ఇకపై మీ సేవా దాకా పోవాల్సిన అవసరం లేదు.. ఒక్క క్లిక్​తో మన ఫోన్​లోనే..

  • మొబైల్ యాప్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఇక ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందే అవకాశం
  • మాల్స్, మెట్రోస్టేషన్లు, ఎయిర్​పోర్టుల్లో కియోస్క్​ల ఏర్పాటు
  • ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే టీఫైబర్ నెట్ సేవలూ ప్రారంభం
  • పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లోని మూడు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ 
  • ప్రభుత్వంతో 4 సంస్థల ఒప్పందం.. రూ.7,592 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్, వెలుగు: మీ సేవ సర్వీసులను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. క్యాస్ట్, ఇన్​కమ్ సర్టిఫికెట్లు కావాలన్నా, బర్త్​ సర్టిఫికెట్ ​పొందాలన్నా, బిల్లులు కట్టాలన్నా.. ఇకపై మీ సేవా దాకా పోవాల్సిన అవసరం లేదు. ఒక్క క్లిక్​తో మన ఫోన్​లోనే ఆ పనులన్నీ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా ప్రజలు సులువుగా, సమర్థవంతంగా తమకు కావాల్సిన సేవలను పొందేందుకు ‘మీ సేవ యాప్’ను ప్రభుత్వం రూపొందించింది. 

ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్​లోని పార్క్​ హయత్​ హోటల్​లో ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మీ సేవ యాప్​ను ఆ​శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. అలాగే రాష్ట్రంలో టీఫైబర్​ఇంటర్నెట్​ సేవలనూ ప్రారంభించారు.

మీ సేవా యాప్​ద్వారా 150 వరకు సేవలను అందించనున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా మీ సేవా ద్వారా ప్రజలు తమకు కావాల్సిన సేవలను పొందేలా యాప్​ను డిజైన్​చేశారు. అంతేగాకుండా జనాల రద్దీ ఎక్కువగా ఉండే మాల్స్, ఎయిర్​పోర్టులు, మెట్రో స్టేషన్లు, ఇంటిగ్రేటెడ్​కలెక్టరేట్ల వద్ద మీసేవా కియోస్క్​లనూ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ యాప్​ ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం అప్లికేషన్లను పెట్టుకోవడం, పేమెంట్లు చేయడం, సర్టిఫికెట్ల ప్రింటౌట్లను తీసుకునేందుకు అవకాశం దొరకనుంది. కియోస్క్​ల వద్ద వాటిని వాడుకోని సమయంలో సంస్థలు ప్రకటనలు ఇవ్వడానికి వీలుగా అవకాశం కల్పించారు.

కియోస్క్​లను దూర ప్రాంతాలకు తరలించడం కూడా సులువుగా ఉంటుందని అధికారులు తెలిపారు. తద్వారా ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు అవకాశం దొరకనుంది. మీ సేవాలో కొత్తగా మరిన్ని సర్వీసులను చేర్చారు. గతంలో మీ సేవా సెంటర్ల వద్దకు నేరుగా వెళ్లి అప్లై చేసుకోవాల్సిన క్యాస్ట్, ఇన్​కమ్​వంటి 9 రకాల సర్టిఫికెట్లనూ యాప్​ ద్వారానే పొందవచ్చు. అంతేగాకుండా పిల్లలు దూరం పెట్టిన వృద్ధులకు అండగా ఉండేలా కూడా మీ సేవా యాప్​ ద్వారా సేవలను అందించనున్నారు. వ్యవసాయ రుణాల మాఫీ, బోనస్, ఇతర సమాచారాన్ని యాప్ ​ద్వారా తెలుసుకోవచ్చు.

తక్కువ ధరకే ఇంటర్నెట్..
తక్కువ ధరకే ఇంటింటికీ ఇంటర్నెట్​ను అందించే టీ ఫైబర్​ సర్వీసులను ప్రభుత్వం ప్రారంభించింది. పైలట్​ప్రాజెక్టుగా మూడు జిల్లాల్లోని మూడు గ్రామాల్లో 4 వేల ఇండ్లకు ఇంటర్నెట్​ అందించనుంది. దానితో పాటు కేబుల్​ టీవీ ప్రసారాలనూ అందించనుంది. పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్, సంగారెడ్డి జిల్లా సంఘంపేట, నారాయణపేట జిల్లా మద్దూరు గ్రామాల్లో టీ ఫైబర్​నెట్​ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అక్కడి ప్రజలతో ఆయన వర్చువల్​గా మాట్లాడారు. కాగా, ఈ గ్రామాల్లో వచ్చే స్పందన ఆధారంగా రాష్ట్రమంతటికీ టీఫైబర్ నెట్ సేవలను విస్తరించనున్నారు.

వ్యవసాయ వృద్ధికి అడెక్స్ డిజిటల్ ప్లాట్​ఫామ్: శ్రీధర్ బాబు  
నూతన ఆవిష్కరణలు, స్వయం సమృద్ధి, ప్రజా పాలనను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్​బాబు చెప్పారు. జాతీయ భద్రత, డ్రగ్స్​కట్టడి, వ్యవసాయ రంగాలకు సంబంధించి పలు ఒప్పందాలూ జరిగాయని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత వృద్ధి చేసేందుకు అగ్రికల్చర్​డేటా ఎక్స్ఛేంజ్ (అడెక్స్) అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులను తీసుకొచ్చేందుకు అడెక్స్​ ఉపయోగపడుతుందన్నారు. దీని ద్వారా వ్యవసాయ రుణాలు పొందేందుకు సులువు అవుతుందన్నారు. అంతేగాకుండా నేలలోని పోషకాల నిర్వహణ, చీడపీడల నివారణ, వ్యవసాయ రికార్డుల నిర్వహణ వంటి వాటిని చేయొచ్చని వివరించారు. ఇందులో భాగంగా అడెక్స్​తో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్​ అగ్రి క్రెడిట్​ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు హెచ్​డీఎఫ్​సీ రూ.లక్ష వరకు రుణాలను అందించనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘‘యువత డ్రగ్స్​, గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది.

ఇందులో భాగంగా ఐటీ డిపార్ట్​మెంట్, యాంటీ నార్కోటిక్స్​ బ్యూరో, యునైటెడ్​వి కేర్ సంస్థ కలిసి ‘మిత్ర’ అనే ఏఐ ఆధారిత వాట్సాప్​ టూల్​ను అభివృద్ధి చేశాయి. దీని ద్వారా విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను అంచనా వేయొచ్చు. ఆయా విషయాలపై తల్లిదండ్రులతో టీచర్లు మాట్లాడి డ్రగ్స్​/గంజాయి వినియోగాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది. హైదరాబాద్​లోని వెయ్యి స్కూళ్లలో ఈ ఇనిషియేటివ్​ను ప్రారంభిస్తున్నాం” అని వెల్లడించారు. 

జాతీయ భద్రత విషయంలో స్వయం సాధికారత సాధించేందుకు బిట్స్​ పిలానీ హైదరాబాద్.. సెంటర్​ఫర్​రీసెర్చ్​ఎక్సలెన్స్​(సీఆర్​ఈఎన్ఎస్)ను ఏర్పాటు చేయనుందని చెప్పారు. డీఆర్డీవో, ఇస్రో, డీఏఈ, పోలీస్, రక్షణ రంగ సంస్థలతో కలిసి ఆ సెంటర్​ పనిచేస్తుందని వివరించారు. జాతీయ భద్రత టెక్నాలజీకి సంబంధించి ఇన్నోవేషన్​, నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు టీవర్క్స్, సీఆర్​ఈఎన్​ఎస్​ కలిసి పనిచేస్తాయన్నారు. ప్రొటోటైప్స్​ను తయారు చేయడం దగ్గర్నుంచి మార్కెట్​లోకి వాటిని తీసుకెళ్లడం వరకు ఇవి తోడ్పాటునందిస్తాయన్నారు.