖర్చు మీద ఎటువంటి రూల్స్​ అండ్​ రెగ్యులేషన్​లు లేకపోయినా ఆత్మ విమర్శ చాలా ముఖ్యమన్నది మేధావుల వాదన. తాజాగా రాష్ట్ర పరిపాలన కేంద్రం సెక్రటేరియేట్​ని కూల్చేస్తున్నారు. అదేమంటే ‘మా ఇష్టం’ అంటారు. రాష్ట్రంలో 20 శాతం పాఠశాలలు కూలిపోయే దశలో ఉన్నాయి. పెచ్చులూడి విద్యార్థుల తలలు పగులుతున్నా వీరికి పట్టదు. కానీ, మంచి భవనాల్ని కూల్చి కొత్తవి కట్టుకుం టున్నారు. ఆస్పత్రుల్లో మందుల్లేకపోయినా పర్లేదుగానీ, ప్రభుత్వ పెద్దలకు మాత్రం వాస్తు ముఖ్యం. వచ్చే ఎన్నికల్లోఎలా గెలవాలనే వ్యూహం ముఖ్యం. పాలన లేదు. మంత్రులు ఎక్కడుంటారో తెలియదు. ప్రజల సొమ్ముతో ప్రొటోకాల్ అనుభవించే మంత్రులు పొలిటికల్ మంత్రాంగంలో మునిగిపోతున్నారు.

అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా!

ఇప్పటివరకు రాష్ట్రాన్నేలిన సీఎంలను చూస్తే, బూర్గుల రామకృష్టారావు నుంచి మొన్నటి విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్​ల వరకు  ఖర్చు విషయంలో అదుపులోనే ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పడు ఓ జిల్లా టూర్ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోనే ఆయన స్పెషల్ సెక్రెటరీ వచ్చి… ‘ఇప్పడు వాడుతున్న అంబాసిడర్ కారు పాతదైంది. తరచు రిపేర్లకు వస్తోంది. కొత్త కారు కొనడానికి అనుమతి ఇవ్వాల’ని కోరాడు. దానికి ఎన్టీఆర్ ‘కొత్తదెందుకు! ఉన్న కారును తీసుకెళ్లి రిపేరు చేయించి తీసుకురండి’ అని చెప్పి ఆ రోజు టూర్ క్యాన్సిల్ చేసుకున్నారట. అంతేకాదు, సీఎం భార్య లక్ష్మీపార్వతి విమాన చార్జీలు రెండు లక్షలు పే చెయ్యాలనగానే టేబుల్ సొరుగులోంచి చెక్ బుక్కు తీసి మారుమాట్లాడకుండా రాసిచ్చాడట. నాటికీ నేటికీ ఎంత తేడా!

మరిన్ని వెలుగు న్యూస్ కోసం క్లిక్ చేయండి