జాయిన్​ కాకుంటే టర్మినేట్!.సెక్రటరీలకు ప్రభుత్వం హెచ్చరిక​

  • విధుల్లో చేరిన 15 మంది కార్యదర్శులు 
  • బ్లాక్​ డ్రెస్సుతో సెక్రటరీల ధర్నా

యాదాద్రి, వెలుగు:  విధుల్లో చేరకుంటే టర్మినేట్​ చేస్తామని జూనియర్​ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. దీంతో యాదాద్రి జిల్లాకు చెందిన కొందరు పంచాయతీ సెక్రటరీలు విధుల్లో చేరారు. నాలుగేండ్లు గడిచినందున తమను రెగ్యులరైజ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ జూనియర్​ పంచాయతీ సెక్రటరీలు(జేపీఎస్​), ఔట్ సోర్సింగ్​ పంచాయతీ సెక్రటరీ (ఓపీఎస్​)లు గత నెల 28 నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

యాదాద్రి జిల్లాలో 421 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 63 మంది రెగ్యులర్​ సెక్రటరీలు ఉన్నారు. మిగిలిన 358 మందిలో 305 మంది జేపీఎస్​లు, 53 మంది ఓపీఎస్​లు ఉన్నారు. వీరిలో ఇద్దరు మినహా మిగతా 356 మంది సమ్మెలోకి వెళ్లారు. సమ్మె విరమించాలని హయ్యర్​ ఆఫీసర్ల నుంచి ఒత్తిడి వచ్చినా సెక్రటరీలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ నెల 7న రాత్రి వరకు విధుల్లో చేరని వారిని టర్మినేట్​ చేస్తామంటూ ప్రిన్సిపల్​ సెక్రటరీ సందీప్​ కుమార్​ సుల్తానియా నుంచి ఇంటర్నల్​ ఆర్డర్స్ వచ్చాయి.

దీంతో యాదగిరిగుట్ట మండలానికి చెందిన 15 మంది సెక్రటరీలు తాము విధుల్లో చేరుతున్నట్టుగా డీఎస్​ఆర్​ (డైలీ శానిటైజేషన్​ రిపోర్ట్​) యాప్​లో ఎంటర్​ అయ్యారు. మిగిలిన వారు జాయిన్​ కాలేదు. ఇంటర్నల్​ ఆర్డర్స్​ ఇచ్చినా పూర్తి స్థాయిలో స్పందన రాకపోవడంతో ఈ నెల 9న సాయంత్రం 5లోగా విధుల్లో చేరకుంటే టర్మినెట్​ చేస్తామంటూ ప్రిన్సిపల్​ సెక్రటరీ సందీప్​ కుమార్​ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా పంచాయతీ సెక్రటరీలు విధుల్లో చేరాలని లేకుంటే టర్మినేట్​ చేస్తామని యాదాద్రి కలెక్టర్​ పమేలా సత్పతి ఎల్​ ఆర్​ నెంబర్​ 834/2023 ఎఫ్​ (పీటీఎస్​) రిలీజ్​ చేశారు. 

బ్లాక్​ డ్రెస్​తో నిరసన

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా జేపీఎస్​, ఓపీఎస్​లు సమ్మెలో పాల్గొన్నారు. మండలాల వారీగా సెక్రటరీలు యాదాద్రి కలెక్టరేట్​ వద్దకు చేరుకొని బ్లాక్​ డ్రెస్​తో నిరసన వ్యక్తం చేశారు. రెగ్యులరైజ్​ చేసే వరకూ ఆందోళన విరమించబోమని నినాదాలు చేశారు. 

నల్గొండలో... 

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో మొత్తం 642 మంది జేపీఎస్​లు, 82 మంది ఓపీఎస్​లు ఉన్నారు. కాగా సోమవారం చండూరు మండలంలో ఆరుగురు కార్యదర్శులు విధుల్లో చేరారు. కాగా మంగళవారం ఉదయం 10 గంటల వరకు అందరికీ నోటీస్ లు ఇవ్వాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ లో ఎంపీడీఓలను ఆదేశించారు.