పంచాయతీల్లో బీసీలకు 42% సీట్లు ? అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే చాన్స్ !

పంచాయతీల్లో బీసీలకు 42% సీట్లు ? అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే చాన్స్ !
  • వచ్చే నెలలో ఎలక్షన్స్!
  • ఫిబ్రవరి 2 నాటికి సబ్ కమిటీకి కులగణన రిపోర్టు
  • ఆ వెంటనే క్యాబినెట్కు నివేదిక
  • అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే చాన్స్
  • ముమ్మరంగా కసరత్తు చేస్తున్న సర్కారు

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలకు సర్కారు కసర్తత్తును ముమ్మరం చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు  నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయితే కులగణనకు సంబంధించిన నివేదిక ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. ఈ లెక్కన బీసీలకు 42 శాతం సీట్లు రిజర్వ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. సమగ్ర కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ  నిర్వహించిన సమగ్ర కులగణన సర్వే ప్రశంసలందుకుందని సీఎం చెప్పారు. సర్వేను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు.

సర్వేకు సంబంధించిన ముసాయిదా నివేదిక సిద్ధమైందని, ఫిబ్రవరి 2వ తేదీ నాటికి కేబినెట్ సబ్ కమిటీకి సమర్పిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సమావేశానికి రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఫిబ్రవరిలో ఎన్నికలు
ఫిబ్రవరి 2 తరువాత ఇప్పటికే పంచాయితీల్లో గతేడాది 2024, ఫిబ్రవరి1న సర్పంచ్ పదవీకాలం ముగియగా.. ప్రత్యేక అధికార పాలన వచ్చింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 15 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఓటర్ల జాబితాలను  సైతం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయి. దీంతో పల్లెలకు కేంద్రం నుంచి గ్రాంట్లు రావడం లేదు. త్వరగా ఎలక్షన్లు నిర్వహిస్తే కేంద్రం నిధులు వస్తాయి.

ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్టు అందితే.. ఆ నివేదికపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై దానిని ఆమోదిస్తుంది. తర్వాత బీసీ  గణన కు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు న్యాయనిపుణులతో రివ్యూ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రకియను ఫిబ్రవరి రెండో వారంలోగా నిర్వహించాలని నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.