
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన 10 ఏళ్లపాటు అస్తవ్యస్తంగా కొనసాగింది. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దివాలా తీసే స్థాయికి తెచ్చారు. అనేక సవాళ్ల మధ్య తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూనే.. తన మార్క్ పరిపాలనను అందిస్తున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి కల్పన వైపు తెలంగాణను నడిపిస్తున్నారు. మరోవైపు భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను రాబడుతున్నారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకును చూస్తే తెలుస్తుంది. 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే ప్రజాప్రభుత్వ పనితీరుకు ఓ సాక్ష్యం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార హోరు ఉద్యోగులు, నిరుద్యోగులు, బుద్ధిజీవులు గమనిస్తూనే ఉన్నారు. పదేండ్లు ఇబ్బందులు పడ్డ తెలంగాణ నిరుద్యోగులకు ఏడాది కాలంలో పెరిగిన విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కాబట్టి, తెలంగాణ ఉద్యోగులు, నిరుద్యోగులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ స్థితప్రజ్ఞతతో ఓటేయాల్సిన అవసరం మాత్రం ఉంది.
కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన విద్య, వైద్య రంగాలను కాంగ్రెస్ ప్రభుత్వం చాలామేరకు మెరుగుపరిచింది. గత బడ్జెట్లో విద్యకోసం మునుపెన్నడూ లేనివిధంగా రూ.21వేల కోట్ల పైచిలుకు నిధులు కేటాయించింది. రేపటి బడ్జెట్లో 15 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఉంది. త్వరలోనే పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను అందుబాటులోకి తెస్తున్నది. 105 నియోజకవర్గాల్లో రెండేళ్లలోనే ప్రతి స్కూల్ 20– 25 ఎకరాల్లో ఒక్కో స్కూల్ నిర్మాణం కోసం రూ.125 కోట్లు వెచ్చిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు కలిపి రూ.12 వేల కోట్ల వరకు ప్రజా ప్రభుత్వం విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తోంది. తద్వారా తెలంగాణ నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు భావి భారత నిర్మాణంలోనూ భాగస్వాములు కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే పట్టభద్రులు పై విషయాలుమర్చిపోయేవి మాత్రం కావు.
గురుకులాలు, స్కిల్ వర్సిటీ
గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థుల డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీలు 200 శాతం పెంచి సీఎం రేవంత్ రెడ్డి పేదల విద్య పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యాన్ని మరింత పెంచి, వారిలో ఆత్మస్థైర్యం నింపి అనేక కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే యజ్ఞాన్ని చేపట్టింది. స్పోర్ట్స్ యూనివర్సిటీ యువ క్రీడాకారులను తయారు చేయనున్నది.
ప్రభుత్వోద్యోగులకు న్యాయం జరిగింది
గత పదేండ్లలో ఒకటో తేదిన జీతాలు లభించని రోజులు చూశాం. ప్రమోషన్లు, బదిలీలు లేక నష్టపోయిన పరిస్థితులు చూశాం. ఇవాళ ప్రతి నెల ఒకటిన జీతాలిస్తున్న సర్కార్ ఇది. అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీల సమస్యలను క్లియర్ చేసిన సర్కారు ఇది.
55 వేల ఉద్యోగాల భర్తీ
అనేక ఏళ్లుగా నిరుద్యోగ సమస్య వెంటాడుతున్న క్రమంలో ఒక్క ఏడాదిలోనే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. సివిల్స్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచేలా మెయిన్స్‌కు ఎంపికైతే రూ. లక్ష, ఇంటర్వ్యూకు ఎంపికైతే మరో రూ. లక్ష అందజేస్తున్నారు. అందులోనూ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపేలా సివిల్స్ అభ్యర్ధులకు మాక్ ఇంటర్వ్యూలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది.
పెట్టుబడులతో పెరిగిన ఉద్యోగావకాశాలు
ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో భాగంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే, దావోస్ లాంటి పర్యటనలతో తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కంపెనీలు తరలివచ్చేందుకు ఒప్పందాలు చేసుకున్నది. చరిత్రలో ఎన్నడూ చూడనివిధంగా వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో రూ. 1,78,950 కోట్లు పెట్టుబడులు సాధించారు. గత ఏడాది 42 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. మొత్తంగా ఈ 15 నెలల్లోనే రూ. 2,19,182 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కొత్త కంపెనీల ఏర్పాటుతో కొత్తగా ప్రైవేట్ రంగంలోనూ దాదాపుగా ఒక లక్ష మంది ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
పేదలకు ఉచిత వైద్యం పెరిగింది
వైద్య రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనిచేస్తోంది. పేదోడిపక్షాన నిలిచేవిధంగా ఆరోగ్య శ్రీ సేవలను రూ.10 లక్షలకు పెంచింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రులకు పేరుకుపోయిన రూ. వెయ్యి కోట్ల బిల్లులు కూడా క్లియర్ చేశారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆరోగ్యశ్రీ నత్తనడక నడవడంతో వైద్యానికి దూరమైన పేదలు అనేక రకాలుగా నష్టపోయారు. ఇవాళ ఏడాది కాలంగా పేదలు ఆరోగ్యశ్రీ సేవలు సులభంగా పొందగలుగుతున్నారు. గత ప్రభుత్వం నీరుగార్చిన విద్య, వైద్య రంగాలలో ఇవాళ రేవంత్ ప్రభుత్వం మార్పు తేగలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రజాభీష్టం మేరకు ప్రజాపాలన
ఒకపక్క అప్పులకుప్పగా మారిన రాష్ట్రాన్ని అప్పుల భారం తగ్గించే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నదని ఉద్యోగులు, నిరుద్యోగులకూ తెలుసు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు పేద వర్గాలకు ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్, 25 లక్షల మంది రైతులకు రూ. 21వేల పైచిలుకు కోట్ల రుణమాఫీ, రైతు భరోసా కింద ఇప్పటివరకు 44,82,265 మంది రైతుల ఖాతాల్లో రూ. 3487.82 కోట్లు జమ, పంటకు రూ. 500 బోనస్, చిత్తశుద్ధితో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగే విధంగా కులగణన జరిగింది.
తెలంగాణ అస్తిత్వానికి గౌరవం
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, తెలంగాణ అధికారిక గేయంగా జయ జయహే తెలంగాణ, ప్రజల అభీష్టం మేరకు టీఎస్‌ను టీజీగా మార్పు, తెలంగాణ కవులు, కళాకారులకు గుర్తింపునిచ్చేలా రూ. కోటి నగదు పురస్కారం, ప్రజా యుద్దనౌక గద్దర్ పేరిట నంది అవార్డుల ప్రకటన, అర్హులైన వారికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేలా ప్రణాళికలు తెలంగాణ గ్రాడ్యుయేట్లకు తెలియని విషయాలేమీ కావు.
గ్రాడ్యుయేట్ల స్థితప్రజ్ఞతపై పూర్తి విశ్వాసం
గత పాలకుల శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలతో పదేళ్లు రాచరిక పోకడలతో అవినీతితో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కారును ఆశీర్వదించాలంటే, జరగబోతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, నిరుద్యోగులు, బుద్ధిజీవులు స్థితప్రజ్ఞతతో ఓటేస్తారని.. రేవంత్ సర్కార్‌ను దీవిస్తారనే విశ్వాసం ఉంది.
- పున్నా
కైలాష్ నేత,
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి