ఈ చట్టం అమలులోకి వస్తే ల్యాండ్‌‌ డీలింగ్స్‌‌ తేలిక

ఈ చట్టం అమలులోకి వస్తే ల్యాండ్‌‌ డీలింగ్స్‌‌ తేలిక

ఒకప్పుడు భూమి జీవితాలకు భద్రత నిచ్చేది. ప్రజల సంస్కృతీ, విశ్వాసాలకు ఆధారంగా ఉండేది. క్రమంగా భూమి అమ్మకపు సరుకయ్యింది. డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో భూమి చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నాయి. తెలంగాణలో దాదాపు 75 శాతం భూములు ఏదో ఒక వివాదంతో ముడిపడి ఉన్నట్లుగా‘ల్యాండేసా’ అనే స్వచ్చం ద సంస్థ గుర్తించింది. దీనికి శాశ్వత పరిష్కారంగా మరే రాష్ట్రంలో లేని విధంగా ‘కంక్లూజివ్‌ టైటిల్‌‌ యాక్ట్’ తీసుకువస్తామని రాష్ట ప్రభుత్వం చెబుతోంది.ఈ యాక్ట్‌‌ వస్తే రెవెన్యూ వ్యవస్థ నుంచి ల్యాండ్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ పూర్తిగా దూరం కానుంది.

తెలంగాణలో భూమి ఒకరిదైతే… పట్టా మరొకరి పేరిట ఉంటుంది. ఒకరికి నిజంగానే భూమి సంక్రమించినా.. కాస్తులో మరొకరుంటారు. సర్వే నంబర్‌‌లో, భూమి విస్తీర్ణం లో, యజమాని  పేరులో తప్పులుంటాయి. తరాలు గడిచినా వారసుల పేరు మారదు. ప్రతాప రుద్రుడి తర్వాత వంద ఏళ్లకు మహాకవి పోతన బమ్మెరలో పుట్టాడు. బమ్మెర గ్రామంలో లక్కమాంబ వాగు పక్కన ఉన్న భూమి నేటికీ రెవెన్యూ రికార్డుల్లో పోతన పేరు మీదనే ఉంది. దానిని ఆ ఊరి వారు ఇప్పటికీ ‘పోతన్న మడి’ అనే అంటున్నారు. లక్కమాంబ పోతన భార్య. ఇలా తరాలు మారినా రెవెన్యూ రికార్డులు మారని వైనాలు ఎన్నోఉన్నాయి.

‘తెలంగాణలో దాదాపు 75 శాతం భూములు ఏదో ఒక వివాదంతో ముడిపడి ఉన్నాయి ’ అని ‘ల్యాండేసా’ సారథి, భూ చట్టాల నిపుణుడు, ప్రొఫెసర్‌‌ ఎం.సునీల్‌‌కుమార్‌‌ అంటున్నారు. ల్యాండ్‌ యాక్ట్‌‌లపై విశేష కృషి చేసిన ప్రొఫెసర్‌‌ సునీల్‌‌ కుమార్‌‌… ఐఏఎస్‌‌లు మొదలుకుని అన్ని స్థాయి ల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ‘భూ చట్టాలన్నీ కలిపి సింగిల్‌‌ రెవెన్యూ కోడ్‌ తేవాలి. ఇలా యూపీలో ఉంది’అని సునీల్ సూచిస్తున్నారు.

వివాదాల్లో 18 లక్షల ఎకరాలు

రాష్ట్రంలో దాదాపు 18 లక్షల ఎకరాల భూములు వివాదాల్లో ఉన్నట్లు అంచనా. ఏ భూమికీ సరిహద్దులు సరిగా లేవని నిపుణులు చెబుతున్నారు.ఈ సమస్య పరిష్కారానికి భూముల సమగ్ర సర్వే ఒక్కటే మార్గం. ఈ సర్వేకు రూ.500 కోట్లదాకా ఖర్చవుతుం దంటూ తెలంగాణ సర్కారు అప్పట్లో అంచనాలు వేసి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అయితే కేంద్రం దీన్ని రూ.256.02 కోట్లకు కుదించి మొదటి విడతగా రూ.83 కోట్లు విడుదల చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోని భూములన్నింటి సర్వేని 24 నెలల్లో చేసి, రికార్డులను పక్కాగా సిద్ధం చేస్తామని రెండున్నరేళ్ల క్రితం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వానికి నివేదించారు. ఆపైన భూముల రికార్డుల నవీకరణ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 90 శాతం రికార్డులు పక్కాగా ఉన్నాయని ప్రకటించింది. రాష్ట్రంలోని 8 వేల రెవెన్యూ గ్రామాల రికార్డులను డిజిటైజేషన్‌ చేసినట్లు వెల్లడించింది. రీ-సర్వే కూడా జరుగుతుందని ప్రకటించారు కానీ, ఆ పని సరిగా జరగలేదు.

