
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు (TSPSC Group -1 Results) ఎట్టకేలకు విడుదలయ్యాయి. శుక్రవారం రాత్రి టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ఫలితాలను విడుదల చేసింది. దీంతో గ్రూప్ -1 ప్రిలిమినరీ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఒక రోజు ముందే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. వచ్చే జూన్ లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని TSPSC అధికారులు తెలిపారు. మెయిన్స్ పరీక్షా విధానాన్ని ఈనెల 18వ తేదీన వెల్లడించనున్నట్లు చెప్పారు. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్ఫత్తిలో 25,050ని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్‌సీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.
గత కొన్ని రోజులుగా న్యాయపరమైన అడ్డంకులు రావడంతో ఫలితాల విడుదల సాధ్యం కాలేదు. అయితే.. ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు గ్రూప్-1 ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.
తెలంగాణలో 503 గ్రూప్ - 1 ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను గత ఏడాది అక్టోబర్ 16న నిర్వహించింది. నవంబర్ 15న తుది కీని విడుదల చేసింది. అయితే.. రిజర్వేషన్ల విషయంలో కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లిన కారణంగా కొన్నాళ్లు గందరగోళం ఏర్పడింది. అనంతరం ఓ అభ్యర్థి స్థానికత అంశంపై కోర్టుకు వెళ్లడంతో మరికొన్ని రోజులు ఫలితాల విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే.. హైకోర్టు తాజాగా ఫలితాలను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఒక్క అభ్యర్థి విషయంలో దాదాపు లక్షల మంది అభ్యర్థులకు సంబంధించిన రిజల్ట్స్ ను ఆపడం సరికాదని అభిప్రాయపడింది. దీంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమైంది.