ఐల్ ఆఫ్ మ్యాన్ (యూకే): తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నీలో మరో డ్రా నమోదు చేశాడు. గురువారం ఆండ్రీ ఎసిపెంకోవ్ (రష్యా)తో జరిగిన ఏడో గేమ్ 90 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన గేమ్‌లో ఈజీగా గెలిచే చాన్స్‌ను అర్జున్ మిస్ చేసుకున్నాడు. 47వ ఎత్తు వద్ద ఎసిపెంకోవ్ చేసిన తప్పిదాన్ని తెలంగాణ ప్లేయర్ గుర్తించలేకపోయాడు. రష్యన్ ప్లేయర్ వేసిన వ్యూహాన్ని తేలికగా తీసుకున్న అర్జున్ చేజేతులా పాయింట్‌ను పంచుకోవాల్సి వచ్చింది. ఈ రౌండ్ తర్వాత 5 పాయింట్లతో అర్జున్ సంయుక్తంగా రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. వొలోడర్ ముర్జిన్ (3.5)తో జరిగిన గేమ్‌ను పెంటేల హరికృష్ణ (3.5) డ్రాగా ముగించాడు. జావోకిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్ 4.5)పై గెలిచిన విదిత్ గుజరాతీ (5.5) టాప్ ప్లేస్ ఉన్నాడు. విమెన్స్ కేటగిరీలో ఆర్. వైశాలి.. బిల్బిసారా అసబయోవా (కజకిస్తాన్)పై గెలిచి నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది. ప్రస్తుతం ఆమె ఖాతాలో ఐదున్నర పాయింట్లున్నాయి. ఐరినా బుల్మాగా (రొమేనియా 4.5) చేతిలో ద్రోణవల్లి హారిక (3.5) ఓడగా, సవితా శ్రీ (2.5) కూడా.. దినారా వాగ్నెర్ (3.5) చేతిలో కంగుతిన్నది. తానియా సచ్‌దేవ్ (3).. జావెరియా బ్లీన్ (1.5)పై నెగ్గింది.
ALSO READ : శ్రీలంకపై 5 వికెట్లు .. వరల్డ్ కప్ హిస్టరీలో షమీ రికార్డు