తెలంగాణలో జీరో కరెంట్​ బిల్​ షురూ

తెలంగాణలో జీరో కరెంట్​ బిల్​ షురూ
  • గృహజ్యోతి పథకం అమలు.. జిల్లాల్లో ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు షురూ అయింది. 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించే అర్హులకు శుక్రవారం నుంచి ప్రభుత్వం జీరో  బిల్లు జారీ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సదరన్‌‌, నార్తర్న్ డిస్కంల పరిధిలోని 33 జిల్లాల్లో దాదాపు 39.9 లక్షల మంది వినియోగదారులకు జీరో బిల్లింగ్‌‌ ప్రక్రియ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బంది, అధికారులు, విద్యుత్‌‌ మీటర్‌‌ రీడర్లు ఇంటింటికీ వెళ్లి.. విద్యుత్ బిల్లులు జారీ చేశారు. మొదటి సారి జీరో బిల్లు అందుకున్న వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు. పైన రూ.330, రూ.371, రూ.489, రూ.544 బిల్లు ను చూసి.. ఆ తరువాత కింద జీరో వేయడాన్ని చూసి వినియోగదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రారంభించిన డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు 

ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో గృహజ్యోతి పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఖమ్మం కలెక్టర్  వీపీ గౌతమ్, ఎన్పీడీసీఎల్‌‌ సీఎండీ  వరుణ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్‌‌ లోని భగత్ సింగ్‌‌ నగర్‌‌లో దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారాం మండలాల్లో  పంచాయతీరాజ్‌‌ శాఖ మంత్రి  సీతక్క వినియోగదారులకు జీరో బిల్ అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది జీరో బిల్లుల జారీ ప్రక్రియలో పాల్గొన్నారు. 

గృహజ్యోతి పథకం నిరంతర ప్రక్రియ అని, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అర్హులందరూ అప్లై చేసుకోవచ్చని ప్రజాప్రతినిధులు, అధికారులు వినియోగదారులకు అవగాహన కల్పించారు. రేషన్‌‌  కార్డున్న ప్రతి వినియోగదారుడికి 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు  అందించాలనేదే  ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అద్దెకుండే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని భరోసా ఇచ్చారు. అర్హులు రేషన్‌‌ కార్డు, ఆధార్ కార్డు, కరెంటు బిల్లు మండల పరిషత్, మునిసిపల్ ఆఫీసు, గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ లోని సర్కిల్ కార్యాలయాల్లో అందజేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలని 
సూచించారు.