మేడిగడ్డ ఈఈ, ఎస్ఈపై సర్కారు చర్యలు!

మేడిగడ్డ ఈఈ, ఎస్ఈపై సర్కారు చర్యలు!
  • వారి సర్వీస్​ వివరాలు ఇవ్వాలని ఇరిగేషన్​ ఉన్నతాధికారులకు మెమో
  • బ్యారేజీ పూర్తవకముందే సీసీ ఇవ్వడంపై క్రమశిక్షణ చర్యలకు కసరత్తు
  • సర్వీస్ ​రికార్డులను రేపటి వరకు  ఇవ్వనున్న ఉన్నతాధికారులు

హైదరాబాద్​, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీకి సంబంధించి అధికారులపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. పనులు పూర్తికాకముందే పూర్తయినట్టు సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు ఓ అడుగు ముందుకు వేసింది. కంప్లీషన్​సర్టిఫికెట్ (సీసీ)​ను జారీ చేసిన మేడిగడ్డ ఈఈ (ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​), ఆ సర్టిఫికెట్​పై సంతకం చేసిన ఎస్ఈ (సూపరింటెండెంట్​ఇంజినీర్) పై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే వారి సర్వీస్​ రికార్డులను సమర్పించాల్సిందిగా ఇరిగేషన్​శాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. వారు సీసీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? లాంటి  వివరాలను ఇవ్వాల్సిందిగా  మెమో ఇచ్చినట్టు సమాచారం.

‘‘సీసీ ఇచ్చే నాటికి.. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన రేడియల్ గేట్ల పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా అప్పటి మహదేవ్​పూర్​ఈఈ, రామగుండం ఎస్ఈలు సీసీ​ ఇచ్చారు’’ అని ఆ మెమోలో ప్రభుత్వం వెల్లడించింది. దీనిని అర్జెంట్​గా పరిగణించి సీసీ ఇచ్చిన బాధ్యులైన ఎస్ఈ, ఈఈల పూర్తి వివరాలను వెంటనే పంపించాలని ఆదేశించింది. ఉన్నతాధికారులు ఆయా అధికారుల సర్వీస్​ రికార్డులను పరిశీలించి, ప్రభుత్వానికి పంపించనున్నారు. 

కంప్లీషన్ సర్టిఫికెట్ ​రద్దు

మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ఇచ్చిన కంప్లీషన్​ సర్టిఫికెట్​ను ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసింది. అందుకు సంబంధించి నిర్మాణ సంస్థ ఎల్​అండ్​టీకి ఇరిగేషన్​డిపార్ట్​మెంట్ ​నోటీసులు కూడా పంపించినట్టు తెలిసింది. బ్యారేజీ కంప్లీట్​అయినట్టు ఇచ్చిన సర్టిఫికెట్​ను రిటర్న్​ చేయాల్సిందిగా సంస్థ ప్రతినిధులకు నోటీసుల ద్వారా తెలియజేసినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. దాంతోపాటు బ్యారేజీ వద్ద ఉన్న పెండింగ్​పనులను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారని సమాచారం.

బ్యారేజీ వద్ద పెండింగ్​లో ఉన్న పనుల విలువ దాదాపు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, పనులు పూర్తికాకముందే కంప్లీషన్ ​సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా అధికారులకు నిర్మాణ సంస్థ ఎల్​అండ్​టీ 3 సార్లు లేఖలు రాసింది. 2019 జూన్​ 21న అప్పటి సీఎం కేసీఆర్​ బ్యారేజీని ప్రారంభించగా.. అదే ఏడాది ఆగస్టు 6న సీసీ​ ఇవ్వాలంటూ అప్పటి ఈఈకి నిర్మాణ సంస్థ లేఖ రాసింది. అయితే, డ్యామేజ్​లున్నాయని, వాటి రిపేర్లు పూర్తి చేయాలని సంబంధిత సంస్థకు అధికారులు 2020లో లేఖ రాశారు. అయితే, ఆ పనులను చేపట్టకుండానే.. మిగిలిపోయిన పనులు చేయకుండానే మరోసారి 2020 అక్టోబర్​12న   బ్యారేజీ అధికారులకు ఎల్​అండ్​టీ లేఖ రాసింది. డ్యామేజీలు బాగు చేయాలని, మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరుతూ నిర్మాణ సంస్థకు నాటి ఈఈ 2021 ఫిబ్రవరి 17న లేఖ రాశారు. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా 2021 మార్చి 10న సర్టిఫికెట్​ ఇవ్వాలంటూ అధికారులకు మూడోసారి ఎల్ అండ్​టీ లేఖ రాసింది.

నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం?

నిర్మాణ సంస్థ రెండోసారి రాసిన లేఖలో బ్యారేజీకి దిగువన డ్యామేజీలున్నాయని, వాటికి రిపేర్లు చేయాల్సి ఉందని పేర్కొన్నట్టు తెలిసింది. కంప్లీషన్​సర్టిఫికెట్​ ఇచ్చే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్​టేకింగ్​ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ, అండర్​టేకింగ్​ లేకుండానే.. మూడోసారి లేఖ రాసిన వెంటనే ఆదరాబాదరాగా నిర్మాణ సంస్థకు అధికారులు కంప్లీషన్​సర్టిఫికెట్​ ఇచ్చారు. 2021 మార్చి 15న నాటి మేడిగడ్డ ఈఈ కంప్లీషన్​ సర్టిఫికెట్​ను జారీ చేశారు. దానిపై అప్పటి ఎస్ఈ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ లేఖ రాసిన ఐదు రోజుల్లోనే సీసీ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే నిర్మాణ సంస్థకు వేగంగా కంప్లీషన్​ సర్టిఫికెట్​ను జారీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.