ఫార్మా గ్రామాల భూసేకరణ ఉపసంహరణ..లగచర్ల ఫార్మా విలేజ్ ​ప్రాథమిక నోటిఫికేషన్​ రద్దు

  • ప్రజాభీష్టం మేరకు సర్కారు నిర్ణయంపోలేపల్లి, లగచర్ల, హకీంపేట్ గ్రామాల్లోమొత్తం 1,358 ఎకరాలపై వెనక్కి
  • దీనికి బదులు మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్పార్క్  ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన
  • త్వరలో కొత్త భూ సేకరణ నోటిఫికేషన్​

హైదరాబాద్, వెలుగు: లగచర్లలో ఫార్మా విలేజ్​ల ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్లతోపాటు హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజీ ఏర్పాటుకు 1,358 ఎకరాల భూసేకరణ కోసం ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్​ను  శుక్రవారం ఉపసంహరించుకున్నది. అక్కడి ప్రజల అభిప్రాయం మేరకు ఫార్మా విలేజీలకు బదులుగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్​ పార్కు ఏర్పాటు చేయనున్నట్టు  ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. రాబోయే ఇండస్ట్రియల్ పార్కులో టెక్స్​టైల్, కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వనున్నట్టు తెలుస్తున్నది.

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజీల ఏర్పాటు కోసం  3 గ్రామాల్లో 1,358 ఎకరాల భూసేకరణ కోసం ప్రతిపాదించారు.ఇందులో పోలేపల్లిలో 71.39 ఎకరాలు (ప్రభుత్వ అసైన్డ్​ ల్యాండ్​), హకీంపేట లో కొంత, లగచర్ల గ్రామంలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూములను సేకరించాలని ప్రతిపాదించిన ప్రభుత్వం అక్కడ ఫార్మా విలేజ్​లు  నిర్మించాలని భావించింది. ఈ మేరకు లగచర్ల, పోలేపల్లి భూములకు సంబంధించి ఆగస్టులో ప్రాథమిక నోటిఫికేషన్​ ఇచ్చింది.

 టీజీఐఐసీ ప్రతిపాదనల మేరకు  పట్టా, అసైన్డ్​ భూములు సేకరించేందుకు జూన్ 28న తాండూరు ఆర్డీవోను భూసేకరణ అధికారిగా వికారాబాద్  కలెక్టర్​ నియమించారు.  లగచర్ల గ్రామంలోని ప్రజలు, రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లగా అక్కడ ఆందోళనలు మించిపోయి..ఏకంగా కలెక్టర్​, ప్రభుత్వ అధికారులపై దాడులకు దారితీసింది.

ఇందులోని రాజకీయ కుట్రలపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ఫార్మా కంపెనీలు కాకుండా ఇతర కంపెనీలకు అయితే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని స్థానిక ప్రజలు చెప్పడంతో ఆ మేరకు భూసేకరణ ప్రాథమిక నోటిఫికేషన్​ను ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఆయా ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలను  పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. తమ పాలనలో ఎవరినీ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని సర్కారు స్పష్టంచేసింది.

 ఇదే అంశంపై ఇటీవల లెఫ్ట్​పార్టీల నాయకులు సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు. అక్కడ పెట్టేది ఫార్మా విలేజీ కాదని ఇండస్ట్రియల్​ జోన్ అని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఫార్మా విలేజీల ఏర్పాటు కోసం భూసేకరణ ఉపసంహరించుకున్నట్టు వికారాబాద్ కలెక్టర్​కు టీజీఐఐసీ తెలిపింది. ఫార్మా విలేజీల బదులుగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం తాజాగా భూసేకరణ ప్రతిపాదనలు సమర్పించింది. దీనికి భూసేకరణ కోసం తాండూరు సబ్ కలెక్టర్​ను ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నియమించారు. త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

ప్రజాభిప్రాయం ప్రకారమే ముందుకు 

భూసేకరణ విషయంలో ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళ్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. లగచర్ల అంశమైనా, ఇంకేదైనా కూడా రైతులను, ప్రజలను ఇబ్బంది పెట్టబోమని స్పష్టం చేసింది. అందరికీ ఆమోద యోగ్యంగా ప్రజా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది. లగచర్ల, దిలావర్​పూర్​ ఇథనాల్​ ఫ్యాక్టరీ ఈ రెండూ విషయాల్లోనూ  ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సెక్రటేరియెట్​ వర్గాలు వెల్లడించాయి.

మూసీ నిర్వాసితుల అంశంలోనూ అందరితో మాట్లాడి, సంప్రదింపులు జరిపి తగిన పరిహారం ఇచ్చాకే ఖాళీ చేయిస్తున్నామని, ఎక్కడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేస్తున్నారు. ఫార్మా విలేజీల ఏర్పాటు అనేది ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తామని, స్థానికుల అభిప్రాయాలకు తగ్గట్టుగా పరిశ్రమల ఏర్పాటు ఉంటుందని  ప్రభుత్వంలోని ఒక ఉన్నతాధికారి ‘వెలుగు’కు వివరించారు. 

భూసేకరణ అధికారిగా తాండూర్ సబ్ కలెక్టర్

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం  మల్టీపర్సస్​ ఇండస్ట్రియల్​ పార్కు కోసం టీజీఐఐసీ ప్రతిపాదనల మేరకు తాండూర్ డివిజన్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్​ ప్రసాద్​ను భూ సేకరణ అధికారిగా నియమిస్తూ కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవా రం ఆదేశాలు జారీ చేశారు. పోలేపల్లి, హకీంపేట్,  లగచర్ల గ్రామాల పరిధిలో టీజీఐఐసీ డిపార్ట్​మెంట్​ద్వారా మల్టీ పర్పస్​ఇండస్ట్రియల్​​పార్క్​ నెలకొల్పడాని కి తాండూర్ ​డివిజన్ ​సబ్ కలెక్టర్/ భూ సేకరణ అధికారి గెజిట్​ నోటిఫికేషన్ ను జారీ చేస్తారని తెలిపారు.