అంతరాలు లేని రేపటి కోసం..ఇంటిగ్రేటెడ్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌

అంతరాలు లేని రేపటి కోసం..ఇంటిగ్రేటెడ్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌

‘అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక' అన్నారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు.  భారతీయ విద్యా వ్యవస్థకు వేల సంవత్సరాల నేపథ్యముంది. నాటి గురుకులాల మొదలు.. నేటి నెక్స్ట్​ జెన్‌‌‌‌ స్కూళ్ల వరకు విద్యాలయాలు రూపాంతరం చెందాయి. బేసిక్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌ లో ఎలాంటి మార్పు లేదు.  విద్యతోనే  సామాజిక వికాసం అనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకునే సత్యం.  దేశంలోని  ప్రతి ఒక్కరికి  చదువు అందాలని, అది కొందరికే పరిమితం కావొద్దని భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్‌‌‌‌  బీఆర్‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌ విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చారు.  

యూపీఏ  ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చి దానికి మరింత ప్రాణం పోసింది.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసి అంతరాలు లేని రేపటి తెలంగాణ కోసం కొత్త విద్యా ప్రణాళికలు రూపొందించింది.  కొడంగల్‌‌‌‌,  మధిర  నియోజకవర్గాలతో  ఈ అక్షర సేద్యాన్ని మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా దాని ఫలాలు అందేలా పనిచేస్తోంది.  అరమరికలు,  అంతరాలు,  వైషమ్యాలు  లేని  రేపటి తెలంగాణ  తరం రూపుదిద్దుకోవడమే ఈ కొత్త విద్యా ప్రణాళిక ఆంతర్యం.  కులాలవారీ గురుకులాలతో భావితరాలకూ కుల వ్యవస్థను అందజేస్తున్న విధానం స్థానే ఇంటిగ్రేటెడ్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ తీసుకువస్తున్నారు. 

ఒకే ఆవరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌‌‌‌ గురుకులాలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌‌‌‌ గురుకులాలన్నీ ఒకే క్యాంపస్‌‌‌‌ లో నిర్వహించడం.. అన్ని కులాలు,  మతాలకు చెందినవారిని ఒకే కాంపౌండ్​లో చదువుకునేలా చేయడం ఈ వ్యవస్థలోని గొప్పతనం. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అంతరాలు లేని  రేపటి సమాజ స్థాపన కోసం  ముఖ్యమంత్రి  రేవంత్‌‌‌‌ రెడ్డి  ప్రభుత్వం కొడంగల్‌‌‌‌, మధిర నియోజకవర్గాలతో ఈ సరికొత్త ప్రయాణాన్ని ఆరంభిస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ నిర్మించనున్నారు. ఒకే ఆవరణలో ఎస్సీ,  ఎస్టీ,  బీసీ,  మైనార్టీ,   జనరల్‌‌‌‌  గురుకులాలు నిర్వహించేలా ఈ క్యాంపస్‌‌‌‌ నిర్మించనున్నారు. స్కూల్‌‌‌‌,  హాస్టల్స్​కు  వేర్వేరు  బిల్డింగ్స్‌‌‌‌ నిర్మించడమే కాదు.  విద్యార్థుల  వికాసానికి,  శారీరక దారుఢ్యానికి  దోహదపడేలా  ప్లే గ్రౌండ్‌‌‌‌,  పేరెంట్స్‌‌‌‌ తో  మీటింగ్‌‌‌‌ కోసం  ప్రత్యేకంగా హాల్‌‌‌‌ సహా ఇతర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత గురుకులాల్లో మాదిరిగా స్టూడెంట్స్‌‌‌‌ ఎక్కడో దూరంగా వెళ్లి  చదువు కోవడం కాకుండా సొంత మండలాల్లోనే వారికి అడ్మిషన్​లు దక్కేలా చూడాలని సీఎం స్పష్టమైన సూచనలు చేశారు.
 
