
- రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల సాయం
- అదనంగా బ్యాంకు లోన్సదుపాయం కూడా..
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు లబ్ధి
- ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకుఆన్లైన్లో దరఖాస్తులు
- ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ల పరిశీలన.. జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ
- వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- పదేండ్లు యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో కొత్త స్కీమ్ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీం కింద రూ. 3 లక్షల వరకు సాయం చేస్తామని వెల్లడించింది. 5 లక్షల మందికి రూ. 6 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే పథకాన్ని అమలుచేస్తామని చెప్పారు. కాగా, ఆయా కార్పొరేషన్లు ఈ నెల 15న పూర్తి వివరాలతో స్కీమ్‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తాయి. అదే రోజు నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు తీసుకుంటారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్లు పరిశీలించి, లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న మంజూరు పత్రాలు అందజేస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ లిస్ట్‌ను ప్రకటిస్తుంది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తగిన గైడ్‌లైన్స్‌ను అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తే.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మిగతా మొత్తానికి బ్యాంకు లోన్ సదుపాయం
రాజీవ్ యువ వికాసం పథకానికి బ్యాంకు లింకేజీ పెట్టారు. స్కీమ్‌లో ఏయే యూనిట్లు ఉండాలో నిర్ణయించేందుకు ఆఫీసర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆయా యూనిట్ల వారీగా రేటు ఫిక్స్ చేస్తారు. ఉదా: ఒక యూనిట్‌కాస్ట్ రూ. 7 లక్షలు అవుతుందనుకుంటే.. అందులో రూ.3 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. మిగతా మొత్తాన్ని లబ్ధిదారు భరించడమా లేదంటే బ్యాంకు నుంచి లోన్ రూపంలో తీసుకోవడమో చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాజీవ్ యువ వికాసం పథకంపై బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో బీసీ కార్పొరేషన్‌తోపాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు రూ.2,500 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాల కోసం రూ.2,136 కోట్లు, ట్రైకార్‌లో స్వయం ఉపాధి పథకాల కోసం రూ.657.96 కోట్లు కేటాయించారు. మైనార్టీ కార్పొరేషన్‌కు కూడా రూ. వెయ్యి కోట్ల వరకు ఇచ్చారు. ఈ నిధులన్నీ రాజీవ్‌యువ వికాసం పథకానికి వినియోగించనున్నారు. కాగా, ఇప్పటికే ఆయా కార్పొరేషన్లు స్కీమ్‌కు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేసి ప్రభుత్వానికి పంపాయి.
నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తాం: భట్టి
నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకే ‘రాజీవ్ యువ వికాసం’ పథకం తీసుకువస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. స్కీమ్ వివరాలను హైదరాబాద్ కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో మంగళవారం మీడియాకు ఆయన వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 5 లక్షల మంది నిరుద్యోగ యువతీయువకులకు రూ. 6 వేల కోట్లు ఇస్తామన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఒక్కో యూనిట్‌కు రూ. 3 లక్షలు ఇస్తామని, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లింకేజీ ద్వారా అందిస్తామని చెప్పారు. ఈ స్కీమ్‌కు ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. సామాజిక స్పృహ కలిగిన తమ ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువత స్వయం ఉపాధికి కట్టుబడి ఉందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో యువత వికాసం గురించి ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. కానీ, యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి, వారి అభ్యున్నతికి దోహదపడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని భట్టి తెలిపారు.
చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రూ.540 కోట్లు
వీరవనిత చాకలి ఐలమ్మ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం రూ. 540 కోట్లు కేటాయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి అద్భుతమైన నిర్మాణాలు చేపడ్తామని, ఇందుకోసం ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందన్నారు. యూనివర్సిటీలో ఉన్న హెరిటేజ్ భవనాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం మూసీ రివర్ ను ఆనుకొని ఉందని, మూసీ పునరుజ్జీవం తర్వాత దానిని తిరిగి తెరిపిస్తామని చెప్పారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు రూ. 15.5 కోట్లు, నూతన భవన నిర్మాణాలకు 100 కోట్లు తక్షణమే విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హెరిటేజ్ భవనాలు, పునరుద్ధరణ ప్రణాళికలను అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం పరిశీలించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణా రావు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీశ్, చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వీసీ సూర్య ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
యువతకు అండగా నిలుస్తం
నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకే ‘రాజీవ్ యువ వికాసం’ పథకం తీసుకువస్తున్నాం. సామాజిక స్పృహ కలిగిన తమ ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువత స్వయం ఉపాధికి కట్టుబడి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో యువత వికాసం గురించి ఏనాడూ పట్టించుకోలేదు.. కానీ, యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి, వారి అభ్యున్నతికి దోహదపడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క