- సర్వే చేయకుండానే తప్పుడు నివేదిక ఇచ్చారని అధికారులపై ఆగ్రహం
శామీర్ పేట, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పలుచోట్ల గ్రామస్తులు ఆరోపించారు. సర్వే చేయకుండానే తప్పుడు నివేదిక ఇచ్చారని అధికారులను నిలదీశారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామసభను బుధవారం గ్రామస్తులు బహిష్కరించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. ప్రస్తుతం ఇండ్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 25న మరోసారి గ్రామసభను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
కీసర: కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని చీర్యాల వార్డుసభ రసాభాసగా జరిగింది. సర్వే చేయకుండానే 683 దరఖాస్తులు సర్వే చేశామని అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సర్వేను పారదర్శకంగా చేపట్టి, వార్డు సభలో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని ఎంపీడీఓ గ్యామా నాయక్, తహసీల్దార్ అశోక్ కుమార్ స్పష్టం చేశారు.
షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఇప్పలపల్లిలో బుధవారం గ్రామసభ నిర్వహించగా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో లబ్ధిదారుల లిస్ట్ సరిగ్గా లేదని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో జాబితాలో పేరు లేనివారు ఆయా పథకాల్లో కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.