ప్రపంచంతో  పోటీపడేలాతెలంగాణ బిడ్డలకు శిక్షణ

అరకొర సౌకర్యాలున్న భవనాల్లో వందలాది మందిని ఉంచి చదువు చెప్పిస్తున్నారు. అనేక గురుకులాలకు కనీసం ప్లే గ్రౌండ్‌‌‌‌ లేదు. బాలికల గురుకులాల్లో రెండు, మూడు వాష్‌‌‌‌ రూమ్‌‌‌‌ లే ఉన్నాయంటే పేదింటి బిడ్డలపై గత పాలకులకు ఉన్న చిత్తశుద్ధి  ఏపాటిదో  అర్థమవుతుంది.  మొదటి దశలో నియోజవకర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్‌‌‌‌  రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ నిర్మించి.. అందులోనే అన్ని కులాలు, మతాల వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తే  రేపటి సమాజంలో ఎలాంటి పొరపొచ్చాలు ఉండవన్నది ప్రజాప్రభుత్వ అభిమతం.

విద్య, సామాజికవేత్తల అభిప్రాయాల మేరకు..

కులాల వారీ గురుకులాలతో కుల వ్యవస్థ మోయడం తప్ప వికాసం దిశగా అడుగులు పడవని కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం గుర్తించింది.  మేధావులు,  విద్య, సామాజికవేత్తలు ఈమేరకు  వెలిబుచ్చిన అభిప్రాయాలను  పరిగణనలోకి తీసుకుంది. అందుకే  సార్వజనీన గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయబోతుంది. అన్ని కులాలు, మతాల్లోని అర్హులందరికీ రెసిడెన్షియల్‌‌‌‌ విధానంలో ఇంటర్నేషనల్​ ఫౌండేషన్​తో  విద్య అందించాలన్నదే  ప్రభుత్వ లక్ష్యం.  తద్వారా  ప్రపంచంతో  పోటీపడేలా తెలంగాణ బిడ్డలను సర్వోన్నతంగా తీర్చిదిద్దడం.. స్ఫూర్తివంతమైన రేపటి తరాన్ని తయారుచేయడం.. మేరా భారత్‌‌‌‌ మహాన్‌‌‌‌ అని సగర్వంగా చాటిచెప్పేలా విద్యార్థులను విద్యతో  సంస్కరించడం ఈ ఇంటిగ్రేటెడ్‌‌‌‌   రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం.

దేశంలో ప్రత్యేకత చాటేలా స్కూల్స్​

 ఇంటిగ్రేటెడ్‌‌‌‌  రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌  ఏ ఒక్కరి  బ్రెయిన్‌‌‌‌ చైల్డ్‌‌‌‌ గానో  ప్రచారం చేసుకోవడానికి   ప్రజా ప్రభుత్వం  ప్రాధాన్యత ఇవ్వడం లేదు.  విద్యావేత్తలు,  సామాజికవేత్తల అభిప్రాయాలు తీసుకొని అందరి సలహాలు, సూచనల మేరకే ఇంటిగ్రేటెడ్‌‌‌‌  రెసిడెన్షియల్‌‌‌‌  స్కూల్స్‌‌‌‌  ఏర్పాటులో  కాంగ్రెస్​ సర్కార్​ ముందడుగు వేస్తోంది.  రాష్ట్రంలోని  49 నియోజకవర్గాల్లో ఈ రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ నిర్మాణానికి  ప్రభుత్వ భూములను గుర్తించారు.  ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్‌‌‌‌ సోషల్‌‌‌‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌) కింద  నిధులు సేకరించి అన్నివర్గాల  భాగస్వామ్యంతో  ఈ విద్యాలయాలను  నెలకొల్పాలని సంకల్పించారు.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంటిగ్రేటెడ్‌‌‌‌  రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ ఒకే డిజైన్​లో నిర్మించబోతున్నారు.  తద్వారా  తెలంగాణ  ఇంటిగ్రేటెడ్‌‌‌‌  రెసిడెన్షియల్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌ అంటేనే దేశంలో ప్రత్యేకత చాటేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.   తెలంగాణ రాష్ట్రాన్ని పదేండ్ల పాటు పాలించిన  గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలోని నాయకులు  కులాల వారీగా  పెద్ద సంఖ్యలో  గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పుకున్నారు.  సమాజంలోని  అన్ని వర్గాల్లో ఉన్న  నిరుపేద,  పేద,  మధ్య తరగతి బిడ్డల కోసం గురుకులాల ఏర్పాటు ఆహ్వానించదగ్గదే.  తాము ఎక్కువ గురుకులాలు ఏర్పాటు చేశామని ప్రచారం చేసుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత.. ఆయా గురుకులాలకు సొంత భవనాలు నిర్మించడంలో చూపించలేదు.

- డా. వి. నరేందర్ రెడ్డి,
ప్రముఖ విద్యావేత్త