హైదరాబాద్‌లోభారత్ సమిట్.. హెచ్ఐసీసీలో రెండు రోజులు సదస్సు

హైదరాబాద్‌లోభారత్ సమిట్.. హెచ్ఐసీసీలో రెండు రోజులు సదస్సు
  • హాజరుకానున్న 25 దేశాల మంత్రులు, 15 పార్టీల అధ్యక్షులు 
  • పాల్గొననున్న ఖర్గే, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ 
  • రాష్ట్రానికి పెట్టుబడులకు వేదిక: డిప్యూటీ సీఎం భట్టి 
  • మంత్రి ఉత్తమ్‌తో కలిసి ఏర్పాట్ల పరిశీలన 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని హెచ్‌‌ ఐసీసీలో శుక్ర, శనివారాల్లో భారత్ సమిట్ జరగనుంది. ‘డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్’ థీమ్‌‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సు శుక్రవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లను గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమిట్‌‌లో భాగంగా మొదటి రోజు హైదరాబాద్ డిక్లరేషన్‌‌ను ఆమోదించడంతో పాటు ఒక తీర్మానం కూడా పాస్​చేయనున్నట్టు భట్టి తెలిపారు. డిక్లరేషన్‌‌లో ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ప్రత్యేక ప్రస్తావన చేయనున్నట్టు పేర్కొన్నారు. కాశ్మీర్‌‌‌‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సమిట్‌‌లో నిర్వహించాలనుకున్న సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసినట్టు వెల్లడించారు. ‘‘ఈ సమిట్‌‌లో 25 దేశాలకు చెందిన మంత్రులు, 15 రాజకీయ పార్టీల అధ్యక్షులు, పలువురు ఎంపీలు, సెనేటర్లు, నిపుణులు, పెట్టుబడిదారులు పాల్గొంటారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు హాజరవుతారు. రెండ్రోజుల వ్యవధిలో 8 సెషన్లు నిర్వహిస్తాం. ప్లీనరీ సెషన్, వాలిడిక్టరీ సెషన్‌‌లో డెలిగేట్స్ అందరూ తప్పనిసరిగా పాల్గొంటారు. కొన్ని క్లోజ్డ్ డోర్ సమావేశాలు కూడా జరుగుతాయి. ఇందులో సోషల్ మీడియా బెదిరింపులు, ఇతర సున్నితమైన అంశాలపై చర్చలు ఉంటాయి” అని వివరించారు. 

తెలంగాణ రైజింగ్‌‌ను వివరించేందుకు వేదిక.. 

తెలంగాణ రైజింగ్ కాన్సెప్ట్‌‌ను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు భారత్ సమిట్ ఒక వేదిక అవుతుందని భట్టి అన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి, మేధో నాయకత్వంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ సదస్సు కీలకమని చెప్పారు. రాష్ట్రంలో దేశవిదేశీ పెట్టుబడులను పెంచడం, రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడం, సాంకేతిక ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడం తదితర సదస్సులో భాగంగా ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలోని వనరులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు ప్రత్యేక స్లాట్ కేటాయించామని తెలిపారు. కాంగ్రెస్ అనుసరించే జెండర్, యూత్, న్యాయ సిద్ధాంతాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ సమిట్ నిర్వహిస్తున్నామన్నారు.

ఇదీ సమిట్ షెడ్యూల్.. 

సమిట్‌‌ మొదటి రోజు సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్​బాబు స్వాగతోపన్యాసాలు చేస్తారు. ప్లీనరీ సెషన్‌‌లో కాంగ్రెస్ చీఫ్‌‌ మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తారు. వివిధ ప్యానెల్స్‌‌లో జెండర్ ఈక్వాలిటీ అండ్​ఫెమినిస్ట్ ఫ్యూచర్, ఫ్యాక్ట్ వర్సెస్​ఫిక్షన్ కౌంటరింగ్ డిస్‌‌ఇన్ఫర్మేషన్, యూత్ అండ్​పాలిటిక్స్ ఆఫ్ టుమారో, షేపింగ్ న్యూ మల్టీల్యాటరలిజం అంశాలపై చర్చిస్తారు. ఇక శనివారం రెండో రోజు ఓవర్‌‌ కమింగ్ పోలరైజేషన్ విత్ ప్లూరలిజం–డైవర్సిటీ అండ్​రెస్పెక్ట్, యాక్సిలరేటింగ్ క్లైమేట్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ ఇన్ అన్‌‌సర్టెయిన్ టైమ్స్, పీస్ అండ్​జస్టిస్ ఇన్ ఎ మల్టీపోలార్ వరల్డ్ అంశాలపై చర్చిస్తారు. వాలిడిక్టరీ సెషన్‌‌లో ప్రియంకాగాంధీ, కేసీ వేణుగోపాల్, సుప్రియాసూలే, మనోజ్ ఝా, కనిమొళి తదితరులు పాల్గొంటారు.