ప్రాణహిత- చేవెళ్ల స్థానంలో తుమ్మిడిహెట్టికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన ‘వార్ధా’ బ్యారేజీ నిర్మాణానికి అనుమతి కోరుతూ తెలంగాణ సర్కారు కేంద్ర జల సంఘానికి ఇటీవల డీపీఆర్ సమర్పించింది. వ్యాప్కోస్ ఏండ్ల క్రితం పూర్తి చేసి, మూలకు పెట్టిన డీపీఆర్‌ను దుమ్ముదులిపి, కొన్ని నెలల ముందు కేసీఆర్ ప్రభుత్వానికి అందజేసింది. వార్ధా డీపీఆర్ ను జలసంఘానికి సమర్పించడం, వ్యాప్కోస్ కేసీఆర్‌కు ఇవ్వడం, ఇవన్నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ప్రజలను మరోసారి మోసం చేయడం కోసమే. ఇది వల్లమాలిన ఎన్నికల ప్రేమ.
నిరుడు జనవరిలో ఈ ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ. 750 కోట్లని లెక్కించగా, అనూహ్యంగా ఆ మొత్తం రూ. 4,550 కోట్లకు తీసుకువెళ్లారు. ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేట వద్ద వార్ధా బ్యారేజీ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎంతో మంది నిపుణులు చెబుతున్నా వినకుండా తుమ్మిడిహెట్టిని రద్దుచేసి, నిర్మించిన కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారింది. ప్రారంభించిన మూడో ఏడాదే గోదావరి వరదలకు అన్నారం మోటార్లు విధ్వంసమయ్యాయి. ఇప్పుడు అదే దారిలో మళ్లీ వార్ధా వద్ద బ్యారేజీ నిర్మించబోతున్నది.
ప్రాణహిత సంగమమే ప్రత్యామ్నాయం
ప్రభుత్వం 9 ఏండ్లు కుంభకర్ణుడి నిద్రపోయి, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు రూ.4,550 కోట్లతో సీడబ్ల్యూసీకి సిగ్గు విడిచి డీపీఆర్ సమర్పించడం ఓట్ల కోసం జనాన్ని వంచించడం కాదా? రూ. 4 లక్షల 83 వేల కోట్ల అప్పుల సంక్షోభంలో మునిగి, జీతాలు, బిల్లులు చెల్లించలేని పూటపూటకో గండమైన ప్రభుత్వం దీన్ని ఎలా నిర్మిస్తుంది? ప్రాణహిత వైన్ గంగ, వార్ధా అనే రెండు నదుల సంగమం. వార్ధా కంటే వైన్ గంగ రెండింతలు పెద్దది. ప్రాజెక్టుకు అన్ని విధాల అనువైన అత్యుత్తమ స్థలం రెండు నదుల సంగమ ప్రాంతం ప్రాణహిత. అదే తుమ్మిడిహెట్టి. అంటే ప్రాణహితలో రెండు నదుల సంగమం వల్ల నీటి లభ్యత భారీగా ఉంటే, వార్ధా ఒక్కటే కావడం వల్ల ప్రాణహితలో లభ్యమయ్యేంత నీరు వార్ధాలో లభించదు.
వైన్‌గంగను వదిలి వార్ధాపై బ్యారేజ్నిర్మిస్తే, మరో 2 వార్ధాలకు సమానమైన నీరు తెలంగాణ కోల్పోతుంది. వార్ధా బ్యారేజీ గేట్లు 36. మిగతా 71 గేట్లు వైన్గంగవే. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం వైన్‌గంగ వార్ధానదుల సంగమ స్థానం ‘వై’ ఆకారంలో ఉంటుంది. రెండు నదుల సంగమం తర్వాత ఏర్పడే ప్రాణహితలో భారీ వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీనీరు గ్రావిటీలో లభ్యమయ్యే ప్రధాన కారణాల వల్లనే వైన్ గంగ, వార్ధా నదుల సంగమం తర్వాత ప్రాణహిత ప్రాజెక్టును, 2008 లో వ్యాప్కోస్ నిశిత సర్వే మేరకు, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల అధ్యయనం తర్వాత మాత్రమే నాటి సీఎం వైఎస్ఆర్ తుమ్మిడిహెట్టి వద్ద శంకుస్థాపన చేశారు. నిపుణుల అంచనా ప్రకారం 90 శాతం గ్రావిటీతో ఏటా ప్రాణహిత నుంచి గోదావరికి 300 టీఎంసీల నీరు తరలించవచ్చు. కాళేశ్వరంలోనో, ఒక్క వార్ధాలోనో అలా సాధ్యం కాదు.
