
- రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదు
- కాంగ్రెస్‌ను విమర్శిస్తే ఊరుకోమని వార్నింగ్
వేములవాడ, వెలుగు : బీజేపీ, బీఆర్ఎస్ బంధం గల్లీలో లొల్లి.. ఢిల్లీలో దోస్తీ లా ఉందని రాష్ర్ట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం వేములవాడ టౌన్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. సిరిసిల్లలో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
రాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్ రాచరిక పాలనకు బీజేపీ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. కేంద్రంలోనూ గత 11 ఏండ్లుగా నియంతృత్వ పాలన కొనసాగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో రాచరిక పాలన అంతం చేసి ప్రజలు ప్రజాపాలనను తెచ్చుకున్నారనేది, బండి సంజయ్ గుర్తుంచుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం aచేస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్రం ఎక్కువ మొత్తంగా పన్నులు తీసుకొని రాష్ట్రానికి తక్కువ ఇస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సబర్మతి నది, గంగానదిని క్లీన్ చేసుకుంటారు కానీ.. మూసీని క్లీన్ చేస్తామంటే నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం 8 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అణా పైసా కూడా తేలేకపోయారని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తామని బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.