పెట్టుబడులకు నిలయం ఫ్యూచర్ సిటీ.. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు: రేవంత్ రెడ్డి

పెట్టుబడులకు నిలయం ఫ్యూచర్ సిటీ.. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు: రేవంత్ రెడ్డి
  • దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తది
  • నేను, డిప్యూటీ సీఎం జోడెద్దుల్లా పని చేస్తాం
  • విద్య, వైద్యం, ఉపాధికి భారీగా నిధులు కేటాయించామని వెల్లడి
  • ఉగాది పంచాంగ శ్రవణంలో సీఎం

హైదరాబాద్, వెలుగు: పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు నిలయంగా ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ) ఉంటుందని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి అన్నారు. కొత్తగా నిర్మించిన నగరంగా దేశంలో ఇప్పటిదాకా చండీగఢ్‌‌‌‌కు గుర్తింపు ఉన్నదని, ఇకపై ఫ్యూచర్ సిటీ మొత్తం దేశానికే ఆదర్శంగా ఉంటుందని తెలిపారు. ఎప్పుడైనా కొత్త నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి కొన్ని అడ్డంకులు తప్పవని అన్నారు. నూటికి నూరుశాతం ఆమోదం ఉండదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణానికి సీఎం రేవంత్ హాజరై మాట్లాడారు.

‘‘ఫ్యూచర్ సిటీ అనేది కేవలం పెట్టుబడులకు నిలయంగా మాత్రమే గాక, ఉద్యోగాలు, ఉపాధి కల్పించే సిటీగా.. ప్రజల నివాస ప్రాంతంగా ఉంటుంది. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందాలని విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్.. ఉగాది పచ్చడిలా షడ్రుచులతో ఉంది. వ్యవసాయ రంగ అభివృద్ధి, పేదలకు విద్య అందించేందుకు బడ్జెట్‌‌‌‌లో ప్రాధాన్యం ఇచ్చాం. పేదలకు విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నింటికి నిధులు కేటాయించాం.  దీని కోసం నేను, డిప్యూటీ సీఎం భట్టి.. జోడెద్దుల్లా పని చేస్తున్నాం. దేశంలో తెలంగాణ ఒక వెలుగు వెలగాలి. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి’’అని రేవంత్ అన్నారు. 

ప్రతి పేదోడికి సన్న బియ్యం
ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు సంపన్నులు సన్న బియ్యాన్నే ప్రతీ పేదోడికి అందాలన్న ఉద్దేశంతో ఉగాది పండుగ రోజున శ్రీకారం చుట్టామని తెలిపారు. ‘‘అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ ముందుభాగంలో నిలిచింది. తాజాగా ముగిసిన సీజన్‌‌‌‌లో 1.56 కోట్ల టన్నుల వడ్లు పండాయి. 

తెలంగాణ రికార్డు సృష్టించింది. రైతులు పండించిన సన్న బియ్యాన్నే ఇప్పుడు పేదలకు అందిస్తున్నాం. ఆదాయాన్ని పెంచాలి.. పేదలకు పెంచాలి.. అనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తున్నది. రాజకీయాలు చేయడానికి ఇది సందర్భంగా కాదు. తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన టైమ్. ప్రభుత్వ ఆలో చన, సంకల్పంలో స్పష్టత ఉంది. ప్రపంచ స్థాయిలోనే హైదరాబాద్‌‌‌‌కు గుర్తింపు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం’’అని రేవంత్ అన్నారు.