మహారాష్ట్ర సర్కారు అనుమతులు
వ్యాప్కోస్ పుట్టలోంచి ఏ డీపీఆర్ కావాలంటే ఆ డీపీఆర్ వస్తుంది. ఆ సంస్థ దాని విశ్వసనీయతను, స్వచ్ఛతను కోల్పోయింది. వైఎస్ఆర్ కాలంలో తుమ్మిడిహెట్టి అని, కేసీఆర్ తుమ్మిడిహెట్టి రద్దు అంటే, బదులుగా కాళేశ్వరం డీపీఆర్ ఇచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కోసం వార్ధా డీపీఆర్ ఇచ్చింది. ఖజానాకు కన్నం వేయడానికి పెద్దలకు డీపీఆర్లు కావాలి. వ్యాప్కోస్ సర్వేకు పదుల కోట్ల అవినీతి సొమ్ము కావాలి. ఇలా ఎవరికీ జవాబుదారీతనం లేదు. కోట్ల డబ్బులకు కక్కుర్తిపడి తన నివేదికలను తానే బుట్టదాఖలు చేసి ప్రాజెక్టులను తారుమారు చేస్తూ వ్యాప్కోస్ భారీ అవినీతికి పాల్పడుతోంది. వ్యాప్కోస్ సర్వే చేసిన పాత ప్రాజెక్టుల బకాయిలు కొన్ని కోట్లు కట్టి ఒత్తిడి చేస్తే వార్ధా డీపీఆర్ చేతికొచ్చింది. వార్ధాకు అనుమతి కోరుతూ ఫైలు ఒకటి మహారాష్ట్ర ప్రభుత్వానికి చేరింది.
అంతర్రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ల స్థాయి భేటీలో దీనిపై చర్చించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయిస్తుందని వార్త. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి రూ.1918 కోట్ల వ్యయం అవుతుంది. 107 గేట్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. వార్ధాకు 36 గేట్లు ఏర్పాటుచేస్తే సరిపోతుందని అంచనా. “వార్ధా నది”పై బ్యారేజీ నిర్మిస్తే కేవలం రూ. 700 కోట్ల వ్యయం అవుతుందని గత అంచనా. కానీ సీడబ్లూసీకి సమర్పించిన డీపీఆర్ లో రూ. 4,550 కోట్లు.. అంటే ఆరున్నర రెట్లు ఎక్కువ. ప్రాణహిత బ్యారేజీ ఖర్చు రూ 1918 కోట్లు, 107 గేట్లు ఎందుకు? అని కేసీఆర్- ప్రభుత్వ వాదన. కాళేశ్వరంలో వరదకు విధ్వంసమైన మోటార్ల నష్టం రూ.1125 కోట్లు. ఇది తుమ్మిడిహెట్టి బ్యారేజీ నాటి మొత్తం నిర్మాణ ఖర్చులో 58 శాతం. కాళేశ్వరం ఏడాది కరెంటు ఖర్చుతో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నిర్మించవచ్చు. పొదుపు, ఆర్థిక క్రమశిక్షణ గురించి మాట్లాడే ప్రభుత్వం.. కాళేశ్వరం విధ్వంసంలో నష్టానికి జవాబుదారీ ఎవరో చెప్పాలి.
తుమ్మిడిహెట్టితోనే గ్రావిటీకి ఆస్కారం
ప్రాణహిత(తుమ్మిడిహెట్టి) ప్రాజెక్టు కేవలం ఆదిలాబాద్ లోని 2 తూర్పు జిల్లాలకు మాత్రమే కాదు, తెలంగాణ అంతటికీ సాగు, తాగు నీళ్లందించడం ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఎత్తిపోతలు, కరెంటు అవసరంలేని, నిర్మాణ ఖర్చుతప్ప శాశ్వతంగా పైసాఖర్చు లేకుండా సంపూర్ణ గ్రావిటీతో 71 కి.మీ అనుసంధానం చేయడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టు. ప్రాణహిత, మైలారం, ఎల్లంపల్లి మధ్య 71 కి.మీ. గ్రావిటీ. సంపూర్ణ గ్రావిటీ కాలువ ప్రాణహిత, మైలారం, జైపూర్ వాగు మీదుగా సుందిళ్ల గోదావరికి అనుసంధానించవచ్చని టి.హన్మంతరావు ప్రతిపాదించగా హరీశ్ రావు అంగీకరించి లైడార్ సర్వే చేయించారు. ఏండ్లు గడిచినా ప్రభుత్వ పుట్టలోంచి ఆ సర్వే నివేదిక బయటకు రాలేదు.