ల్యాండ్‌ రికార్డుల నవీకరణలో 17.89 లక్షల ఎకరాల భూములను వివాదాస్పద జాబితాలో యంత్రాంగం చేర్చింది. వీటిలో 2.18 లక్షల ఎకరాల అటవీ సరిహద్దు వివాదాలున్నాయి . కుటుంబ పంపకాలు, సరిహద్దు వివాదాలు ఉన్న భూములు, లెక్కలేనన్ని ఉన్నాయి . 2.38 కోట్ల ఎకరాల రికార్డులను రెవెన్యూ యంత్రాంగం పరిశీలించి , వాటిలో 2.26 కోట్ల ఎకరాలు వివాదాల్లేనివని, అందులో 1.53 కోట్లఎకరాల వ్యవసాయ భూములకు ఏ సమస్యలు లేవని గుర్తిం చింది. వీటిలో 1.44 కోట్ల ఎకరాల భూ రికార్డులపై రెవెన్యూ యంత్రాంగం డిజిటల్‌‌ సంతకాలు చేసిందని అంటున్నారు. ఎన్నికల తర్వాత అటవీ,పోడు భూములపైన కూడా స్పష్టత ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ధరణి ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఆ తర్వాత, ధరణి వెబ్‌ సైట్‌‌లో ఉన్న భూములన్నింటికీ తామే పూచీ ఇచ్చి , భూమికి ఇన్స్యూరెన్స్‌ కల్పిస్తామని ప్రకటిం చింది. తాజాగా భూములకు సంబంధించి ‘కంక్లూజివ్‌ టైటిల్‌‌ యాక్ట్‌‌(సంపూర్ణ యాజమాన్య హక్కుల చట్టం )ను సిద్ధం చేసినట్లు సర్కారు చెబుతోంది. మరే రాష్ట్రంలో లేని విధంగా కంక్లూజివ్‌ టైటిల్‌‌ యాక్ట్ తేవడం ద్వారా రాష్ట్ర స్థాయి లో రైతులు లభ్ది పొందనున్నా రని ప్రభుత్వం అంటున్నది. రష్యా, సింగపూర్‌‌, ఆస్ట్రేలియా, కెనడా, డొమినికన్‌ రిపబ్లిక్‌‌,ఐర్లాండ్‌ , ఇజ్రాయెల్‌‌, న్యూజిలాండ్‌ , ఫిలిప్పీన్స్‌ , థాయ్‌ లాండ్‌తో పాటు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కంక్లూజివ్‌ టైటిల్‌‌ యాక్ట్‌‌ ఉంది.

ప్రైవేటుకి ల్యాండ్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌

కంక్లూజివ్‌ టైటిల్‌‌ యాక్ట్‌‌ ద్వారా రెవెన్యూ వ్యవస్థ నుంచి పూర్తిస్థాయిలో భూ పరిపాలనను దూరం చేయనున్నారు.  ఇందులో భాగంగా గ్రామ, మండల, డివిజన్‌ , జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కంక్లూజివ్‌ టైటిల్‌‌ యాక్ట్‌‌ అమలుకు ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఇండిపెండెంట్‌‌ ఏజెన్సీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏ రైతు అయినా ఇకపై భూముల క్రయవిక్రయాలు జరపాలంటే వాటినే సంప్రదించాల్సి ఉంటుంది. ఇప్పుడు భూమి సేల్‌‌ డీడ్‌ మాత్రమే రిజిస్టర్‌‌ చేసే పద్దతి ఉంది. ఇకపై టైటిల్‌‌నే రిజిస్ట్రేషన్‌ చేసి టైటిల్‌‌ డీడ్‌ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఎవరయినా భూస్వామి లేదా రైతు భూమిని కోల్పోయినట్లు ఆరోపణలు వస్తే… ఆ కేసు పై కొత్తగా ఏర్పడే సంస్థ ఇండిపెండెంట్‌‌ ఎంక్వయిరీ జరుపుతుం ది. రైతు వాదనలోన్యాయం ఉంటే పరిహారం ఇస్తారు.ఇందులో భాగంగా అప్పీల్‌‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద సర్టిఫికెట్ల వ్యవస్థను పూర్తిగా సంస్కరించనున్నారు. ఇలా యాజమాన్య ధ్రువీకరణ పత్రాల జారీకి కొత్త కొలమానాలు నిర్దేశిస్తారు.

ఈ పద్దతి అమలులోకి వస్తే తెలంగాణలో ఉన్న 33వేల మంది రెవెన్యూ శాఖ ఉద్యోగులపై పని భారం తగ్గుతుం ది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 264 సేవలలో, రెవెన్యూ శాఖ వారివి 7,0-80 రకాల సర్వీసులు ఉన్నాయి . వాటిలో భూమితో ముడిపడినవి 60 రకాలున్నాయి . రాబోయే రోజుల్లో ఇవన్నీ రెవెన్యూశాఖ నుంచి దూరం అవుతాయి . ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మకు కంక్లూజివ్‌ టైటిల్‌‌ యాక్ట్‌‌ని రూపొందించే పని అప్పగిం చారు. కంక్లూజివ్‌ టైటిల్‌‌ యాక్ట్‌‌పై గతంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రిజిస్ట్రేషన్లు) వి.కె.అగర్వాల్‌‌ కమిటీ కూడా ఒకనివేదిక ఇచ్చింది. ఈ యాక్ట్‌‌కి ప్రత్యామ్నాయంగా ల్యాండ్‌ ఇన్స్యూరెన్స్‌ అనే ఫార్ములాని అమలు చేస్తే మేలు జరుగుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ కూడా గతంలో రిపోర్ట్‌‌ ఇచ్చారు. వీటి అధ్యయనంతో పాటు కొత్త చట్టం రూపకల్పనకు రాజీవ్ శర్మ రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. ఈ చట్టం వస్తే రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దాదాపుగా మారిపోతుం ది. స్వతంత్ర సంస్థకు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌ పనిలను అప్పగిస్తారు.

దుర్గం రవీందర్