- 2023-24లో కనీసం 20 రోజుల ఉపాధిహామీ పనిచేసి ఉండాలి
- నోడల్ ఆఫీసర్‌గా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి
- కలెక్టర్ పర్యవేక్షణలో 26 నుంచి అమలు
- మార్గదర్శకాలు జారీ
- భూమి లేని కూలీల కుటుంబాలకు వర్తింపు
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ కూలిపని మీదనే ఆధారపడి.. జీవనం సాగిస్తున్న భూమి లేని కుటుంబాలకు భరోసా కల్పించడానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 26 నుంచి ఈ స్కీమ్‌ను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఏడాదికి రెండు విడతల్లో ఇవ్వనుంది. ఈ మేరకు ఈ పథకం అమలుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
కనీసం 20 రోజులు పని చేసిన వారే అర్హులు..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులైన వ్యవసాయ కూలీలను గుర్తించే బాధ్యతను పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు ప్రభుత్వం అప్పగించింది. సాగుభూమి లేకుండా, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయనున్నారు. గత 2023-–24లో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసిన వారిని ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తారు. వ్యవసాయ భూమి లేకుండా ఉండాలనే నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ద్వారా వ్యవసాయ కూలీల కుటుంబాన్ని యూనిట్‌గా గుర్తిస్తారు. వ్యవసాయ పట్టా భూమి ఉన్న రైతుల కుటుంబాలకు ఈ పథకం వర్తించదు. కుటుంబంలో ఎవరికి వ్యవసాయ భూమి ఉన్నా ఈ పథకానికి అనర్హులుగా పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ తాజాగా ప్రకటించిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
రెండు విడుతల్లో రూ.12వేల నిధులు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఒక్కో వ్యవసాయ కూలీ కుటుంబానికి రెండు విడతలుగా, ఒక్కో విడతకి రూ.6 వేల చొప్పున సంవత్సరానికి రూ.12 వేల ఆర్ధిక సహాయం అందిస్తారు. డెరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్(డీబీటీ) పద్ధతిలో నిధులు వ్యవసాయ కూలీ కుటుంబ యజమాని ఖాతాకు జమ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో కమిషనర్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నోడల్ ఆఫీషర్గా, ఈ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా వ్యవహరిస్తుంది. జిల్లాల్లో కలెక్టర్ పర్యవేక్షణలో, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.