ఈ గ్రావిటీ కాళేశ్వరంలో తెలంగాణలో మరెక్కడా లేదు. మైలారం వద్ద స్వల్ప ఎత్తిపోతలతో శ్రీపాద ఎల్లంపల్లికి రోజుకు 2 టీఎంసీల నీరు తరలించవచ్చు. ప్రాణహిత కాలువ నిర్మాణం 80 శాతం పూర్తయింది. గత కాంగ్రెసు ప్రభుత్వమే ఈ తుమ్మిడిహెట్టి కాలువ నిర్మాణంపై రూ.1700 కోట్లకు పైగావెచ్చించింది. వరదకు కాళేశ్వరం విధ్వంసమైన నేపథ్యంలో తుమ్మిడిహెట్టి మాత్రమే నిజమైన ఏకైక ప్రత్యామ్నాయం. తుమ్మిడిహెట్టి మొత్తం నిర్మాణ ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఏడాది పూర్తి విద్యుత్తు ఖర్చుకు సమానం. కాళేశ్వరం ప్రాజెక్టుతో కానీ, వంచించే వార్ధాతో కాని నీళ్లందిస్తామని ఇక జనాన్ని నమ్మించడం ఇంకెన్నాళ్లు?
వ్యాప్కోస్ విశ్వసనీయత ప్రశ్నార్థకం!
మే 3న వ్యాప్కోస్ సీఎండీ రాజిందర్ కుమార్ గుప్తాపై ఆదాయానికి మించిన ఆస్తులపై సీబీఐ19 చోట్ల సోదాలు జరిపింది. రూ. 38 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. భారీ ఎత్తున ఆభరణాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. వాటి విలువను లెక్కిస్తున్నారు. ఇంకా బ్యాంకు లాకర్లలో దాచినవి వెల్లడి కాలేదు. రాజిందర్ ఆదాయంతో పోలిస్తే ఆస్తులు అధికంగా ఉన్నాయి. సీఎండీగా ఉన్న సమయంలోనే భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులన్నింటికీ రాజిందర్ హయాంలోనే అనుమతులిచ్చారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యాప్కోస్ లో దశాబ్ద కాలం పాటు సీఎండీగా పనిచేశారు. వ్యాప్కోస్ డీపీఆర్ కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు పుష్కలంగా నీటి వసతి ఉందని పేర్కొన్న వ్యాప్కోస్. తెలంగాణ ఏర్పాటు తర్వాత భారీ అవినీతి సొమ్ముకు అలవాటుపడి నీటి లభ్యత లేదని చెప్పింది. కాళేశ్వరం బడ్జెట్‌ను పెంచి వేల కోట్లు కొల్లగొట్టడం కోసం ఆ తప్పుడు డీపీఆర్లు ఇచ్చారు. నీటి ప్రాజెక్టుల పేర ప్రభుత్వాలు ప్రజా ఖజానాను దోచి, లక్షల కోట్ల అప్పులు ప్రజలకు మిగిలిస్తే.
తప్పుడు డీపీఆర్లు అందుకు ఊతమిచ్చాయి.
తెలంగాణ సర్కారు మహారాష్ట్రతో 148 మీటర్ల ఒప్పందం చేసుకుని తుమ్మిడిహెట్టి రద్దుచేసి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఎంత సరిదిద్దరాని తప్పు చేసిందో, ప్రాణహిత ఉపనది వార్ధాపై బ్యారేజీ నిర్మిస్తామనే ప్రతిపాదన అంతే తీవ్రమైన తప్పు. గోదావరి వరదలకు పంపుల విధ్వంసంతో, కాళేశ్వరం భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో సుస్థిరంగా తూర్పు ఆదిలాబాద్ జిల్లాల్లో కొంత భాగానికి, తెలంగాణకు కాళేశ్వరం కంటే మరింత చౌకగా నీరందించేది తుమ్మిడిహెట్టి మాత్రమే. తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా వార్ధా ఉపనదిపై బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదన తెంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు. ‘మేము తలపెట్టిన ప్రాజెక్టు కాదు కదా, అక్కడ నిర్మిస్తే పేరు మాకు రాదు కదా’ అని, ప్రాణహిత నది అపార గ్రావిటీ నీటి లభ్యతా ప్రయోజనాలను గాలికి వదలడం రాష్ట్ర భవిష్యత్తును బలిపెట్టే నేరపూరిత చర్య. వార్ధా బ్యారేజీ రూపకల్పనే ఒక వంచన.
- నైనాల గోవర్ధన్ తెలంగాణ జల సాధన సమితి