
మఠంపల్లి, వెలుగు: రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి గురువారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పపూజలు చేశారు. అనంతరం స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతీ హామీని అమలుచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీని మట్టపల్లిలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం స్థల ఎంపికకు చర్యలు తీసుకున్నామని, అన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. మంత్రి వెంట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ ఉన్నారు.