- సర్వే షురూ.. ఇంటింటికీ వెళ్లి వివరాలు తీసుకుంటున్న ఎన్యుమరేటర్లు
- రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా నమోదు చేసుకునే చాన్స్
- ఆస్తుల లెక్కచెప్పని కొందరు
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మవివరాలూ సేకరణ
- ‘మోదీజీ.. తెలంగాణలో కులగణన సర్వే మొదలైంది’ అంటూ రాహుల్ ట్వీట్
- 50% రిజర్వేషన్ల గోడను బద్దలుకొడ్తామని కామెంట్
హైదరాబాద్, వెలుగు: సమగ్ర సర్వేలో భాగంగా వివరాల నమోదు ప్రక్రియ శనివారం నుంచి మొదలైంది. శుక్రవారం వరకు కుటుంబాలను గుర్తించి ఇంటింటికీ స్టిక్కర్లు వేసిన ఎన్యుమరేటర్లు.. ఇప్పుడు ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి కూడా అధికారులు వివరాలు సేకరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా వారి నియోజకవర్గాల్లో లేదంటే సొంతూళ్లలో తమ వివరాలు నమోదు చేసుకోనున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సైతం కొండారెడ్డిపల్లె లేదా కొడంగల్‌లో తన సమాచారం ఇస్తారని తెలిసింది. కాగా, సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్లు 75 రకాల ప్రశ్నలు అడిగి కుటుంబ వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రజలు తమ వద్ద ఆధార్, రేషన్‌కార్డు ఉంటే క్షణాల్లోనే సర్వే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఎవరికి ఎలాంటి పత్రాలు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇష్టమైతేనే వివరాలు చెప్పాలని, ఎవరైనా ఎక్కడి నుంచైనా కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. దీంతో వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నోళ్లు.. అక్కడి నుంచే సర్వేలో పాల్గొనే అవకాశం ఉంది.
కోటి 20 లక్షల కుటుంబాలు..
సర్వే సందర్భంగా ఎన్యుమరేటర్లకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వే దేనికోసం చేస్తున్నారనే విషయం పూర్తిగా ప్రజల్లోకి వెళ్లకపోవడంతో ఈ సమస్య వస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా హైదరాబాద్సిటీలో వ్యక్తిగత, ఆస్తుల వివరాలను అడగడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోనూ కొంతమంది కొన్ని వివరాలు చెప్పేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆస్తులు, భూముల వివరాలతో పాటు ప్రభుత్వం నుంచి పథకాల ద్వారా అందిన లబ్ధి సమాచారం చెప్పడం లేదు. ఇతర వివరాలను మాత్రం తెలియజేస్తున్నారు.
కాగా, రాష్ట్రంలో మొత్తం కోటి 20 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నట్టు స్టిక్కరింగ్ ద్వారా గుర్తించారని తెలిసింది. మొత్తం 85 వేల మంది ఎన్యుమరేటర్లు.. 8,500 మంది సూపర్వైజర్లు సర్వేలో పని చేస్తున్నారు. జిల్లాలకు ఇన్ చార్జులుగా ఐఏఎస్అధికారులతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా కులగణన సర్వేను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 21 వరకు వివరాల సేకరణ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్లాన్చేసింది. ఆ వెంటనే సమాచారాన్ని కంప్యూటీకరణ చేయనున్నారు. వీలైతే కొన్నిచోట్ల ఏ రోజుకారోజు వివరాలను ఆన్లైన్ ఎంట్రీ చేస్తున్నారు. మొత్తం 243 కులాలను ఫైనల్ చేసి క్యాస్ట్ కోడ్స్ లిస్ట్ చేసిన అధికారులు.. ఎస్సీ కేటగిరీలో 59, ఎస్టీలో 32, బీసీలో 134, ఓసీ కేటగిరీలో 18 కులాలు చేర్చారు.
ప్రజల సందేహాలు నివృత్తి చేయండి: భట్టి
రాష్ట్రంలో మొదలైన కులగణన సర్వేను యావత్ దేశం గమనిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సర్వేపై ప్రజలకు అనేక సందేహాలు ఉంటాయని, వాటన్నింటిని నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేపై శనివారం ఉన్నతాధికారులతో భట్టి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘సర్వే ప్రారంభమైన నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి.
ఎన్యుమరేటర్లతో కలెక్టర్లు ఎప్పటికప్పుడు మాట్లాడి ప్రజల సందేహాలేంటో తెలుసుకోవాలి. వాటిని నివృత్తి చేయాలి” అని సూచించారు. సర్వేపై మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చి.. వాళ్లు అందులో భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. సర్వేపై కలెక్టర్లతో పాటు అధికారులందరూ విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
50% రిజర్వేషన్ల గోడను బద్దలుకొడ్తం: రాహుల్
‘మోదీజీ.. తెలంగాణలో కులగణన సర్వే మొదలైంది’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం ట్వీట్ చేశారు. ‘‘ఈ సర్వే డేటాను తెలంగాణలోని అన్ని వర్గాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక రూపొందించడానికి ఉపయోగిస్తాం. త్వరలో మహారాష్ట్రలోనూ కులగణన జరగనుంది. దేశంలో సమగ్ర కులగణన జరగడం బీజేపీకి ఇష్టం లేదన్న సంగతి అందరికీ తెలుసు. మోదీజీ.. దేశవ్యాప్తంగా కులగణనను మీరు ఆపలేరు. పార్లమెంట్‌లో కులగణనను ఆమోదించి 50% రిజర్వేషన్ల గోడను బద్దలు కొట్టి చూపిస్తాం” అని అందులో రాహుల్ పేర్కొన్నారు.