గుడ్ న్యూస్: పేద, మధ్య తరగతి ప్రజలకు అగ్గువకే ఫ్లాట్స్..

గుడ్ న్యూస్: పేద, మధ్య తరగతి  ప్రజలకు  అగ్గువకే ఫ్లాట్స్..
  • త్వరలో హౌసింగ్ పాలసీ ఖరారు చేయనున్న ప్రభుత్వం
  • హౌసింగ్ బోర్డు, దిల్ భూముల్లో  ఎల్ఐజీ, ఎంఐజీ కాలనీలు
  • ఈ రెండు సంస్థలకు స్టేట్ వైడ్​గా 1,600 ఎకరాలు
  • పాలసీ ప్రపోజల్స్‌‌కు టెండర్లు పిలిచిన హౌసింగ్ బోర్డు
  • 3 నెలల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్న కన్సల్టెన్సీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి, అల్పాదాయ వర్గాల ప్రజలకు తక్కువ ధరలకు అపార్ట్​మెంట్​ఫ్లాట్స్​ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఎల్ఐజీ ( లో ఇన్ కమ్ గ్రూప్ ), ఎంఐజీ (మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ ) కాలనీల రూపంలో అపార్ట్​మెంట్లు నిర్మించేందుకు ప్లాన్​ రూపొందిస్తున్నది. ప్రస్తుతం హై ఇన్ కమ్ గ్రూప్ ప్రజలకు హైదరాబాద్ తోపాటు అన్ని అర్బన్ ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ ఇండ్లు, విల్లాలు అందుబాటులో ఉన్నాయి. 

హైదరాబాద్ లో ఏ ఏరియాలో అయినా వెయ్యి ఎస్ఎఫ్ టీ అపార్ట్ మెంట్ ఫ్లాట్  రూ. 50 లక్షలకు పైనే ఉండగా, ట్రిపుల్​ బెడ్ రూమ్ ఫ్లాట్ రూ. 80 లక్షలకు తక్కువ లేదు.  పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఇండ్లు ఉంచాలని హైదరాబాద్ లో జరుగుతున్న ప్రాపర్టీ షోల్లో పబ్లిక్ తో పాటు మంత్రులు సైతం వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల  కొన్ని  ప్రముఖ కంపెనీలు సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్లతో అపార్ట్ మెంట్లను నిర్మిస్తున్నాయి. 

వందల ఎకరాల్లో భూములు

హౌసింగ్ బోర్డుకు,  దానికి అనుబంధంగా ఉన్న దిల్ (దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్)కు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వందల ఎకరాల్లో విలువైన భూములు ఉన్నాయి.  హౌసింగ్ బోర్డుకు 703 ఎకరాలు ఉండగా, దిల్​కు 900 ఎకరాలు  ఉన్నాయి. హౌసింగ్‌‌‌‌ బోర్డు భూములు కబ్జాలు కాకుండా నిరుడు నుంచి ప్రభుత్వం ప్రహరీ, ఫెన్సింగ్​ను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పుడు ఈ భూముల్లో  పేద, మధ్య తరగతి ప్రజలకు ఎల్ఐజీ, ఎంఐజీ కాలనీల పేరుతో అపార్ట్​మెంట్లు నిర్మించాలని ప్లాన్​ చేస్తున్నది.

ఉమ్మడి రాష్ట్రంలో ఈ కాలనీల్లో  55 వేల ఇండ్లను హౌసింగ్ బోర్డు నిర్మించింది. ఈసారి కూడా ఈ భూముల్లో కాంట్రాక్టర్లను ఇన్వైట్ చేసి.. టెండర్లు పిలిచి పేద, మధ్య తరగతి ప్రజలకోసం అపార్ట్​మెంట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. 550 ఎస్ ఎఫ్ టీ విస్తీర్ణంలో సింగిల్ బెడ్ రూమ్, 850 నుంచి 950 ఎస్ ఎఫ్ టీ ల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించేందుకు సిద్ధమవుతున్నది. వీటిని పేద, మధ్యతరగతి ప్రజలకు బహిరంగ మార్కెట్​లో ఉన్న ధరల కంటే తక్కువకు ఇవ్వాలని అనుకుంటున్నది. భూములు అందుబాటులో ఉండడంతో కేవలం అపార్ట్ మెంట్ల నిర్మాణానికి మాత్రమే నిధులు అవసరం కానున్నాయి.  

హౌసింగ్ పాలసీపై ప్రభుత్వం కసరత్తు

రాష్ట్రంలో అందుబాటు ధరల్లో ప్రజలకు ఇండ్లు అందిచేందుకు ప్రభుత్వం హౌసింగ్ పాలసీని తీసుకు రానున్నది. ఇందుకోసం సలహాలు, సూచనలు అందించేందుకు కన్సల్టెన్సీల ఎంపికకు ఇటీవల హౌసింగ్ బోర్డు టెండర్లను ఆహ్వానించింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ టెండర్లను అధికారులు ఓపెన్ చేయను న్నారు. ఈ అంశంపై ఇటీవల ప్రీ బిడ్​ను హౌసింగ్ బోర్డు నిర్వహించగా.. 3 కంపెనీలు అటెండ్ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. 

వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు ఓపెన్ చేసి.. కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. టెండర్ దక్కించుకున్న కన్సల్టెన్సీ.. 3 నెలల్లోగా బోర్డుకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కన్సల్టెన్సీలు ప్రస్తుతం మార్కెట్​లో అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ ఇండ్లు, హైదరాబాద్ తోపాటు ఇతర సిటీల్లో ఉన్న ఒక్క ఎస్ఎఫ్​టీ  ధర, సింగిల్, డబుల్, ట్రిపుల్​ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ ధరలు, ఇండ్ల అమ్మకాలు, కొనుగోళ్లు, ఖాళీగా ఉన్న ఇండ్లపై వివిధ కన్సల్టెన్సీలు ఇస్తున్న రిపోర్ట్ లను పరిశీ లించనున్నాయి. అనంతరం ఇచ్చే రిపోర్ట్ ప్రకారం హౌసింగ్ పాలసీని సర్కార్ ఖరారు చేయనున్నది.