6,7 తరగతుల బాయ్స్​కు ప్యాంట్లు..నిక్కర్ల నిర్ణయంపై వెనక్కి తగ్గిన సర్కార్ 

6,7 తరగతుల బాయ్స్​కు ప్యాంట్లు..నిక్కర్ల నిర్ణయంపై వెనక్కి తగ్గిన సర్కార్ 
  • ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లలో చదివే ఆరు, ఏడో తరగతుల స్టూడెంట్లకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి యూనిఫామ్ లో ఇచ్చే నిక్కర్ల స్థానంలో ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. దీనికి అనుగుణంగా క్లాత్​ను సరఫరా చేయాలని టీజీఎస్​సీఓ ఎండీకి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫస్ట్ క్లాస్​ నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి ఏటా రెండు యూనిఫామ్స్ అందిస్తున్నది.

వచ్చే విద్యాసంవత్సరం 2025–26లో 19,91,986 మంది విద్యార్థులకు యూనిఫామ్స్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. వీరికోసం 85.31 లక్షల మీటర్ల క్లాత్ కు ఆర్డర్ కూడా ఇచ్చేశారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకూ చదివే బాయ్స్ కు నిక్కర్లు సరఫరా చేయాలని, ఆ పై క్లాసులకు ప్యాంట్లు ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు.

దీనిపై పేరెంట్స్, టీచర్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆరు, ఏడు తరగతలు పిల్లలకు నిక్కర్లకు బదులుగా ప్యాంట్లు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 8న ‘‘ఏడో తరగతి దాకా నిక్కర్లే” హెడ్డింగ్ తో ‘వెలుగు’ లో కథనం కూడా ప్రచురితమైంది. మరోపక్క పేరెంట్స్, టీచర్ యూనియన్ల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం నిక్కర్ల స్థానంలో ప్యాంట్లు అందించాలని నిర్ణయించింది.